భార‌త్ నుండి స‌ర్వ‌ర్ల‌ను తొల‌గించిన మ‌రో VPN సంస్థ‌!

|

ఈ ఏడాది కేంద్రం నూత‌న వీపీఎన్ పాల‌సీని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప‌లు VPN సంస్థ‌లు దేశంలో త‌మ సేవ‌ల్ని నిలిపి వేస్తున్నట్లు ప్ర‌క‌టించిన‌ విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఓ కీల‌క సంస్థ భార‌త్‌లో త‌మ సంస్థ‌కు చెందిన స‌ర్వ‌ర్ల‌ను తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. PureVPN అనే సంస్థ దేశంలో త‌మ వీపీఎన్ స‌ర్వ‌ర్‌ల‌ను తొల‌గించింది. ఈ మేర‌కు ఆ సంస్థ ఓ అధికారిక ప్ర‌క‌ట‌న‌లో వివ‌రాల‌ను వెల్ల‌డించింది. PureVPN వినియోగదారుల నుండి ఎటువంటి సమాచారాన్ని సేకరించదని ఆ సంస్థ‌ పేర్కొంది. కాగా ఇప్ప‌టికే నార్డ్ వీపీఎన్, ఎక్స్‌ప్రెస్ వీపీఎన్ స‌హా ప‌లు సంస్థ‌లు దేశంలో నుంచి త‌మ కంపెనీల స‌ర్వ‌ర్ల‌ను తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Pure vpn servers
ఈ సంద‌ర్భంగా PureVPN హెడ్, షహెర్యార్ పోపాల్జాయ్ ఒక అధికారిక ప్రకటనలో ఈ విధంగా తెలియ‌జేశారు. " మాది కఠినమైన నో-లాగ్ కంపెనీ. మేము మా వినియోగదారుల నుండి ఎలాంటి గుర్తించదగిన సమాచారాన్ని సేకరించనప్పటికీ, బ‌ల‌వంతంగా మా ఆపరేటింగ్ పద్ధతులను మార్చడానికి రాజీ పడవలసి వచ్చే దేశంలో మేము భౌతిక సర్వర్‌లను ఆపరేట్ చేయలేము " అని తెలిపారు. అంతేకాకుండా భార‌త్‌లో ఇప్ప‌టికీ త‌మ సేవలను పొందాలనుకునే వినియోగదారులు వర్చువల్ సర్వర్‌ల ద్వారా సేవ‌ల్ని పొంద‌వ‌చ్చు అన్నారు. వర్చువల్ సర్వర్‌లకు తాము కొత్త కాదని, కాబట్టి వినియోగదారులు భారతదేశ వర్చువల్ సర్వర్‌కు కనెక్ట్ చేసినప్పుడు నాణ్యత లేదా అనుభవం పరంగా ఎటువంటి తేడాను చూడలేరని తెలిపారు. వినియోగదారులు భౌతిక సర్వర్‌లతో చేసిన అదే గోప్యత మరియు భద్రతను పొందుతారన్నారు. తాము ఇప్పటికే వర్చువల్ స‌ర్వ‌ర్ల విధానాన్ని బంగ్లాదేశ్, బహ్రెయిన్, ఈజిప్ట్ మొదలైన దేశాల్లో న‌డుపుతున్న‌ట్లు పోపాల్జాయ్ వివరించారు.
Pure vpn servers

