ఇలా చేస్తేనే రైల్వే తత్కాల్ టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.. కీలక ప్రకటన చేసి రైల్వే శాఖ..!
Railway Tatkal tickets Rules : ఇండియన్ రైల్వే ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కలిగిన వారు స్లీపర్, AC బోగీల్లో ప్రయాణం చేయకుండా మే 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. గత వారం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో కీలక మార్పులు తీసుకురానున్నట్లు ప్రకటన చేశారు. తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం ఆధార్ ను తప్పనిసరి చేస్తామని చెప్పారు. దీనిపై తాజాగా రైల్వే శాఖ అన్ని జోన్లకు సర్క్యులర్ జారీ చేసింది.
తత్కాల్ టికెట్ల బుకింగ్‌పై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఏజెంట్లు సహా ఇతర వ్యక్తులే టికెట్లు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని, సామాన్య ప్రజలు బుకింగ్ చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా రైల్వే తీసుకున్న నిర్ణయం సాధారణ ప్రయాణికులకు మేలు చేసే అవకాశం ఉంది.

IRCTC వెబ్‌సైట్ మరియు యాప్‌లో ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని రైల్వేశాఖ స్పష్టం చేసింది. జులై 1 నుంచి ఈ కొత్త నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. దీంతోపాటు మరో నిర్ణయాన్ని కూడా ప్రకటన చేసింది.
జులై 15 నుంచి తత్కాల్ బుకింగ్ కోసం ఆధార్ కార్డుకు జతచేసిన ఫోన్ నంబర్‌కు వచ్చే OTP ను కూడా నమోదు చేయాలని ఉంటుందని వెల్లడించింది. రైల్వే బుకింగ్ కౌంటర్లు, సంబంధిత ఏజెంట్లు కూడా తత్కాల్ బుకింగ్ సమయంలో OTP ను నమోదు చేయాలని స్పష్టం చేసింది.
ఈ విధానం ద్వారా ఇతరులు తత్కాల్ బుకింగ్ చేయకుండా నియంత్రించవచ్చని భావిస్తోంది. దీంతోపాటు ఏజెంట్లకు తత్కాల్ బుకింగ్ సమయాల్లో మార్పులు చేసింది. ప్రస్తుతం రోజు ఉదయం 10 గంటలకు AC తత్కాల్ కోటా ఓపెన్ అవుతుంది. అదే 11 గంటలకు నాన్ ఏసీ తత్కాల్ కోటా టికెట్లు ఓపెన్ అవుతాయి.
అయితే ఏజెంట్లు ఆ సమయాల్లో టికెట్లు బుకింగ్ చేయకుండా నియంత్రించింది. ఏజెంట్లు ఏసీ తత్కాల్ టికెట్ల కోసం ఉదయం 10:30, నాన్ ఏసీ టికెట్ల కోసం 11:30 గంటలకు మాత్రమే బుకింగ్ చేసుకొనే అవకాశం ఉంటుంది. తాజా మార్పులకు అనుగుణంగా IRCTC, రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మార్పులు చేసుకోవాలని రైల్వే శాఖ సూచనలు చేసింది.
* మే 1 నుంచి వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు ఏసీ, స్లీపర్ కోచ్‌లలో ప్రయాణం చేయకుండా చర్యలు తీసుకుంది. వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో ప్రయాణం చేస్తే భారీగా జరిమానా విధిస్తోంది. స్లీపర్ కోచ్‌లో వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో ప్రయాణం చేస్తూ అధికారులకు దొరికితే రూ.250 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదే AC కోచ్‌లో రూ.440 చెల్లించాల్సి ఉంటుంది.
జరిమానా చెల్లించిన అనంతరం తర్వాత స్టేషన్‌లో జనరల్ కోచ్‌లోకి మారాల్సి ఉంటుంది. రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణం చేయడం మరియు రద్దీ నియంత్రణకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
* దీంతోపాటు రైల్వే టికెట్ల బుకింగ్ సహా అన్ని రకాల సర్వీసుల కోసం ఇటీవలే స్వరైల్ యాప్‌ను రైల్వే శాఖ లాంచ్ చేసింది. అయితే ప్రస్తుతం యాప్ బీటా వెర్షన్‌లోనూ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. సాధారణ వెర్షన్‌లో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతం టికెట్ల బుకింగ్ కోసం IRCTC రైల్ కనెక్ట్ యాప్ మరియు జనరల్, ప్లాట్‌ఫాం టికెట్ల కోసం UTS యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








