ట్రంప్ దెబ్బ.. కేవలం మూడు రోజుల్లో 5 విమానాల్లో భారత్ నుంచి అమెరికాకు ఐఫోన్‌లు..! ఎందుకో తెలుసా?
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డోనాల్డ్ ట్రంప్ జనవరిలో పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తగ్గింపు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపడం సహా అనేక సంచలన నిర్ణయాలు కూడా ఉన్నాయి. ఇందులో ప్రతీకార సుంకాల నిర్ణయం కూడా ఒకటి. అమెరికాపై ఇష్టారీతిన సుంకాలు విధిస్తున్నారనే కారణంతో, తమ దేశంలోకి దిగుమతి చేసుకొనే వస్తువులపై ట్రంప్ ఇటీవల ప్రతీకార సుంకాలను ప్రకటించారు. భారత్, చైనా సహా అనేక దేశాలపై భారీగా సుంకాలను విధించారు.
ఆర్థిక మాంద్యం ప్రమాదం :
ప్రపంచంలోని అనేక దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. చైనాపై 54 శాతం టారిఫ్‌లు విధించగా.. భారత్‌పై 26 శాతం టారిఫ్‌లు విధించారు. దీనిపై ఇప్పటికే ఆర్థిక వేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాలతోపాటు అమెరికాపైనా ఈ ప్రతీకార సుంకాల నిర్ణయం భారీ ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక మాంద్యం ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.

నేటి నుంచే మోత :
ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం భారత్‌పై ఏప్రిల్ 5 నుంచి ప్రారంభం అయింది. ఈ తేదీ నుంచి 10 శాతం ప్రతీకార సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఇవాళ్టి నుంచి (ఏప్రిల్ 9) 26 శాతం సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఫలితంగా అమెరికాలో ఐఫోన్‌ల ధరలు భారీగా పెరగనున్నాయి.
ఆపిల్ కీలక నిర్ణయం :
ఈ పరిస్థితుల నేపథ్యంలో టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్‌లో ఆపిల్ సంస్థ ఐఫోన్, ఐప్యాడ్‌లు సహా ఇతర ఉత్పత్తులను తయారీ చేస్తోంది. అమెరికాలో ఆపిల్ ఉత్పత్తుల ధరలను కొంత కాలం అయినా వాయిదా వేసేందుకు వీలుగా భారత్ సహా ఇతర దేశాల నుంచి భారీ స్థాయిలో ఐఫోన్‌లను అమెరికాకు తరలించింది.
కొన్ని నెలల వరకు ప్రస్తుత ధరల్లోనే :
మార్చి చివరి వారంలో కేవలం మూడు రోజుల్లోనే ఐఫోన్‌లతో (iPhones) కూడిన 5 సరకు రవాణా విమానాలు భారత్ నుంచి అమెరికా వెళ్లినట్లు తెలిసింది. ట్రంప్ టారిఫ్‌లు పూర్తిస్థాయిలో అమల్లోకి రాకముందే భారత్ సహా ఇతర ఆపిల్ ప్లాంట్‌ల నుంచి ఐఫోన్‌లను దిగుమతి చేసుకుంటే.. కొన్ని నెలల వరకు ప్రస్తుత ధరల్లోనే విక్రయించే అవకాశం ఉంటుందని భావించినట్లు సమాచారం.
ఇతర దేశాల నుంచి అమెరికాకు దిగుమతి చేసుకున్న ఐఫోన్‌లతో కొన్ని నెలల వరకు ఇబ్బంది ఉండదని, అధ్యక్షుడు ట్రంప్ సుంకాల మోత ఇలానే కొనసాగితే ఏదో ఒక సందర్భంలో.. భారీగా ధరలను పెంచి, ఆపిల్ తన కస్టమర్‌లకు షాక్ ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారత్‌కు తరలింపు :
ప్రస్తుతం అమెరికాకు 9 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లు భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయి. ట్రంప్ విధించిన సుంకాల నుంచి తప్పించుకొనేందుకు ఆపిల్ తన ఐఫోన్‌ల ఉత్పత్తిని వీలైనంత వరకు భారత్‌కు తరలించే అవకాశం ఉంది.
భారత్‌పై 26 శాతం సుంకాన్ని విధించగా.. చైనాపై ఏకంగా 54 శాతం టారిఫ్‌ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత్ నుంచి దిగుమతి చేసుకోవడమే ప్రస్తుతానికి ఉత్తమ మార్గమని ఆపిల్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. సుంకాల భారం సహా ఇతర ప్రత్యామ్నాయలపై ఆపిల్ సమీక్షించుకుంటున్నట్లు తెలుస్తోంది.
అయితే ట్రంప్ సుంకాల ప్రభావం ఎక్కువ కాలం కొనసాగితే.. భారత్ వంటి మార్కెట్లలోనూ ఆపిల్ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా - చైనాల మధ్య వివాదాల కొనసాగుతున్న నేపథ్యంలో ఆపిల్ భారత్‌లో ఎక్కువగా ఐఫోన్‌లు సహా ఇతర ఉత్పత్తులను తయారీ చేసి అసెంబ్లింగ్ చేస్తోంది.


Click it and Unblock the Notifications