ఏమిటా VPN పాల‌సీ
కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల నూత‌న‌ వీపీఎన్ పాల‌సీని విడుద‌ల చేసింది. ఈ క్ర‌మంలో భార‌త ఐటీ విభాగం ప‌లు వీపీఎన్ స‌ర్వీస్ కంపెనీల‌కు భార‌త నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా న‌డుచుకోవాల‌ని సూచించింది. ఈ విధానం ప్ర‌కారం ప్రైవేటు VPN స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు, డేటా సెంట‌ర్లు త‌మ కేంద్రాల్లో యూజ‌ర్‌ డేటాను క‌నీసం ఐదేళ్ల పాటు స్టోర్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇది VPN స‌ర్వీసెస్ బిజినెస్ విధానాల‌కు వ్య‌తిరేకం అని ఆయా సంస్థ‌లు భావిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని వీపీఎన్ సంస్థ‌లు భార‌త్‌లో త‌మ సేవ‌ల‌ను నిలిపేయాల‌ని నిర్ణ‌యించాయి.ఈ క్ర‌మంలోనే PureVPN కంటే ముందు, ఎక్స్‌ప్రెస్ విపిఎన్, నార్డ్ విపిఎన్ మరియు సర్ఫ్‌షార్క్‌తో సహా అనేక ఇతర అగ్ర VPN ప్రొవైడర్‌లు భారతదేశం నుండి సర్వర్‌లను తీసివేస్తామని ప్ర‌క‌టించాయి. ఈ క్ర‌మంలోనే ప్రైవేటు వీపీఎన్‌ల‌ను ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎవ‌రూ వినియోగించ వ‌ద్ద‌ని ఆదేశాలు చేయ‌డం సంచ‌ల‌నం సృష్టించింది.

ప్ర‌భుత్వం ఇచ్చిన ఆదేశాల్లో కీల‌క అంశాలు:
ఉద్యోగులెవ‌రూ ప్ర‌భుత్వానికి సంబంధించిన అధికారిక ప‌నుల‌కు ప్రైవేటు వీపీఎన్ సేవ‌ల్ని వినియోగించకూడ‌దు. అంతేకాకుండా ముఖ్య‌మైన డేటా ఫైల్స్‌ను, అతి ముఖ్య‌మైన అంత‌ర్గత స‌మాచారాన్ని ప్ర‌భుత్వేత‌ర క్లౌడ్ విభాగాలైన గూగుల్ డ్రైవ్‌ Google Drive, డ్రాప్‌బాక్స్‌ DropBoxల‌లో స్టోర్ చేయ‌వ‌ద్ద‌ని ఆదేశాల్లో పేర్కొంది. సైబ‌ర్ దాడులు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని నివారించ‌డాన్ని దృష్టిలో ఉంచుకుని ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు ప‌ది పేజీల‌తో కూడిన కొత్త ఆదేశాల‌ను జారీ చేసింది. " ప్ర‌భుత్వానికి సంబంధించిన ముఖ్య‌మైన డేటా ఫైల్స్‌ను, అతి ముఖ్య‌మైన అంత‌ర్గత స‌మాచారాన్ని ప్ర‌భుత్వేత‌ర క్లౌడ్ విభాగాలైన గూగుల్ డ్రైవ్‌, డ్రాప్‌బాక్స్‌ల‌లో స్టోర్ చేయ‌వ‌ద్దు" అని ఉద్యోగుల‌కు స్ప‌ష్టం చేసింది. దీనికి సైబ‌ర్ సెక్యూరిటీ గైడ్‌లైన్స్ అని పేరు పెట్టింది. ఉద్యోగులంద‌రూ ఈ రూల్స్‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని పేర్కొంది. లేదంటే సంబంధిత డిపార్ట్‌మెంట్ హెడ్‌లు తగిన చర్యలు తీసుకోవచ్చని కేంద్రం పేర్కొంది. వీటితో పాటు అన‌ధికార రిమోట్ టూల్స్ (ఉదా.. టీమ్ వ్యూవ‌ర్‌, ఎనీడెస్క్) వంటి వాటికి దూరంగా ఉండాల‌ని పేర్కొంది. ప్ర‌భుత్వ అధికారిక‌ అకౌంట్ల పాస్‌వ‌ర్డ్ నిర్వ‌హ‌ణ‌లో కూడా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, క‌ఠిన‌మైన‌ పాస్‌వ‌ర్డ్‌ల‌ను పెట్టుకోవాల‌ని ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం సూచించింది. ముఖ్యంగా, ప్ర‌తీ 45 రోజుల‌కు ఒక‌సారి పాస్‌వ‌ర్డ్ మార్చుకోవాల‌ని తెలిపింది.

Best Mobiles in India

English summary
Another top VPN service provider removes server from India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X