Ahchoo..టిక్‌టాక్‌ను ఊపేస్తున్న కొత్త ఛాలెంజ్,వెర్రిపట్టిస్తోంది
టిక్‌టాక్ ఈ యాప్ గురించి పరిచయం చేయనవసరం లేదు. వచ్చిన అనతి కాలంలోనే దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. బ్యాన్ చేసినప్పటికీ దాని సునామి ఆగలేదు. మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ దాని వెంటే పడుతున్నారు. యూజర్లకు అనుగుణంగా టిక్‌టాక్ కూడా కొత్త కొత్తగా ముందుకు దూసుకువెళుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు Ahchoo అంటూ కొత్త ఛాలెంజ్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఈ ఛాలెంజ్ టిక్‌టాక్‌ను ఊపేస్తోంది. యూజర్లు తుమ్మడమే ఈ ఛాలెంజ్ . తుమ్మితే సరిపోదు. తుమ్మగానే ఏదో ఓ అద్భుతం జరిగిపోవాలి.

ఈ ఛాలెంజ్ స్వీకరించినవాళ్లంతా వీడియోలో తెగ తుమ్మేస్తున్నారు. వీడియో చూసేవారికి షాకిస్తున్నారు. అసలే ఇలాంటి క్రేజీ వీడియోలకు వేదికైన టిక్‌టాక్‌లో ఛాలెంజ్ అంటే యూజర్లు సైలెంట్‌గా ఉంటారా? ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. తమ క్రియేటివిటీనంతా రంగరించి వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. వాటిని టిక్ టాక్‌లో పోస్ట్ చేసి లైకులతో పాటు ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఈ సంధర్భంగా టిక్‌టాక్ ద్వారా జరిగిన వింతలు విశేషాలు ఓ సారి గుర్తు చేసుకుందాం.

పసికందులను ఎగరేస్తూ..
ఒడిశాలోని ఓ ఆసుపత్రిలో నర్సులు చేసిన టిక్ టాక్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే నర్సులు పసిపిల్లల వార్డులో విధులకే కేటాయించారు అధికారులు. అయితే చేయాల్సిన పనులు చేయకుండా చేయకుండా ఆసుపత్రిలో టిక్ చేస్తూ బాలీవడ్ పాటలకు పదం కదుపుతూ పసిబిడ్డలను ఎత్తుకుని ముద్దు పెడుతూ, ఫన్నీ డైలాగులు చెబుతూ టిక్‌టాక్‌లో వీడియోలు రికార్డు చేసి అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో షేర్స్, కామెంట్లు వస్తుండటంతో తెగ సంబురపడిపోయారు నర్సులు. కానీ అదే వీడియో వారి కొలువులకే ఎసరు పెడుతుందని వారు ఉహించలేదు. ఈ వీడియో కాస్తా జిల్లా ముఖ్య వైద్య అధికారి (సిడిఎంఓ) కంటపడింది. ఇక ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి ఈ విషయంపై దర్యప్తుకు ఆదేశించారు. అలాగే సదరు నర్పులకు షోకాజ్ నోటిసులు కూడా జారీ చేశారు. దీనిపై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పిస్తున్నమని ఆసుపత్రి ఇన్ చార్జ్ తపన్ కుమార్ వెల్లడించారు. ఇక ఈ దర్యాప్తు తరువాత అవసరమైతే సదరు నర్సులను ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం కూడా ఉంది.

విషం తాగుతూ
ఓ మహిళ టిక్‌టాక్ చేస్తూ ఏకంగా విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. కలకలం రేపుతున్న ఈ విషాద ఘటన తమిళనాడులోని పెరంబూర్‌లో చోటుచేసుకుంది. ఎప్పుడు చూసినా భార్య టిక్‌టాక్ వాడుతోందని భర్త మందలించాడు. వాటిని పక్కనబెట్టి పని చూసుకోవాలని హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన వివాహిత.. భర్త తిట్టాడని చెప్పి ఓ భార్య టిక్‌టాక్ చేస్తూ విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. బయటనుంచి ఇంటికి వచ్చిన భర్త భార్య అచేతనంగా పడి ఉండటాన్ని గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మెడ విరగ్గొట్టుకున్న యువకుడు
టిక్‌టాక్‌లో గాల్లోకి ఎగిరే వీడియో చేస్తూ మెడ విరగ్గొట్టుకున్న యువకుడు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా గూడెకెరె నివాసి కుమార్ (26) ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్నేహితుడి సాయంతో గాల్లోకి ఎగిరే స్టంట్ చేశాడు. అదికాస్తా వికటించి కుమార్ మెడ, వెన్నుముక విరిగిపోయింది. దీంతో స్నేహితులు, కుటుంబసభ్యులు కుమార్‌ను చికిత్స నిమిత్తం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించి డాక్టర్లు వెన్నుముక బాగా దెబ్బతిందని, దీంతో శరీరం మొత్తం పక్షవాతానికి గురైందని చెప్పడంతో ఫ్యామిలీ షాకైంది. పరిస్థితి విషమించడంతో కుమార్ ఆదివారం మృతి చెందడంతో అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ప్రస్తుతం హారన్ చాలెంజ్ టిక్‌టాక్ యూజర్స్ దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇందులో అంతా నిశ్శబ్ధంగా ఉండి ఒక్కసారిగా బస్ హారన్ శబ్దం మాత్రమే వినపడుతుంది. బస్ హారన్ ఎలా కొడతారో ఎదుటివారి మొహాన్ని కూడా అదే విధంగా ప్రెస్ చేస్తారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఘొల్లుమని నవ్వుతారు. ఎవరిని మొహాన్నైతే హారన్‌లా ప్రెస్ చేస్తారో వారి ముఖంలో చిత్రవిచిత్రాలుగా హావభావాలు ఒకేసారి కనిపిస్తాయి. ఇది మరింత హాస్యానికి కారణమవుతుంది. గతవారం నూడుల్ డ్యాన్స్, గడ్డం చాలెంజ్‌తో ఊదరగొట్టగా నేడు ఫన్నీగా ఉండే 'హారన్ చాలెంజ్’ హాట్ ట్రెండ్‌గా నిలిచింది. చాలామంది యూజర్లు వాటికి అంతే ఫన్నీగా వీడియోలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications