‘ఆకాష్’కు ఆదరణే ఆదరణ!!

Posted By: Staff

‘ఆకాష్’కు ఆదరణే ఆదరణ!!

 

చౌక ధరల కంప్యూటర్లు ఈ ఏడాది దేశీయ మార్కెట్లో రాజ్యమేలనున్నాయి. ప్రపంచంలోనే కారుచౌక టాబ్లెట్ పీసీ ‘ఆకాష్’కు అనూహ్యస్థాయిలో ఆదరణ లభిస్తోంది. ఆన్‌లైన్‌లో అమ్మకాలు ప్రారంభించిన రెండువారాల్లో 14 లక్షల ఆకాష్ టాబ్లెట్ యూనిట్ల కోసం ఆర్డర్లు బుక్ అయ్యాయంటే డిమాండ్ ఏస్థాయిలో వుందో తెలుస్తుంది.

ఆన్‌లైన్ అమ్మకాల్లో దీని ధర రూ.2500గా నిర్ణయించారు. విపరీతమైన ఈ డిమాండ్‌ను పూర్తిచేసేందుకు బ్రిటన్‌కు చెందిన వ్యాపార సంస్థ డాటావిండ్ ఆకాష్ టాబ్లెట్ అసెంబ్లింగ్ కోసం కొత్తగా కొచ్చిన్, నోయిడా, హైదరాబాద్‌లో మూడు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రజల నుంచే కాకుండా పరిశ్రమల నుంచి ఆకాష్‌కు ఆదరణ వస్తోందని, ఇంత భారీ డిమాండ్‌ను తాము ఊహించలేదని డాటావిండ్ సిఇఓ సునీత్ సింగ్ ఓ వార్తాపత్రికకు తెలిపారు.

ఏప్రిల్ నాటికి కొత్త ప్లాంట్లు పనిచేస్తాయని, అప్పుడు రోజుకి 70వేల నుంచి 75 వేల యూనిట్లు సరఫరా చేసేందుకు నిశ్చయించామని ఆయన పేర్కొన్నారు. ఈ కామర్స్ ప్రొవైడర్ నౌకరి డాట్‌కామ్ ద్వారా తొలివిడతగా 30వేల ఆకాష్ యూనిట్లు ఆన్‌లైన్ అమ్మకానికి పెట్టామని, అవన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయని సునీత్‌సింగ్ తులి వెల్లడించారు. కాగా, ఆకాష్ కొత్త మోడల్ టాబ్లెట్ యుబిస్లేట్ 7 (ధర రూ. 2999) ఆన్‌లైన్ అమ్మకాలు ఈనెల మూడోవారంలో ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot