మొబైల్ ప్లాంట్ విస్తరణ పనుల్లో శ్యామ్‌సంగ్

Posted By: Super

మొబైల్ ప్లాంట్ విస్తరణ పనుల్లో శ్యామ్‌సంగ్

శరవేగంగా వృద్ధి చెందుతున్న భారత్ మొబైల్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ నోయిడాలోని మొబైల్ తయారీ ప్లాంటు సామర్థ్యాన్ని రూ.330 కోట్ల పెట్టుబడితో విస్తరించింది. దీంతో ప్రస్తుతం ఏటా 1.20 కోట్ల హ్యాండ్‌సెట్లు తయారీ చేస్తున్న ఈ ప్లాంటు సామర్థ్యం మూడు రెట్లకు(3.6 కోట్లు) పెరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటైన మీడియా సమావేశంలో శామ్‌సంగ్ నైరుతి ఆసియా ప్రెసిడెంట్ జేఎస్ షిన్ మాట్లాడుతూ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఇక్కడ తమ ఉత్పాదక కేంద్రాన్ని విస్తరిస్తున్నామని చెప్పారు..

శామ్‌సంగ్‌కు వివిధ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తయారు చేసే కేంద్రాలు నోయిడా, చెన్నైలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేస్తున్న ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేయడానికి కావల్సిన ఆర్‌అండ్‌డీ కేంద్రాలు నోయిడా, బెంగళూరుల్లో ఉన్నాయి. ఈ మొబైల్ ప్లాంట్ తాజా విస్తరణ వల్ల కొత్తగా 1,500 ఉద్యోగాల కల్పన జరుగుతుందని, దీంతో ప్లాంటులో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,000కు మించుతుందని షిన్ చెప్పారు.

భారత్ మొబైల్ మార్కెట్‌లో తమ వాటా 28 శాతంగా ఉందని, ఈ ఏడాది భారీగా 70 శాతం వృద్ధిని సాధించినట్లు శామ్‌సంగ్ ఇండియా కంట్రీహెడ్ రంజిత్ యాదవ్ తెలిపారు. నోయిడా యూనిట్లో రూ.1,000 నుంచి రూ.32,000 వరకు ధర కలిగిన 60 రకాల మోడల్స్ తయారవుతాయని ఆయన చెప్పారు. మొబైల్స్‌తో సహా శామ్‌సంగ్ ఇతర ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అమ్మకాల వృద్ధి 40-50 శాతం మధ్య ఉందని, ఈ ఏడాది స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 1.4 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot