ఈ కార్డ్‌తో మీ ప్రయాణం హాయి హాయిగా సాగిపోవును

Posted By: Staff

ఈ కార్డ్‌తో మీ ప్రయాణం హాయి హాయిగా సాగిపోవును

ఇకపై ఒకే కార్డుతో దేశమంతా ప్రయాణించొచ్చు. జేబులో నగదు లేకున్నా ప్రయాణానికి ఢోకా ఉండదు. కార్డులో నగదు నిల్వ ఉంటే చాలు. రైలు, బస్సు, టాక్సీ, మెట్రో ఇలా అన్నింటికీ ఒకటే టికెట్‌. రవాణా వ్యవస్థ మారితే వేరే టికెట్‌ తీసుకోవాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌.. ఇలా అన్ని రాష్ట్రాల్లో కొత్తగా తీసుకురానున్న కార్డు చెల్లుబాటు అవుతుంది. ఈ మేరకు సమీకృత రవాణా కార్డు(కామన్‌ మొబిలిటీ కార్డు) తీసుకువచ్చేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సిద్ధమైంది. ఇప్పటికే మార్గదర్శకాలు జారీచేసిన ఆ శాఖ, తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో, బీఆర్‌టీఎస్‌ ప్రాజెక్టులు అమలుచేయనున్న నగరాలు ప్రతిపాదనలు పంపాలని సూచించింది.

ప్రాజెక్టు ఖర్చు భరించనున్న కేంద్రం ఈ ప్రాజెక్టును ఆరు నెలల నుంచి ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ముందుకు రావాలని కోరింది. పేపరు టికెట్‌ కారణంగా అక్రమాలు పెరుగుతున్నాయి. నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ కారణంగా వివిధ నగరాల రవాణా వ్యవస్థలన్నిటినీ ఒకేగొడుగు కిందకు తీసుకువచ్చి టికెట్టు వ్యవస్థను క్రమపద్ధతిలోకి తీసుకురానున్నారు.

ఎవరిస్తారు?: సీఎంసీ కార్డు జారీ బాధ్యత యూటీఐ మౌలిక సదుపాయాల సాంకేతిక సంస్థ చేపడుతుంది. ఇప్పటికే ఈ ప్రభుత్వ రంగ సంస్థ శాశ్వత ఖాతా నెంబరు(పాన్‌) కార్డులు జారీ చేసింది. ఈ కార్డు ఏటీఎం కార్డు మాదిరి పనిచేస్తుంది. రోజువారీ ప్రయాణికుడికి పాసులా, ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణం చేసే వారు టికెట్టుగా వినియోగించుకోవచ్చు. సేవల ఉపయోగం మేరకు బ్యాలెన్సు తగ్గుతూ వెళ్తుంది. కొన్ని సందర్భాల్లో చేతిలో డబ్బు లేకున్నా రోజువారీ ప్రయాణానికి ఎలాంటి ఆటకం కలగదని అధికారులు చెబుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot