5జీ స్పెక్ట్రమ్ ధరపై ఎయిర్‌టెల్ కన్నెర్ర, ఇంత ఘోరమా ?
ట్రాయ్ సిఫారసు చేసిన 5జీ స్పెక్ట్రమ్ ధరపై భారతి ఎయిర్‌టెల్ మండిపడింది. ట్రాయ్ నిర్ణయించిన స్పెక్ట్రమ్ ధర భరించలేని స్థాయిలో, అత్యధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ట్రాయ్ సిఫారసు చేసిన 5జీ స్పెక్ట్రమ్ ధరపై భారతి ఎయిర్‌టెల్ మండిపడింది. ట్రాయ్ నిర్ణయించిన స్పెక్ట్రమ్ ధర భరించలేని స్థాయిలో, అత్యధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 5జీ సేవలు వేగంగా విస్తరించేందుకు వీలుగా స్పెక్ట్రమ్ బేస్ ధరను ప్రభుత్వం సమీక్షించాలని కోరింది. 5జీ స్పెక్ట్రమ్, రిజర్వ్ ధరను ప్రభుత్వం సమీక్షిస్తుందన్న ఆశాభావాన్ని ఎయిర్‌టెల్ వ్యక్తం చేసింది.

ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసినప్పుడే తాము 5జీ గురించి పరిశీలిస్తామని భారతీ ఎయిర్‌టెల్ భారత్, దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్‌విట్టల్ తెలిపారు. 100 మెగాహెర్జ్ 5జీ స్పెక్ట్రమ్‌కు ట్రాయ్ నిర్ణయించిన ధర రూ.50,000–55,000 కోట్లుగా ఉన్నట్టు విట్టల్ తెలిపారు. ''5జీకి చాలా పెద్ద మొత్తంలో స్పెక్ట్రమ్ అవసరం అవుతుంది. 40 మెగాహెర్జ్ ఉంటే 5జీ తరహా అవసరాలకు చాలదు. వేగం, సామర్థ్యం పరంగా పెద్ద మొత్తంలో స్పెక్ట్రమ్ కావాల్సిందే. స్పష్టంగా చెప్పాలంటే ఈ ధరలను మేం భరించలేమని విట్టల్ తెలిపారు.

5జీ సేవలకు పునాదులు
భారతి ఎయిర్‌టెల్ కంపెనీ ఇండియాలో 5జీ సేవలకు పునాదులు వేసినట్లుగా తెలుస్తోంది. 5జీ సేవలకు పునాదిగా భావించే `మాసివ్ మల్టిపుల్-ఇన్‌పుట్ మల్టిపుల్ ఔట్‌పుట్ (మీమో)` టెక్నాలజీని భారత్‌లో పరిచయం చేస్తున్నట్లు రెండేళ్ళ కిందటే వెల్లడించింది. మొదట బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో ఈ సేవలను ప్రారంభించి, ఆ తర్వాత దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొంది.

నెట్‌వర్క్ సామర్థ్యం
ఈ టెక్నాలజీ వల్ల మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ మరింత వేగవంతం కానుందని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. ఇది అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్ సామర్థ్యం 5-6 రెట్లు మెరుగుపడి, డేటా స్పీడ్ 2-3 రెట్లు పెరుగుతుందని ఎయిర్‌టెల్ అభిప్రాయపడింది.

ప్రాజెక్ట్ లీప్
అంతర్జాతీయంగా కొన్ని దేశాల్లో మాత్రమే ఈ మాసివ్ మీమో టెక్నాలజీ అమలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిలో భారత్ కూడా ఉందని ఎయిర్‌టెల్ తెలిపింది. వినియోగదారులు ఉపయోగిస్తున్న 4జీ హ్యాండ్‌సెట్‌లోనే ఎలాంటి టారిఫ్‌లు, మార్పులు చేయకుండా 5జీ సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఎయిర్‌టెల్ ప్రారంభించిన `ప్రాజెక్ట్ లీప్`లో భాగంగా
ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. టెలికాం శాఖ 2020లోగా భారత్‌లోకి పూర్తిస్థాయి 5జీ సేవలను తీసుకువస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకోసం రూ. 500 కోట్ల నిధిని కూడా ప్రభుత్వం కేటాయించింది.

5జీ టెక్నాలజీపై కసరత్తు
ఇదిలా ఉంటే టెలికం సర్వీసులకు సంబంధించి వేగవంతమైన 5జీ టెక్నాలజీపై కసరత్తు చేసేందుకు టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్ స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్‌తో చేతులు కలిపింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 36 సంస్థలతో అవగాహన ఒప్పందాలు ఉన్నాయని, భారత్‌లో భారతి ఎయిర్‌టెల్‌తో ఎంవోయూ చేసుకున్నామని ఎరిక్సన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నుంజియో మిర్టిలో తెలిపారు.

ఎరిక్సన్ అంచనాల ప్రకారం
అయితే, ఈ డీల్‌కి సంబంధించిన ఆర్థికాంశాలను వెల్లడించలేదు. ఎరిక్సన్ ప్రస్తుతం 4జీ తదితర సర్వీసుల్లో భారతి ఎయిర్‌టెల్‌కి సేవలందిస్తోంది. ఎరిక్సన్ అంచనాల ప్రకారం 2026 నాటికి దేశీ టెలికం ఆపరేటర్లకు 5జీ టెక్నాలజీతో 27.3 బిలియన్ డాలర్ల మేర ఆదాయ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సంప్రదాయంగా అందిస్తున్న ఆదాయానికి ఇది అదనం. ముఖ్యంగా తయారీ, ఇంధనం, బిల్లుల చెల్లింపులు, ప్రజా భద్రత, ఆరోగ్యం తదితర రంగాలకు 5జీ ఉపయోగపడగలదని ఎరిక్సన్ ఒక నివేదికలో పేర్కొంది.

నోకియా అడుగులు
దీంతో పాటు దేశీయ టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తో కలిసి 5జీ కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చే యోచనలో నోకియా ఉంది. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన ఎంఓయూపై నోకియా సంతకం కూడా చేసిందని ఎకనమిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది.5జీ కనెక్టివిటీ లాంచింగ్ పై నోకియా భారత మార్కెట్ హెడ్ సంజయ్ మాలిక్ స్పందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సన్నాహక దశలో ఉన్నామని అన్నారు. ఇందుకోసం బెంగుళూరులోని తమ ఆర్ అండ్ డీ సెంటర్ లో ఓ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇండియాలో 5జీ ప్రాధాన్యత, వాటాదారుల అసరాల రీత్యా ఈ సెంటర్ ఉపయోగపడుతుందని సంజయ్ పేర్కొన్నారు. దేశంలో ఈ కొత్త టెక్నాలజీని త్వరగా ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, 2022 కల్లా ఇది జరగవచ్చునని అన్నారు. అదే సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో 2020లోనే ఈ ప్రాజెక్టు ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications








