వీడియో షేర్ చేసిన AR రెహమాన్.. AI వరమో లేదా శాపమో అంటూ కామెంట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అనేక రంగాలను ఏఐ ప్రభావితం చేస్తోంది. విద్య రంగం సహా అనేక రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ AI పనితీరుపై ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. కొత్త తరాన్ని చూసి జాలిపడుతున్నా అంటూ.. టెక్నాలజీ వారికి ఆశీర్వాదమో లేదా శాపమో.. కాలమే నిర్ణయిస్తుందని వీడియోపైన ఏఆర్ రెహమాన్ రాసుకొచ్చారు.
ఆ వీడియోలో చైనాలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఏఐ ఆధారంగా పనిచేసే హెడ్‌బ్యాండ్‌లను వినియోగిస్తున్నారు. దీనిపై కొంత నిరాశను వ్యక్తం చేస్తూ రెహమాన్ ట్వీట్ చేశారు. ఈ వీడియోకు #ethicaluseoftechnology #ethicaluseofpower #ai #messingwithnature వంటి ట్యాగ్స్ ఇచ్చారు.

ఈ వీడియోను తొలుత వాల్ స్ట్రీట్ జర్నల్ తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే పరికరాల సాయంతో విద్యార్థులపై నిఘా పెట్టడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇందులో హెడ్‌బ్యాండ్‌ల ద్వారా విద్యార్థులు.. పాఠాలపై ఏ స్థాయిలో శ్రద్ధ వహిస్తున్నారో ట్రాక్ చేస్తున్నారు.
ఈ నివేదికలు విద్యార్థుల సామర్థ్యాలను సమర్థంగా అర్థం చేసుకొనేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఉపయోగపడతాయి. ఈ హెడ్‌బ్యాండ్‌పై ఉన్న నీలి రంగు లైట్ విద్యార్థి పరధ్యానంలో ఉన్నాడని తెలియజేస్తుంది. అదే తెలుపు రంగు లైట్ వెలిగితే ఆఫ్‌లైన్‌లో ఉన్నట్లు ఉపాధ్యాయులకు తెలుస్తుంది.
AI టెక్నాలజీ ఆధారంగా పనిచేసే రోబోట్‌లు తరగతి గదిలో అమర్చి ఉండడం కనిపిస్తోంది. ఈ రోబోట్‌లు విద్యార్థుల ఆరోగ్య మరియు ఇతర పరిస్థితులపై నిఘా పెడతాయి. దాంతోపాటు విద్యార్థులు ధరించిన యూనిఫాంలో అమర్చిన చిప్ ఆధారంగా వారి లోకేషన్‌ను ట్రాక్ చేస్తుంది. అంతేకాకుండా తరగతి గదుల్లో ఏర్పాటుచేసిన కెమెరాలతో విద్యార్థులు ఎన్నిసార్లు తమ ఫోన్లను చూస్తున్నారు. ఎన్నిసార్లు ఆవులింతలు పెడుతున్నారో కూడా తెలుసుకోవచ్చు.
అయితే ఈ ట్రాకింగ్, నిఘా విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతితోనే చేస్తున్నారు. విద్యార్థుల గ్రేడ్‌లను పెంచడం సహా మెరుగైన నైపుణ్యాలను అందించడం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డివైస్‌ల వినియోగం యొక్క ముఖ్య ఉద్దేశమని సమాచారం.
రెహమాన్ షేర్ చేసిన ఈ వీడియోపై అనేక మంది స్పందించారు. సైన్స్ ఫిక్షన్ సినిమా ప్రారంభ సన్నివేశంలా ఉందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఏదో ఒక రోజు విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు ఆ ఒత్తిడికి లొంగిపోతారని మరొకరు కామెంట్ చేశారు.
ఈ వీడియో బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్ మాదిరిగా టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన ప్రతికూల ప్రారంభాన్ని సూచిస్తోందని.. రెహమాన్ సర్ చెప్పినట్లుగా ఈ టెక్నాలజీ వరమో లేదా శాపమో కాలమే నిర్ణయిస్తుందని మరో ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశారు. ఈ ఏఐ ఆధారిత టెక్నాలజీ విద్యార్థులకు సాయం చేసేందుకు కాకుండా.. వారి తల్లిదండ్రులకు అలెర్ట్ చేసేందుకు లేదా భయపెట్టేందుకే అందుబాటులోకి తీసుకొచ్చారని మరో యాజర్ కామెంట్ చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు. టెక్ దిగ్గజాలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా మరిన్ని సంస్థను ఏఐ టెక్నాలజీని మరిన్ని రంగాలకు విస్తరించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








