పండిన పుచ్చకాయ కొనడానికి ChatGPT సాయం.. వైరల్ వీడియో చూస్తే మతిపోతుంది!
ChatGPT Watermelon fruit selection: ఏఐ (Artificial Intelligence)... అంటే కృత్రిమ మేధస్సు... ఇప్పుడు మనకు మంచి పుచ్చకాయను సెలెక్ట్ చేయడంలో కూడా సాయం చేస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక వైరల్ వీడియో ఇదే నిజమని చూపిస్తోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన స్మార్ట్‌ఫోన్ కెమెరాను, చాట్‌జీపీటీని ఉపయోగించి, వీధి వ్యాపారి దగ్గర పండిన, ఎర్రటి పుచ్చకాయను ఎంచుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది.
టెక్నాలజీ మన ఊహకు కూడా అందని విధంగా, పండ్లు కొనడం లాంటి రోజువారీ పనుల్లో ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియో చూపిస్తోంది. AI ఉపయోగించే చాలామంది తమ పనులను ఈజీగా చేసుకోగలుగుతున్నారు. ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేసుకుంటున్నారు. అయితే ఇది ఇతర విషయాల్లోనూ సహాయం చేయగలదని నిరూపించుకుంటోంది.

* పుచ్చకాయను AI ఎలా సెలెక్ట్ చేసింది?
ఆ వ్యక్తి ఫోన్‌ను ఒక్కో పుచ్చకాయ వైపు చూపిస్తూ, వాటిలో ఏది బాగా పండిందో చెప్పమని చాట్‌జీపీటీని అడిగాడు. ఆ AI, ఫోన్ కెమెరా ద్వారా పుచ్చకాయల రంగు, వాటిపై ఉన్న చారల సరళి వంటి వివరాలను గమనించింది. అలా చూసిన వాటి ఆధారంగా, ఏ కాయ లోపల తీపిగా, ఎర్రగా ఉండే అవకాశముందో సూచించింది.
మరి AI చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి, ఆ వ్యక్తి వ్యాపారిని AI ఎంచుకున్న కాయను కోయమని అడిగాడు. ఫలితం? చాట్‌జీపీటీ చెప్పినట్లే ఆ పుచ్చకాయ లోపల అందంగా, ఎర్రగా పండి ఉంది. దాంతో ఆశ్చర్యపోవడం అందరి వంతయ్యింది. వీడియో కూడా తీయడంతో అది వైరల్ అయింది.
How can #ChatGPT tell if the watermelon is sweet or not? pic.twitter.com/ZeUQsyraTp
— Raagi Sangati (@RaagiSangati) April 16, 2025
* బంగ్లాలోనూ పండ్లను గుర్తించిన AI!
ఈ వీడియో కేవలం పుచ్చకాయతో ఆగలేదు. ఆ వ్యక్తి అదే టూల్‌ని ఉపయోగించి మరికొన్ని పండ్లను కూడా గుర్తించమని అడిగాడు. ఆశ్చర్యంగా, AI వాటిని బంగ్లా భాషలో గుర్తించి సమాధానం చెప్పింది. బొప్పాయి, స్ట్రాబెర్రీలు, సపోటా, డ్రాగన్ ఫ్రూట్‌లను సరిగ్గానే చెప్పింది.
ఒకసారి వెలగపండును స్టార్ ఫ్రూట్‌గా పొరపాటున చెప్పినా, రెండోసారి అడిగినప్పుడు తన తప్పును సరిదిద్దుకుంది. దీన్నిబట్టి AI స్థానిక భాషలు, పరిస్థితులకు అనుగుణంగా నేర్చుకోగలదని, మెరుగుపరుచుకోగలదని అర్థమవుతోంది. భవిష్యత్తులో ఇది ఇంకా ఎంతగా ఆశ్చర్యపరిస్తుందో చూడాలి.
* మంచి మామిడి పండును కూడా గుర్తించింది..
తరువాత, ఆ వ్యక్తి మంచి మామిడి పండ్లను ఎలా ఎంచుకోవాలో చాట్‌జీపీటీని అడిగాడు. దానికి AI, "నేను వంద శాతం కరెక్ట్‌గా చెప్పలేకపోవచ్చు, కానీ కొన్ని చిట్కాలు ఇస్తాను" అంటూ సమాధానమిచ్చింది. కొంచెం బరువుగా ఉండేవి, మరీ గట్టిగా కాకుండా అలా అని మెత్తగా కాకుండా దృఢంగా ఉండేవి, నల్లటి మచ్చలు లేనివి ఎంచుకోమని సూచించింది.
అంతేకాదు, పండును మెల్లగా వాసన చూసి దాని తీపిని అంచనా వేయమని కూడా చెప్పింది. దీన్నిబట్టి AI ఎంత సాయం చేసినా, మన స్పర్శ, వాసన వంటి ఇంద్రియాలు కూడా ముఖ్యమేనని తెలుస్తోంది. అయితే మన ఇంద్రియాలకు ఏఐ తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు అని ఇది నిరూపించింది.
* ఇలా పండ్లు సెలెక్ట్ చేయడం ఇదే మొదటిసారా..?
చాట్‌జీపీటీతో పండ్లు ఎంచుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఒక యూజర్ కొన్ని పుచ్చకాయల ఫొటో (వాటికి నంబర్లు వేసి) అప్‌లోడ్ చేసి, వాటిలో ఏది ఉత్తమమైనదో చెప్పమని చాట్‌జీపీటీని అడిగాడు. అప్పుడు AI, కాయ కింద ఉండే పసుపు మచ్చ, ఆకారం, సమరూపత (Symmetry) ఆధారంగా ఒకదాన్ని ఎంచుకుంది.
ఇది చూసి కొందరు ఆశ్చర్యపోతే, మరికొందరు ఇది కేవలం అదృష్టమని కొట్టిపారేశారు. AI పనితీరుపై పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనం. మరో సందర్భంలో, ఒక వ్యక్తి తన ఫ్రిజ్‌లో రెండు వారాలుగా ఉన్న చెర్రీలు ఇంకా తినడానికి సురక్షితమేనా అని చాట్‌జీపీటీని అడిగాడు.
దానికి AI, వాటి రంగు, వాసన, పాడైపోవడానికి ఉన్న గుర్తులు వంటి వివరాలతో కూడిన సమగ్రమైన సమాధానం ఇచ్చింది. ఆ జవాబు చాలా ప్రాక్టికల్‌గా, ధైర్యం చెప్పేలా ఉండటంతో చాలామంది ఆశ్చర్యపోయారు.


Click it and Unblock the Notifications








