ముఖ్యమంత్రి చేతుల మీదుగా తిరుపతిలో 'డిక్సన్' ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ప్రారంభం
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ 'డిక్సన్ ' ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభమైంది.ఎల్‌ఈడీ బల్బులు, టీవీలు, సీసీ కెమెరాలు, వాషింగ్ మెషీన్‌లు తయారు చేసే ‘డిక్సన్’ తిరుపతిలో ఉత్పత్తి ప్రారంభించింది.
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ 'డిక్సన్ ' ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభమైంది.ఎల్‌ఈడీ బల్బులు, టీవీలు, సీసీ కెమెరాలు, వాషింగ్ మెషీన్‌లు తయారు చేసే 'డిక్సన్' తిరుపతిలో ఉత్పత్తి ప్రారంభించింది. రూ.150 కోట్ల పెట్టుబడితో 800 మందికి ఉపాధి కల్పించే ఈ ప్లాంటు నిర్మాణాన్ని డిక్సన్ యాజమాన్యం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కేవలం ఏడాదిలోనే పూర్తి చేసింది.ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గురువారం దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, మంత్రులు అమర్‌నాథ రెడ్డి, అచ్చెన్నాయుడు, డిక్సన్ చైర్మన్ సునీల్ వాచాని, షియోమి స్మార్ట్ ఫోన్ కంపెనీ చైర్మన్ మనుజైన్ తదితరులు పాల్గొన్నారు .

ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా....
ఎలక్ట్రానిక్స్ తయారీ పేరు చెప్పగానే చైనాలోని షెంజెన్ ఎలా గుర్తుకు వస్తుందో భారత్‌లో కూడా ఎలక్ట్రానిక్స్ తయారీ అనగానే తిరుపతిని గుర్తుకు తెచ్చేలా చేస్తామని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. డిక్సన్ కంపెనీని ప్రారంభించిన అనంతరం చంద్రబాబు నాయుడు గారు ఆ కంపెనీని పరిశీలించారు. ఉద్యోగులతో మాట్లాడారు. ఉత్పత్తి గురించి అడిగి తెలుసుకున్నారు.

డిక్సన్ చైౖర్మన్ సునీల్ వాచాని...
తిరుపతిలో తాము పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పూర్తి సానుకూల వాతావరణం కల్పించిందని డిక్సన్ టెక్నాలజీ చైర్మన్ సునీల్ వాచాని పేర్కొన్నారు. ఏడాదిలో తాము పరిశ్రమ ఏర్పాటు చేశామంటే అందుకు ప్రభుత్వ సహకారం, కల్పించిన సౌకర్యాలు, జిల్లా పరిపాలన యంత్రాంగం సహకారమే కారణమని, రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ఇలాంటి వాతావరణం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు.

కోటి సీసీ కెమెరాలు, 2 కోట్ల డిజిటల్ వీడియో కెమెరాలు...
తిరుపతిలోని డిక్సన్ యూనిట్‌లో సంవత్సరానికి కోటి సీసీ కెమెరాలు, 2 కోట్ల డిజిటల్ వీడియో కెమెరాలు ఉత్పత్తి చేస్తామని... భారత మార్కెట్‌లో 20 శాతం డిక్సన్ ఉత్పత్తులు ఉంటాయని చెప్పారు. అలాగే ఏడు వేల మిలియన్ల వాషింగ్ మెషిన్‌లు కూడా తయారు చేస్తామని సునీల్ వాచాని తెలిపారు.

800 మందికి ఉపాధి అవకాశాలు....
తొలిదశలో 'డిక్సన్ ' సంస్థ సుమారు రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని వల్ల 800 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.

టీవీలు, సీసీ కెమెరాలను....
టీవీలు, సీసీ కెమెరాలను తయారుచేయనున్న ఈ కంపెనీ తిరుపతి, రేణిగుంటలోని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్-2 లో ఉత్పత్తి చేయనుంది. షియోమి , పానాసోనిక్, సాన్యో కంపెనీలకు డిక్సన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఉత్పత్తులను విక్రయిస్తుంది.

త్వరలో మొబైల్ ఫోన్లు, వాషింగ్ మిషన్లను కూడా....
త్వరలోనే మొబైల్ ఫోన్లు, వాషింగ్ మిషన్లను కూడా తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications








