Privacy Display : నిజంగా అద్భుతమైన టెక్నాలజీ.. ఎలా పనిచేస్తుంది.. యూజర్లకు ఏంటి ఉపయోగం..?
Samsung Galaxy S26 Ultra Smartphone : దిగ్గజ సంస్థ శాంసంగ్ రెండు రోజుల క్రితం గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్‌ను నిర్వహించింది. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌తోపాటు గెలాక్సీ బడ్స్ 4 సిరీస్‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ S26 లో భాగంగా గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చింది. అయితే అల్ట్రా వేరియంట్ ఓ గొప్ప ప్రైవసీ ఫీచర్‌ను కలిగి ఉంది.
గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లోనూ (Galaxy Unpacked 2026) ఈ ప్రైవసీ ఫీచర్ గురించి శాంసంగ్ అనేక అంశాలను వెల్లడించింది. అదే ప్రైవసీ డిస్‌ప్లే (Privacy Display) ఫీచర్. ప్రస్తుతానికి శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లోనే ఈ డిస్‌ప్లే టెక్నాలజీని శాంసంగ్ వినియోగించింది. భవిష్యత్‌తో లాంచ్ అయ్యే మరిన్ని మోడల్స్ ఈ డిస్‌ప్లే టెక్నాలజీతో విడుదలయ్యే అవకాశం ఉంది.

అసలేంటి ఈ ప్రైవసీ డిస్‌ప్లే.. యూజర్లకు ఎలా ఉపయోగపడుతుంది?
సాధారణంగా బస్సులు, రైళ్లలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తుంటాం. బ్యాంకింగ్ లావాదేవీలు లేదా ఫ్రెండ్స్, ఫ్యామిలీతో చాటింగ్ చేస్తుంటాం. అయితే పక్కన కూర్చున్న వారు మన ఫోన్ స్క్రీన్ వైపు తొంగి చూసేందుకు ఆస్కారం ఉంటుంది. అలాంటి సందర్బాల్లో కొంత అసౌకర్యానికి గురవుతుంటాం.
ప్రైవసీ డిస్‌ప్లే టెక్నాలజీ :
ఇలాంటి సమస్యలకు శాంసంగ్ చెక్ పెట్టింది. ప్రైవసీ డిస్‌ప్లేతో గెలాక్సీ S26 అల్ట్రా మోడల్‌ను లాంచ్ చేసింది. ఫోన్‌లో ప్రైవసీ డిస్‌ప్లే కారణంగా కేవలం ఫోన్‌ను ఎదురుగా చూసే వారికే స్పష్టంగా కనిపిస్తుంది. పక్క నుంచి చూసే వారికి స్క్రీన్ బ్లాక్ లేదా బ్లాంక్‌గా కనిపిస్తుంది.

హార్డ్‌వేర్ స్థాయిలోనే :
శాంసంగ్ ఈ ఫీచర్‌ను సాఫ్ట్‌వేర్ పరంగా కాకుండా, హార్డ్‌వేర్ స్థాయిలోనే తీసుకొచ్చింది. ఇందుకోసం Flex Magic Pixel టెక్నాలజీని వినియోగించింది. అయితే ఇప్పటికే డిస్‌ప్లే ప్రైవసీ కోసం మార్కెట్‌లో కొన్ని ప్రైవసీ గార్డులు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ స్క్రీన్ లైటింగ్‌ను నియంత్రిస్తాయి. వినియోగం కూడా కొంత అసౌకర్యంగా ఉంటుంది.
నచ్చిన సమయాల్లో ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయ్యేలా :
శాంసంగ్ అభివృద్ధి చేసిన ప్రైవసీ డిస్‌ప్లే టెక్నాలజీ యూజర్‌కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వినియోగించుకొనే విధంగా ఉంటుంది. ఎంచుకున్న సమయాలు, సందర్భాల్లో ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయ్యేలా సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవచ్చు.

ఉదాహరణకు బ్యాంకింగ్ లేదా ఇతర నోటిఫికేషన్‌లు వచ్చిన సమయాల్లో ఈ ప్రైవసీ డిస్‌ప్లే ఫీచర్ ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యేలా మార్పులు చేసుకోవచ్చు. లేదా ఎల్లప్పుడూ పక్కవారికి డిస్‌ప్లే కనిపించకుండా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అయితే ఈ ప్రైవసీ డిస్‌ప్లే యాక్టివేట్ చేసినా, డిస్‌ప్లే బ్రైట్‌నెస్, క్లారిటీలో ఎటువంటి అసౌకర్యం కలగదని శాంసంగ్ చెబుతోంది.
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ప్రైవసీకి అనేక మంది ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి వారికి ఈ ఫీచర్ ఎంతగానే ఉపయోగపడే అవకాశం ఉంది.

* శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2X ప్రైవసీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 ప్రొటెక్షన్‌ను పొందుతుంది. దీంతోపాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8.5 పైన పనిచేస్తుంది. 7 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. 60W వైర్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. వైర్‌లెస్, రివర్స్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది.
కెమెరా విభాగం పరంగా 200MP OIS కెమెరా, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. 8K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి. 12MP సెల్ఫీ కెమెరా ఉంది. 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,39,999 గా ఉంది. 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.1,59,999, 16GB ర్యామ్ + 1TB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,89,999 గా ఉంది. ప్రస్తుతం ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. మార్చి 11 నుంచి సేల్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications








