కంటిచూపుతో పని చేసే ల్యాప్‌టాప్‌, ఐ ట్రాకింగ్ టెక్నాలజీ

Posted By: Staff

కంటిచూపుతో పని చేసే ల్యాప్‌టాప్‌,  ఐ ట్రాకింగ్ టెక్నాలజీ

సినిమాలో బాలయ్య 'కంటి చూపుతో చంపేస్తా..' అంటూ ఓ డైలాగ్ చెబుతాడు. అయితే కంటిచూపు తో చంపడం భవిష్యత్తులో సాధ్యమవుతుందో ఏమో తెలియదుగానీ.. ప్రస్తుతానికి కంటిచూపు తో పని చేసే ల్యాప్‌టాప్‌ను మాత్రం శాస్త్రవేత్తలు రూపొందించారు.

ఇప్పటి వరకు డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లపై పని చేయడానికి మనం కీబోర్డు, మౌస్‌లను ఉపయోగిస్తూ వస్తున్నాం. అయితే టచ్‌స్కీన్ విప్లవం మొదలవడంతో ఇలాంటి పరిజ్ఞానంతో కూడిన డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. జస్ట్..మన వేలి కొనలతో స్క్రీన్‌ని టచ్ చేయడం ద్వారా ఇవి పనిచేస్తాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ల్యాప్‌టాప్‌ను వేలి కొనలతో ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్.. మన కంటి చూపుతోనే మెనూను సెలెక్ట్ చేయవచ్చు, ఏదైనా ఫోల్డర్‌ను ఓపెన్ చేయవచ్చు.

ఓ ఐకాన్‌ను లాగి ట్రాష్‌లో పడేయవచ్చు. మ్యూజిక్ ప్లే చేయవచ్చు.. ఫోటోలు, వీడియో ఫైల్స్‌ను కూడా ఓపెన్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే క్లోజ్ చేయవచ్చు.టోబి అనే కంపెనీ ఈ రకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది . ఈ టెక్నాలజీ కలిగి ఉన్న Desktop లేదా Laptop యూజర్ల కళ్ల కదలికలను పసిగట్టి వారికేం కావాలో అర్థం చేసుకుని కంప్యూటర్‌ను ఆ రకంగా నియంత్రిస్తూ ఉంటుందన్నమాట. యూజర్లు తమ వైపు చూస్తున్నారా లేదా అన్న విషయాన్ని కూడా ఇవి గమనించుకుంటాయి. ఒకవేళ చూడడం లేదని అర్థమవగానే వాటంతట అవే screensaver మోడ్‌లోకి వెళ్లిపోతాయి. మళ్లీ ఎవరైనా యూజర్ తమ వైపు చూడగానే తిరిగి ఆటోమేటిక్‌గా మానిటర్ ఆన్ అయిపోతుంది.

ఇదీ ఉపయోగం.. డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లపై పనిచేస్తున్నప్పుడు మన కాన్‌సంట్రేషన్ మొత్తం దానిమీదే పెట్టాల్సి ఉంటుంది. తరచూ కీబోర్డు, మౌస్‌లను ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. వీటిని ఉపయోగిస్తున్న సమయంలో మనం మరో పని చేసుకోలేం. కానీ ఈ ఐ ట్రాకింగ్ టెక్నాలజీ తో కూడిన ల్యాప్‌టాప్‌లు అలా కాదు.. వీటిపై పని చేసుకుంటూనే మనం ఇతర పనులు కూడా చేసుకోవచ్చు.

ఉదాహరణకు మీరు ఆఫీసుకు వెళ్లగానే ఒక ప్రెజంటేషన్ ఇవ్వాలి. మీకు ఎక్కువ సమయం లేదు. అయినా సరే మీరు మీ ల్యాప్‌టాప్‌ను ఓపెన్ చేసి ఒకవైపు మీరు డ్రస్ చేసుకుంటూనే మరోవైపు మీ కళ్ల కదలికల ద్వారా ప్రెజెంటేషన్‌ను తయారు చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌ను డైనింగ్ టేబుల్‌పై పెట్టుకుని.. ఒకవైపు బ్రేక్‌ఫాస్ట్ చేస్తూనే మరోవైపు అర్జెంట్ లెటర్ టైప్ చేసుకోవచ్చు. అయితే ఈ తరహా ల్యాప్‌టాప్‌లు మార్కెట్‌లోకి విడుదల అవడానికి మరో రెండేళ్ల సమయం పడుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot