బయోమెట్రిక్ ద్వారా UPI పేమెంట్స్.. ప్రస్తుతానికి వీరికే అవకాశం.. పూర్తి వివరాలు!
భారత్‌లో యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. UPI పేమెంట్స్ ను పిన్ ఆధారంగా వినియోగిస్తున్నాం. అయితే బయోమెట్రిక్ ఆధారిత యూపీఐ పేమెంట్స్ కోసం NPCI ప్రయత్నం చేస్తున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. దీంతోపాటు యూపీఐలో ఇటీవల కీలక మార్పులు వచ్చాయి. యూపీఐ యాప్ లో బ్యాలెన్స్ తనిఖీలపై పరిమితి విధించింది. దీంతోపాటు పర్సనలైజ్ ఐడీలు క్రియేట్ చేసుకొనే అవకాశం కూడా కల్పించింది. తాజాగా కీలక ప్రకటన వచ్చింది.
ప్రస్తుతం వీరికే అవకాశం :
అమెజాన్ పే (Amazon Pay) కీలక ప్రకటన చేసింది. యూపీఐ బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇప్పటి వరకు పిన్ ఆధారంగా లావాదేవీలను నిర్వహించగా.. ఇప్పటి నుంచి బయోమెట్రిక్, ఫేస్ అథెంటికేషన్ ఆధారంగా లావాదేవీలు నిర్వహించేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం అమెజాన్ పే ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రస్తుతం ఈ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే నగదు లావాదేవీలపై పరిమితి విధించింది.

ఈ పరిమితి వరకే లావాదేవీలు నిర్వహించుకోవచ్చు :
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సమాచారం ఆధారంగా అమెజాన్ పే ద్వారా బయోమెట్రిక్ ఉపయోగించి గరిష్ఠంగా రూ.5000 వరకు పేమెంట్స్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ మొత్తం లావాదేవీలు నిర్వహించాలంటే పిన్ కావాల్సి ఉంటుంది.
బయోమెట్రిక్, ఫేస్ అథెంటికేషన్ అందుబాటులో ఉన్న డివైజ్ లకు మాత్రమే అమెజాన్ పే లో ఈ ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు. అయితే ఈ బయోమెట్రిక్ డేటా యూజర్ల డివైజ్ లోనే స్టోరేజీ చేస్తున్నట్లు చెబుతోంది. పీర్ టు పీర్ ట్రాన్స్‌ఫర్ (Peer to Peer), స్కాన్ అండ్ పే ట్రాన్స్‌ఫర్‌లు, మర్చెంట్ పేమెంట్స్, బ్యాలెన్స్ తనిఖీలకు బయోమెట్రిక్ ఫీచర్ అందుబాటులో ఉంది.
ఇతర డివైజ్‌ల పరిస్థితి ఏంటి :
అమెజాన్ పే బయోమెట్రిక్ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ డివైజ్ లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇతర డివైజ్ లకు అందుబాటులోకి వస్తుందా లేదా అనే అంశంపై ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. భద్రత సహా ఇతర కారణాలతో బయోమెట్రిక్ ద్వారా రూ.5000 వరకు మాత్రమే లావాదేవీలు నిర్వహించే అవకాశం ఉంది.
* ఈ సంవత్సరం ఆగస్టు నుంచి యూపీఐలో కీలక మార్పులు వచ్చాయి. గతంలో యూపీఐ యాప్ లో బ్యాలెన్స్ తనిఖీపై ఎటువంటి పరిమితి లేకపోయినా, ఆగస్టు నుంచి ఈ అంశంలో మార్పులు వచ్చాయి. ఫళితంగా రోజులో గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే యూపీఐ యాప్ లో బ్యాలెన్స్ తనిఖీ చేసుకొనేందుకు అవకాశం ఉంది.
* దీంతోపాటు ట్రాన్సాక్షన్ స్టేటస్ రోజులో మూడుసార్లు మాత్రమే చూసేందుకు అవకాశం ఉంది. స్టేటస్ చెక్ చేసేందుకు కనీసం 90 సెకన్లపాటు సమయం ఉండాలి. ప్రస్తుతం ఫోన్ నంబర్ల ఆధారంగా యూపీఐ ఐడీలు ఉన్నాయి. అయితే ఇ- మెయిల్ తరహాలో నచ్చిన విధంగా యూపీఐ ఐడీలను క్రియేట్ చేసేందుకు ఇటీవలే కొన్ని సంస్థలు అవకాశం కల్పించాయి. ఫలితంగా ఫోన్ నంబర్ ను వెల్లడయ్యే అవకాశం ఉండదు.


Click it and Unblock the Notifications








