మాట్లాడుతున్న కొద్దీ ఛార్జింగ్ అయ్యే మొబైల్

Posted By: Staff

మాట్లాడుతున్న కొద్దీ ఛార్జింగ్ అయ్యే మొబైల్

లండన్‌: మొబైల్‌ ఫోన్‌ బ్యాటరీ చార్జింగ్‌ చేసుకోవటానికి సులువైన పద్ధతిని పరిశోధకులు అభివృద్ధి చేశారు. మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతున్నంతసేపు బ్యాటరీ చార్జ్‌ అవటం దీనిలో ప్రత్యేకత. దక్షిణ కొరియాలోని సున్గ్‌క్యుంక్‌ వాన్‌ యూనివర్సిటీలోని నానో టెక్నాలజీ సంస్థకు చెందిన ఎలక్ట్రికల్‌ ఇంజనీర్లు మాటలనుంచి వెలువడే శబ్దాన్ని విద్యుత్‌గా మలిచే ప్రక్రియను అభివృద్ధిచేశారు. ఈ ప్రక్రియలో మాట్లాడుతున్న సమయంలోనే కాక ఫోన్‌ను ఉపయోగించనప్పుడు కూడా ఫోన్లో లోడ్‌చేసుకున్న సంగీతం పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ శబ్దాల సహాయంతో కూడా బ్యాటరీ చార్జింగ్‌ చేసుకునే వీలుంది.

ఈ పరిశోధనలకు నాయకత్వం వహించిన డాక్టర్‌ సాంగ్‌ వూ కిమ్‌ తమ పరిశోధన వివరాలను వెల్లడి చేస్తూ పర్యావరణం నుంచి విద్యుత్‌ను ఉత్పాదనకోసం అనేక ప్రక్రియలపై శోధించామన్నారు.
‘శబ్దం మన జీవితంలో, పర్యావరణంలో అన్ని వేళలా ఉంటుందని, అయితే దానిని మనం వనరుగా భావించటం లేదని’ అన్నారు. శబ్దంతో మొబైల్‌ ఫోన్లకు అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేయటంతో పాటుగా, హైవేల కిరువైపుల శబ్ద గ్రాహ్యకాలను అమర్చి వాహనాల నుంచి వెలువడే శబ్దంతో విద్యుత్‌ను పుట్టించ వచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో జింక్‌ ఆకై్సడ్‌తో కూడిన అతిచిన్న తీగ చుట్టలను రెండు ఎలక్ట్రోడ్ల మధ్య అమర్చుతారు.

దానిపైన పలుచని శబ్ద గ్రాహ్యకాలను ఉంచుతారు. శబ్ద తరంగాలు శబ్ద గ్రాహ్యకాన్ని డీకొనటంతో కంపనాలు ఉత్పత్తి అయి జింక్‌ ఆకై్సడ్‌ తీగలు కుచించుకపోయి విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందన్నారు. ఇదే రీతిలో ట్రాఫిక్‌ నుంచి ఉత్పత్తి అయిన 100 డెసిబిల్స్‌ శబ్ద తీవ్రత నుంచి 50 మిల్లీ వోల్ట్‌ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని ఇంజనీర్లు తెలిపారు. అయితే ఈ తరహాలో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ ఒక మొబైల్‌ ఫోన్‌కు సరిపోదని తీగలను మార్చటం వల్ల మరింత విద్యుత్‌ను ఉత్పత్తిచేయవచ్చని కిమ్‌ తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot