ఏకంగా 10 లక్షల మంది యూజర్లను కోల్పోయిన టెలికాం సంస్థ.. ట్రాయ్ కీలక రిపోర్టు!
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం సంస్థలకు చెందిన కీలక వివరాలను విడుదల చేసింది. తాజాగా నవంబర్ నెలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. దీని ఆధారంగా జియో, ఎయిర్‌టెల్, ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL కొత్త యూజర్లను సంపాదించుకున్నాయి. అయితే వోడాఫోన్ ఐడియా మాత్రం భారీ సంఖ్యలో యూజర్లను కోల్పోయింది.
టాప్‌లో జియో :
ట్రాయ్ వెల్లడించిన వివరాల ఆధారంగా నవంబర్ నెలలో జియో (Jio) ఏకంగా 13.88 లక్షల యూజర్లను సంపాదించుకుంది. దీంతో మార్కెట్ షేర్ 41.41 శాతానికి చేరింది. మరో ప్రముఖ సంస్థ ఎయిర్‌టెల్ (Airtel) నవంబర్ నెలలో 12.15 లక్షల కొత్త యూజర్లను సంపాదించుకుంది. 33.64 శాతం మార్కెట్ షేర్‌ను కలిగి ఉంది.

4 లక్షలకు పైగా కొత్త యూజర్లతో BSNL :
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా భారీగా కొత్త యూజర్లను సంపాదించుకుంది. నవంబర్ నెలలో 4,21,514 మంది కొత్త యూజర్లు BSNL లో చేరారు. ఫలితంగా 7.92 శాతం మార్కెట్ షేర్ కు చేరుకుంది. దేశంలో 4G సర్వీసుల ప్రారంభం అనంతరం బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్ల పరంగా పుంజుకుంటోంది.
వోడాఫోన్ ఐడియాకు భారీ షాక్ :
అయితే MTNL మాత్రం యూజర్లను కోల్పోయింది. నవంబర్ నెలలో 7530 సబ్‌స్క్రైబర్లు నెట్‌వర్క్ ను వదిలి వెళ్లిపోయారు. వోడాఫోన్ ఐడియా కూడా భారీ సంఖ్యలో యూజర్లను కోల్పోయింది. నవంబర్ నెలలో ఏకంగా 10.11 లక్షల మంది Vi నెట్‌వర్క్ ను వదిలి వెళ్లిపోయారు.
వోడాఫోన్ ఐడియా ప్రస్తుతం 17.01 శాతం మార్కెట్ షేర్‌తో టెలికాం రంగంలో మూడో స్థానంలో ఉంది. 2025 తొలి భాగం నుంచి Vi తన 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. అయితే తొలుత ప్రధాన నగరాలు, పట్టణాల్లో అందుబాటులోకి తీసుకొస్తోంది. రానున్న మూడు సంవత్సరాల్లో 5G నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భారీ ఊరట :
వోడాఫోన్ ఐడియాకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించింది. AGR బకాయిలు రూ.87,695 కోట్లు ఫ్రీజ్ చేయడం సహా అయిదేళ్ల మారటోరియంకు ఆమోదం తెలిపింది. 2031-32 నుంచి 2040-41 వరకు ఈ చెల్లింపులను పూర్తి చేసేందుకు వీలు కల్పించింది.
4G నెట్‌వర్క్ ప్రారంభంతో :
BSNL గతంలో 4G నెట్‌వర్క్ ప్రారంభంతోపాటు అనేక అంశాలు కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో బీఎస్‌ఎన్‌ఎల్ అనేక ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొస్తోంది. మరియు పండుగల వంటి సందర్భాల్లో ప్రత్యేక డిస్కౌంట్లతోపాటు రూ.1 రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.
దీంతోపాటు 5G నెట్‌వర్క్ ప్రారంభం పై ప్రకటనలు మరియు ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్ మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలు వంటివి బీఎస్‌ఎల్‌ఎల్ పుంజుకోవడానికి కారణంగా తెలుస్తోంది. ట్రాయ్ ఇటీవల విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా మొబైల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 117.38 కోట్లుగా ఉంది. గత నెలతో పోలిస్తే 0.17 వృద్ది చెందింది. ఫిక్సిడ్ వైర్‌లెస్ సెగ్మెంట్ కూడా వృద్ధి చెందుతోంది.


Click it and Unblock the Notifications








