వైదొలిగే ప్రసక్తే లేదు, వేలంలో పాల్గొంటాం: యునినార్

Posted By: Staff

వైదొలిగే ప్రసక్తే లేదు, వేలంలో పాల్గొంటాం: యునినార్

 

దేశీయ మొబైల్ ఫోన్ సర్వీసుల మార్కెట్ నుంచి తప్పుకునే ఉద్దేశమేలేదని యునినార్ మేనేజింగ్ డైరెక్టర్ సిగ్వె బ్రెక్కె స్పష్టం చేశారు. 14 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన తాము ఒక్కసారిగా భారత టెలికాం మార్కెట్ నుంచి వైదొలిగే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తాము 4 కోట్ల మంది కస్టమర్లకు మొబైల్ ఫోన్ సేవలు అందిస్తున్నామని, రానున్న కాలంలో కూడా తమ సర్వీసులు కొనసాగుతాయన్న విశ్వాసంతో ఉన్నట్టు ఆయన చెప్పారు. గురువారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా బ్రెక్కె విలేకరులతో మాట్లాడారు.

2008 సంవత్సరంలో అప్పటి టెలికాం శాఖ మంత్రి ఎ రాజా ఇచ్చిన 122 టెలికాం లైసెన్స్‌లను రద్దు చేస్తూ గత వారంలో సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన విష యం తెలిసిందే. దీని కారణంగా యునినార్ లైసెన్స్‌లు కూడా రద్దు కానున్నాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో నాలుగు నెలల కాలంలో 13 సర్కిళ్లలో యునినార్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. అయితే తమ సర్వీసులను కొనసాగించేందుకు గాను కొత్తగా ప్రభుత్వం జరిపే 2జి స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొంటామని బ్రెక్కె పేర్కొన్నారు. ఈ బిడ్డింగ్‌లో లైసెన్స్‌లు సొంతం చేసుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఈ వేలంలో పాత టెలికాం కంపెనీల నుంచి భారీ స్థాయిలో పోటీలేకుండా ఉండేందుకుగాను కొత్త టెలికాం ఆపరేటర్లను మాత్రమే అనుమతించాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి సూచించినట్టు చెప్పారు. 2జి స్పెక్ట్రమ్ వేలం మార్గదర్శకాల రూపకల్పనలో తమ అభిప్రాయాలను కూడా ట్రాయ్ పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. కమ్యూనికేషన్ల శాఖ మంత్రి కపిల్ సిబాల్ కూడా కలిసి తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు చెప్పారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot