‘కాల్ కొట్టు.. టికెట్ పట్టు’

Posted By: Prashanth

‘కాల్ కొట్టు.. టికెట్ పట్టు’

 

‘‘రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్ టిసి) మరో అడుగు ముందుకేసింది... ప్రయాణికులకు మెరుగైన సేవలను కల్పించే క్రమంలో సాంకేతికతతో కూడిన కొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. అభిబస్ సర్వీసెస్ అనే ప్రయివేటు రంగ సంస్థతో జతకట్టి ఈ ప్రభుత్వ రంగ సంస్థ లాంచ్ చేసిన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్‌తో ఆడ్వాన్స్ టికెట్ బుకింగ్ మరింత సులభతరం కానుంది.’’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్‌టిసి) దేశంలోనే తొలిసారిగా ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవిఆర్ఎస్) ద్వారా అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. మంగళవారం హైదరాబాద్‌లోని అభిబస్ సర్వీసెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎపిఎస్ఆర్‌టిసి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బి.ప్రసాదరావు ఐవిఆర్ఎస్ సదుపాయాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఎపిఎస్ఆర్‌టిసి సెంట్రల్ కాల్‌సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ 1800 200 4599కు కాల్ చేసి క్రెడిట్, డెబిట్ కార్డును వినియోగించటం ద్వారా ప్రయాణికులు టికెట్లను బుక్ చేసుకోవచ్చని ప్రసాద రావు చెప్పారు. కాల్ సెంటర్ ఆపరేటర్ ప్రయాణానికి సంబంధించి అన్ని వివరాలను తీసుకున్న తర్వాత నేరుగా నగదు చెల్లింపు కోసం పేమెంట్ గేట్‌వే ఇంటర్‌ఫేస్‌కు క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను అందించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

చెల్లింపు పూర్తయిన వెంటనే టికెట్‌కు సంబంధించిన వివరాలు మొబైల్ ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలోనూ, ఇ టికెట్‌ను ఇ మెయిల్‌కు పంపించటం జరుగుతుందని ప్రసాదరావు వెల్లడించారు. కాల్ సెంటర్ ఆపరేటర్ ప్రమేయం లేకుండా పూర్తిగా కంప్యూటర్‌కు అనుసంధానించిన ఐవిఆర్ఎస్ విధానానికి క్రెడిట్, డెబిట్ కార్డు నంబర్లను వెల్లడించటం ద్వారా ఎక్కడ కూడా తప్పులు జరిగే అవకాశం ఉండదని అభిబస్ సిఇఒ సుధాకర్ రెడ్డి అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot