హ్యాకింగ్ భయంతో వణికిపోతున్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్

Posted By: Super

హ్యాకింగ్ భయంతో వణికిపోతున్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్

న్యూఢిల్లీ: భారత్‌లో ఆన్‌లైన్‌ను ఉపయోగించుకొనే వారు వారి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ అకౌంట్‌ హ్యాకర్ల దాడికి గురి అవుతాయేమోనని ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని ఒక అధ్యయనంలో వెల్లడి అయింది. మైక్రోసాఫ్ట్‌ ఇండియా ఒక సర్వే జరపతలపెట్టి 'విండోస్‌ అండ్‌ మి' ఫేస్‌బుక్‌ పేజీలో కొన్ని ప్రశ్నలను ఉంచింది. దీనికి వేలాది వినియోగదారులు స్పందించారంటూ సర్వే వివరాలను సోమవారం తెలియజేసింది. సర్వేకు ప్రతిస్పందించిన వారిలో దాదాపు 74 శాతం మంది వారి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ అకౌంట్‌ హ్యాకర్ల బారిన పడుతుందేమోనని భయపడుతున్నారట. ఇక సైబర్‌ ప్రపంచంలో వ్యక్తిగత సమాచారాన్ని నష్టపోవలసి వస్తుందేమోనని బెంగటిల్లుతున్న వారు 16 శాతం మంది ఉన్నారు. క్రెడిట్‌ కార్డు మోసాల గురించి దిగులుపడుతున్న వారు 5 శాతం లెక్క తేలారు. బిగ్‌అడ్డా, ఫేస్‌బుక్‌, ఫ్లిక్‌ఆర్‌, ఐబిబో, లింక్డ్‌ఇన్‌, మౌత్‌షట్‌డాట్‌కామ్‌, మైలైఫ్‌, మైస్పేస్‌, ఆర్కుట్‌, ట్విటర్‌లు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లలో కొన్ని అన్నది తెలిసిందే.

అభిప్రాయాలు పంచుకొన్న వారిలో దాదాపు సగం మంది తాము రోజుకు 5 గంటల పాటు ఇంటర్‌నెట్‌కు వెచ్చిస్తున్నట్లు జవాబిచ్చారు. ఇతరులతో ఆన్‌లైన్‌ సంప్రదింపులు జరపడం పలువురికి నచ్చిన వ్యాపకంగా ఉంది. ఇతర కీలక కార్యకలాపాలలో పరిశోధన (35 శాతం), వినోదం (22 శాతం) ఉన్నాయి. సైబర్‌ దాడులకు బాధితులం అయినట్లు దాదాపు నాలుగింట ఒక వంతు (23 శాతానికి పైగా) తెలియజేశారు. ఇందులో 67 శాతం మంది వ్యక్తిగత సమాచారం పోగొట్టుకొన్నామని చింతించారు. ఇ-మెయిల్‌ అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయని 19 శాతం యూజర్లు ఆక్రోశించారు.

దాదాపు 90 శాతం భారతీయులు వారి పర్సనల్‌ కంప్యూటర్‌లలో యాంటీ-వైరస్‌ సొల్యూషన్‌ నెలకొల్పుకొన్నట్లు పేర్కొన్నారు. అయితే 62 శాతం మంది వారి పీసీలో యాంటీ-వైరస్‌ను నెలకొల్పాక అంతటితో తమ పని ముగిసినట్లు భావించారు. దీనర్థం భారతీయ వినియోగదారులకు సైబర్‌ దాడుల విపరిణామాలను గురించిన పూర్తి స్పృహ ఇంకా రాలేదనే భావించాలని అధ్యయనం తెలిపింది. ఆన్‌లైన్‌ భద్రతకు ప్రమాదం సృష్టించే సైబర్‌ దాడులు అంతకంతకు పెచ్చు పెరుగుతున్నట్లు అధ్యయనం ప్రస్తావించింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot