మొబైల్ యూజర్లకు గట్టి షాక్.. రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు భారీగా పెరగనున్నాయా?
భారత్‌లో మొబైల్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం టెలికాం రంగంలో అత్యధిక యూజర్లతో జియో తొలి స్థానంలో ఉంది. అనంతరం ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, ప్రభుత్వరంగ సంస్థ BSNL ఉన్నాయి. అయితే గత సంవత్సరం మధ్య భాగంలో ప్రైవేటు టెలికాం సంస్థలు భారీగా రీఛార్జ్ ప్లాన్ ల ధరలను పెంచాయి. BSNL మాత్రం టారిఫ్ లలో మార్పులు చేయలేదు.
ఎయిర్‌టెల్ కీలక చర్యలు! :
అయితే ఈ సంవత్సరం ఇప్పటి వరకు ధరలను పెంచకపోయినా, అనేక రీఛార్జ్ ప్లాన్‌లలో మార్పులు చేశాయి. జియో, ఎయిర్‌టెల్ రోజువారీ 1GB డేటాను అందించే రీఛార్జ్ ప్లాన్ లను తొలగించాయి. దీంతోపాటు ఎయిర్‌టెల్ ఇటీవలే నెలవారీ కనిష్ఠ రీఛార్జ్ ప్లాన్ రూ.189 ను కూడా తొలగించింది.

ARPU పెంపు :
సంస్థలు ARPU (యూజర్ల నుంచే వచ్చే సగటు ఆదాయం) ను పెంచుకొనేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇటీవల BSNL కూడా ఇదే తరహా చర్యలు తీసుకుంది. రీఛార్జ్ ధరల పెంపు లేకుండానే, ప్రయోజనాల్లో కోత విధించింది. డేటా, వ్యాలిడిటీని తగ్గించింది.
మోర్గాన్ స్టాన్లీ కీలక నివేదిక :
అయితే మొబైల్ యూజర్లకు మరో షాక్ ఇచ్చేందుకు టెలికాం సంస్థలు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. ఈ సంవత్సరం చివర్లో రీఛార్జ్ ప్లాన్ ల ధరల పెంపు ఉంటుందని గతంలో లీక్స్ వచ్చాయి. అయితే తాజాగా మొబైల్ టారిఫ్‌ల పెంపు మోర్గాన్ స్టాన్లీ కీలక వివరాలను వెల్లడించించింది.
ధరల పెంపు ఎప్పుడు ఉండవచ్చు :
2026 సంవత్సరంలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల పెంపు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. సుమారుగా 16 శాతం నుంచి 20 శాతం ధరల పెంపు ఉంటుందని అంచనా వేసింది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లో ఈ మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
సాధారణ ధరల పెరుగుదలతోపాటు 5G సర్వీసుల చేర్చడం వల్ల ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు రోజువారీ 2GB డేటాను అందించే ప్లాన్‌ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా 5G నెట్‌వర్క్ సర్వీసులు మరింత ఖరీదైనవిగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ధరల పెంపుతో 2027 ఆర్థిక సంవత్సరంలో ARPU గణనీయంగా పెరుగుతుందని మోర్గాన్ స్టాన్సీ అంచనా వేసింది. దీంతోపాటు 5G, అదనపు డేటా ఆఫర్ ల పరిచయంతో టెలికాం సంస్థల లాభాలు పెరిగే అవకాశం ఉంది. టారిఫ్‌ల పెంపు వల్ల ఎయిర్‌టెల్ ముఖ్యంగా లబ్దిపొందుతుందని అంచనా వేసింది.
ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి రూ.256 ARPU ను కలిగి ఉంది. సుమారు 20 శాతం టారిఫ్ ల పెంపుతో రూ.300 చేరుతుందని అంచనా వేసింది. టారిఫ్‌ల పెంపుతో టెలికాం సంస్థలు ఆర్థికంగా బలపడతాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా పెంపుపై అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త సంవత్సరంలో మొబైల్ యూజర్లకు గట్టి షాక్ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








