ఐటీ పార్కు భూములకు రెక్కలు, రూ 440 కోట్ల విలువైన భూమి మాయం

Posted By: Staff

ఐటీ పార్కు భూములకు రెక్కలు, రూ 440 కోట్ల విలువైన భూమి మాయం

హైదరాబాద్‌ మహానగర పరిధిలోని రాయదుర్గం ప్రాంతంలో ఐటీ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)కి అప్పగించిన 470 ఎకరాల సర్కారు భూమిలో 22 ఎకరాలు కనిపించకుండా పోయింది. దీని విలువ రూ. 440 కోట్ల పైనే. భూమిని పూర్తి స్థాయిలో స్వాధీన పర్చలేమంటూ రంగారెడ్డి జిల్లా యంత్రాంగం చేతులెత్తేసింది. దీంతో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొనే బాధ్యత ఇప్పుడు సర్వే శాఖ కమిషనరుపై పడింది. రాయదుర్గంలోని 470 ఎకరాల మిగులు భూమిని ఐటీ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం 2010, మేలో ఏపీఐఐసీకి అప్పగించింది. కొలతల్లో అంత భూమి కనిపించకపోవటంతో వ్యవహారం లోకాయుక్తకు వెళ్లింది.

కేటాయించిన మొత్తాన్ని కొలతలు వేసి స్వాధీనపర్చాల్సిందేనంటూ లోకాయుక్త గత ఏడాది డిసెంబరులో ఆదేశించింది. అయినప్పటికీ జిల్లా యంత్రాంగం కదలకపోవటంతో ఈనెల 21న జిల్లా సర్వే అధికారులను పిలిచి నెల రోజుల గడువు ఇచ్చింది. అప్పటికే కొలతలు వేసిన సర్వే శాఖ రంగారెడ్డి జిల్లా సహాయ సంచాలకుడు... ఏపీఐఐసీకి అప్పగించిన విస్తీర్ణానికి, వాస్తవ భూమికి మధ్య బాగా వ్యత్యాసం ఉన్నట్టు తేల్చారు. అందువల్ల భూమిని పూర్తి స్థాయిలో స్వాధీనపర్చలేమంటూ చేతులెత్తేశారు. దీంతో సర్వే శాఖ రాష్ట్ర కమిషనరు అనిల్‌ కుమార్‌ స్వయంగా రంగంలోకి దిగి భూమి వ్యవహారాన్ని తేల్చాలని భావిస్తున్నట్టు సమాచారం.

రాయదుర్గంలో చాలా ఏళ్లక్రితం భూ గరిష్ఠ పరిమిత చట్టం కింద స్వాధీన పర్చుకొన్న భూమి.. రికార్డుల ప్రకారం 526 ఎకరాలు ఉండాలి. ఇందులోంచే 470 ఎకరాలను ఏపీఐఐసీకి ఇచ్చారు. ఇప్పుడు అందులో 22 ఎకరాలు కనిపించకుండా పోవడంతో ఇంకా ఎవరికీ కేటాయించని భూమి సంగతి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. అది సక్రమంగానే ఉందా? ఆక్రమణలకు గురైందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 22 ఎకరాల వ్యవహారం నలుగుతుండగానే ఇక్కడ మరో రెండెకరాలకు పైగా భూమిని ప్రైవేటు వ్యక్తుల పరమయ్యేలా రంగారెడ్డి జాయింట్‌ కలెక్టరు ఇటీవల ఉత్తర్వు ఇవ్వడం గమనార్హం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot