iPhone 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల బ్యాటరీ ప్యాక్ వివరాలు తెలుసా.. ?
ఆపిల్ సంస్థ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న iPhone 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను సెప్టెంబర్ 12న నిర్వహించిన వండర్ లస్ట్ కార్యక్రమంలో విడుదల చేసింది. సెప్టెంబర్ 15 నుంచి ఈ ఫోన్ల ముందస్తు బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. విడుదల సందర్భంగా ఐఫోన్ ఫీచర్లు, డిజైన్, స్పెసిఫికేషన్ల వివరాలను వెల్లడించింది. అయితే బ్యాటరీ ప్యాక్ సమాచారం మాత్రం తెలియలేదు.
iPhone 15 సిరీస్ కింద ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఫోన్లను లాంచ్ చేసింది. ఇందులో ఐఫోన్ 15 ప్రో మాక్స్ 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,99,900గా ఉంది. అంటే రూ.100 తక్కువ రెండు లక్షలుగా ఉంది. భారత్‌లో తొలిసారిగా ఐఫోన్ ధర సుమారుగా రెండు లక్షలకు చేరింది.

తాజాగా చైనీస్ రెగ్యూలేటరీ డేటాబేస్ ఐఫోన్ 15 ఫోన్ల బ్యాటరీ ప్యాక్‌ల గురించి కీలక వివరాలను వెల్లడించింది. ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ 3,349mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉందని తెలిపింది. అదే ఐఫోన్ 15 ప్లస్ 4,383mAh, ఐఫోన్ 15 ప్రో 3,274mAh, ఐఫోన్ 15 ప్రో మాక్స్ 4,422mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉందని వెల్లడించింది. అయితే బ్యాటరీ సామర్థ్యం మెరుగైన పనితీరును కనబరుస్తుందా లేదా అనేది వెల్లడించలేదు.
భారత్ మార్కెట్‌లో ఐఫోన్ 15 బేస్ మోడల్ ధర రూ.79,900, అలాగే ఐఫోన్ 15 ప్లస్ ప్రారంభ ధర రూ.89,900గా ఉంది. ఈ రెండు ఫోన్లు 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. ఈ రెండు ఫోన్లు నలుపు, నీలం, ఆకుపచ్చ, పింక్, పసుపు రంగుల్లో లభిస్తాయి.

అదే ఐఫోన్ 15 ప్రో బేసి వేరియంట్ ధర రూ.1,39,900గా ఉంది. అదే ఐఫోన్ 15 ప్రో మాక్స్ రూ.1,59,900గా ఉంది. బ్లాక్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం రంగుల్లో గరిష్ఠంగా 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో ఐఫోన్ 15 ప్రో మాక్స్ కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 15, 15 ప్లస్ ఫోన్లు OLED సూపర్ రెటినా డిస్‌ప్లేతో వస్తాయి. గరిష్ఠ బ్రైట్‌నెస్ 2000 నిట్స్ వరకు ఉంటుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లు వేర్వేరు డిస్‌ప్లే సైజులను కలిగి ఉంటుంది. ఐఫోన్ 15.. 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదే 15 ప్లస్ మోడల్ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు దృఢమైన గాజు, నీరు, దుమ్ము నిరోధకతను కలిగి ఉంటాయి.
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు ప్రోమోషన్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తాయి. అయితే ఐఫోన్ 15 ప్రో 6.1 అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు A17 ప్రో బయోనిక్ చిప్ ఆధారంగా పనిచేస్తాయి.


Click it and Unblock the Notifications








