ఇక ఐటి పని గోవిందా..?, రూపాయి విలువ పెరగనుందా..!!

Posted By: Super

ఇక ఐటి పని గోవిందా..?, రూపాయి విలువ పెరగనుందా..!!

అమెరికా ప్రకంపనలు భారత వృద్ధిరేటును ప్రభావితం చేయనప్పటికీ.. ఎగుమతులపై ఉంటుందని అందరూ అంగీకరిస్తున్నారు. అందుకే దేశంలో తొలి దెబ్బ సమాచార సాంకేతిక పరిజ్ఞాన (ఐటీ) పరిశ్రమపై పడింది. ఇది స్టాక్‌ మార్కెట్‌లో ప్రత్యక్షంగా కనిపించింది. గత రెండు రోజుల్లో ఐటీ షేర్లు భారీగా నష్టపోయాయి. అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) షేర్‌ ధర బీఎస్‌ఈలో మంగళవారం ఒక దశలో 6 శాతం వరకూ క్షీణించింది.

ఐటీ షేర్లలో పతనాన్ని ప్రతిబింబిస్తూ.. బీఎస్‌ఈ ఐటీ సూచీ మంగళవారం 3.47 శాతం తగ్గి 5,041.44 పాయింట్ల వద్ద ముగిసింది. ఒక దశలో 52 వారాల కనిష్ఠ స్థాయి 4978.85 పాయింట్లను సైతం తాకింది. సావరిన్‌ రుణ రేటింగ్‌ తగ్గడం వల్ల అమెరికాకు రుణాలు భారం అవుతాయి. డాలర్‌ విలువ తగ్గుతుంది. రూపాయి విలువ పెరుగుతుంది. ఇది సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఆదాయాలపై ప్రభావం చూపుతుంది. అంతేకాక భారత సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఆదాయంలో ఇప్పటికీ 80 శాతం అమెరికా, యూరప్‌ దేశాల నుంచే లభిస్తోంది. అననుకూల పరిస్థితులు కారణంగా రానున్న కాలంలో సాఫ్ట్‌వేర్‌పై అమెరికా కంపెనీల వ్యయం తగ్గే వీలుంది. అందువల్లే అమెరికా రుణ రేటింగ్‌ను ఎస్‌ ఖీ పీ ఏఏఏ నుంచి ఏఏ+కు తగ్గించిన వెంటనే భారత సాఫ్ట్‌వేర్‌ కంపెనీల షేర్లు నష్టపోతున్నాయి.

అమెరికా ఆర్థిక వ్యవస్థ మళ్లీ మాంద్యంలోకి జారగలదన్న భయాలు, యూరప్‌లోని రుణ సంక్షోభం నేపథ్యంలో భారత ఐటీ కంపెనీలకు ఆర్డర్ల జోరు తగ్గే వీలుందని విశ్లేషకులు చెబుతున్నారు. తగ్గించడానికి వీలైన వ్యయాన్ని అమెరికా కంపెనీలు తగ్గించవచ్చని అంటున్నారు. అమెరికాలో మళ్లీ మాంద్యం ఐటీ కంపెనీల ఆదాయాలను తగ్గించగలదన్న భయంతో మదుపర్లు ఐటీ షేర్లను విక్రయించారని బొనాంజా పోర్టుఫోలియో సీనియర్‌ రిసెర్చ్‌ విశ్లేషకుడు షాను గోయెల్‌ తెలిపారు. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో కనిపించనప్పటికీ అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక ఫలితాలపై ప్రభావం ఉంటుంది. జనవరి-మార్చి నెలల్లో ఇది మరింత స్పష్టంగా ఉంటుందని బ్రోకరేజీ సంస్థలు పేర్కొంటున్నాయి. వ్యాపార పరిమాణంలో (వాల్యూమ్‌) పెరుగుదల వల్ల ఏప్రిల్‌-జూన్‌ నెలలకు అంచనాల కన్నా ఎక్కువ ఆదాయాన్ని ఐటీ కంపెనీలు నమోదు చేశాయి.

ఈ సందర్బంలో విప్రో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ టి.కె.కురియన్ మాట్లాడుతూ భవిష్యత్తు ఆదాయ అంచనాలను సవరించడానికి ప్రస్తుతం కారణాలేవీ కనిపించడం లేదు. ఖాతాదారులు ఎవరూ స్పష్టంగా స్పందించడం లేదు. ఒక వేళ అటువంటి పరిస్థితే ఎదురైతే ఏ విధంగా వ్యవహరించాలో కంపెనీకి తెలుసని అన్నారు. ఆ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎండీ ఎన్‌.చంద్రశేఖరన్ మాట్లాడుతూ స్టాక్‌ మార్కెట్లలో విక్రయం వల్ల కంపెనీలపై ప్రభావం ఏమీ ఉండదు. అంతర్జాతీయ పరిస్థితులను గమనిస్తున్నాం. ఉత్తర అమెరికా, యూరప్‌ గిరాకీలో మార్పులు వచ్చే అవకాశాలేమీ కనిపించడం లేదని తెలియజేశారు.

అతుల్‌ కె నిషార్‌, ఛైర్మన్‌, హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ మాట్లాడుతూ మా ఖాతాదారుల నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుంది. వాస్తవరంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగించిందని నేననుకోవడం లేదు. ఒక వర్గం వారు అనవసర భయాలు కలిగిస్తున్నారు. వాస్తవాలు ఇంకా బయటకు రావాల్సి ఉందని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot