మహిళ ప్రాణాలను కాపాడిన యాపిల్ స్మార్ట్ వాచ్.. ఆ క్షణంలో ఎలా పనిచేసిందంటే?
టెక్నాలజీ మనిషికి ఎన్నో విధాలుగా మేలు చేస్తోంది. ఇష్టానుసారం టెక్నాలజీని వినియోగిస్తే ఎంత ప్రమాదకరమో.. సరైన మార్గంలో టెక్నాలజీ వినియోగం అంతే ఉపయోగం. ఉదాహరణకు మనం ధరించే కొన్ని గ్యాడ్జెట్లు ఆరోగ్య పరిస్థితిని అంచనావేసి హెచ్చరికలు జారీచేస్తాయి. అదే ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు సొంతవారికి ఆ సమాచారం చేరవేస్తాయి. ఇలాంటి వార్తే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
స్మార్ట్ వాచ్‌లు వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసి ముందుగానే హెచ్చరికలు జారీచేస్తున్నాయని ఇప్పటికే అనేక కథనాలు వచ్చాయి. ఫలితంగా అనేక మంది ప్రాణాలు కాపాడినట్లు తెలిపాయి. టెక్ దిగ్గజం యాపిల్ స్మార్ట్ వాచ్ ఓ మహిళ ప్రాణాలు కాపాడింది. యాపిల్ స్మార్ట్ వాచ్ ధరించిన ఓ మహిళ హోటల్ గదిలో కుప్పకూలింది. దీనిని గ్రహించిన స్మార్ట్ వాచ్‌లోని ఫాల్ డిటెక్షన్ ఫీచర్ (కిందపడిన వ్యక్తిని గుర్తించే ఫీచర్) వెంటనే అత్యవసర సేవల విభాగానికి సమాచారం అందించింది.

యాపిల్ స్మార్ట్ వాచ్‌ను పనితీరును అభినందిస్తూ సోషల్ మీడియా వేదిక అయిన Reddit ఆ మహిళ కుమార్తె పోస్ట్ చేశారు. దాంతోపాటు తన తల్లికి ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఏవిధంగా ఉపయోగపడిందో వివరించారు.
"మా అమ్మ ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్‌కు బిజినెస్ ట్రిప్‌కు వెళ్లారు. అక్కడకు సమీపంలోనే ఓ హోటల్‌లో నివాసం ఉండేవారు. ఆ సమయంలో ఆమెకు ఛాతిలో నొప్పి ప్రారంభమైంది. వెంటనే తన ఫ్రెండ్‌ను హోటల్‌కు రమ్మని మెసేజ్ పంపారు. ఫ్రెండ్ హాటల్‌కు వచ్చేసరికే అమ్మ కిందపడిపోయి ఉన్నారు. కంగారు పడిన అమ్మ ఫ్రెండ్ హాస్పిటల్ అంబులెన్స్‌కు కాల్ చేశారు. అయితే అప్పటికే సమాచారం అందిందని వైద్య సిబ్బంది సైతం దారిలోనే ఉన్నారని తెలుసుకున్నారు"
అమ్మ కిందపడిపోయిన తర్వాత ఆమె చేతికున్న యాపిల్ స్మార్ట్‌వాచ్‌లోని ఫాల్ డిటెక్షన్ ఫీచర్ అప్రమత్తం అయింది. ఆమె శరీరంలో చలనం లేదని తెలుసుకొని అత్యవసర సేవల విభాగం నంబర్ 911కు సమాచారం పంపింది. అయితే హోటల్‌రూంకు వచ్చిన సిబ్బంది ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పారు.
తాను ఇలాంటి కథనాలు ఇంతకు ముందు కూడా చాలా చదివేనని చెప్పారు. కానీ అవన్నీ పబ్లిసిటీ కోసం సృష్టించిన వార్తలని అనుకున్నట్లు చెప్పారు. అవన్నీ తప్పుడు ఆలోచనలని తెలుసుకున్నట్లు తెలిపారు. యాపిల్ టెక్నాలజీ తమ కుటుంబాన్ని కాపాడిందని Reddit వేదికగా అభినందించారు.
* యాపిల్ స్మార్ట్‌వాచ్‌లోని ఈ ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?
ఏదైనా సమయంలో మీరు ఒక నిమిషం కంటే ఎక్కువ సమయం కదలకుండా ఉంటే ఆ స్థితిని ఫాల్ డిటెక్షన్ ఫీచర్ గ్రహిస్తుంది. వెంటనే పని ప్రారంభిస్తుంది. మరో 30 సెకన్ల కండౌన్ పెడుతుంది. ఆ సమయంలో పెద్ద సౌండ్‌తో అలెల్ట్ చేస్తుంది.
ఆ సమయంలో కిందపడిన వ్యక్తి గానీ లేదా సమీపంలో ఉన్న మరెవరు అయినా ఆ శబ్దం విని అక్కడకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో మీరు లేచి స్మార్ట్‌వాచ్ పైనున్న టాప్ బటన్ క్లిక్ చేసి సౌండ్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఆ 30 సెకన్లపాటు బటన్‌ను ఆపకపోతే.. ఆటోమేటిక్‌గా మీరు అప్పటికే ఇచ్చిన అత్యవసర నంబర్లు సహా సాధారణ అత్యవసర నంబర్లకు కాల్ వెళ్తుంది.
* యాపిల్ వాచ్‌లో ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేయాలంటే?
స్టెప్ 1 : ఐఫోన్‌లో వాచ్ యాప్ ఓపెన్ చేసి, మై వాచ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 2 : ఎమర్జెన్సీ SOSపై క్లిక్ చేయాలి.
స్టెప్ 3 : ఫాల్ డిటెక్షన్ ఫీచర్‌ను ఆన్ చేయాలి. ఒకవేళ అప్పటికే ఆన్‌లో ఉంటే, ఆల్‌వేజ్ ఆన్ లేదా ఓన్లీ ఆన్ వర్కౌట్స్‌ను ఎంచుకోండి.
* అన్ని యాపిల్ వాచ్‌ల్లో ఈ ఫీచర్ పనిచేస్తుందా?
యాపిల్ వెబ్‌సైట్ ప్రకారం.. యాపిల్ వాచ్ SE మరియు యాపిల్ వాచ్ సిరీస్ 4 లేదా ఆ తర్వాత వెర్షన్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








