ప్రేమ్‌జీ సంచలన నిర్ణయం, విప్రో కొత్త సారధి ప్రకటన
సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ విప్రో ఫౌండర్, చైర్మన్ అజీం ప్రేమ్‌జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విప్రోను చిన్న స్థాయి వంట నూనెల సంస్థను దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దిన అజీం ప్రేమ్‌జీ త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. తన కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ చేతికి పగ్గాలు అందించనున్నారు. వచ్చే నెల 74వ పడిలో అడుగుపెట్టనున్న అజీం ప్రేమ్‌జీ.. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి జూలై 30న రిటైరవుతున్నారు.

ఆ తర్వాత నుంచి అజీం కుమారుడు, సంస్థ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్, బోర్డు సభ్యుడు అయిన రిషద్ ప్రేమ్‌జీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు చేపడతారు. రిటైరయ్యాక అజీం ప్రేమ్‌జీ అయిదేళ్ల పాటు 2024 దాకా విప్రో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కొనసాగుతారు. ఆయన వ్యవస్థాపక చైర్మన్‌గా ఉంటారని విప్రో పేర్కొంది.

దాతృత్వ కార్యకలాపాల కోసం మరింత సమయం
భవిష్యత్తులో దాతృత్వ కార్యకలాపాల కోసం మరింత సమయం వెచ్చించేందుకు అజీమ్ ప్రేమ్‌జీ ఆసక్తి చూపిస్తున్నారు. ధార్మిక కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నట్లు ఆయన గత మార్చిలో ప్రకటించారు. ‘ఈ సుదీర్ఘ ప్రస్థానం ఎంతో సంతృప్తికరం. భవిష్యత్‌లో మా ఫౌండేషన్ సామాజిక సేవా కార్యకలాపాలకు మరింత సమయం వెచ్చించాలనుకుంటున్నాను. కంపెనీని అధిక వృద్ధి బాట పట్టించగలిగే సామర్థ్యాలు రిషద్‌కు ఉన్నాయని గట్టిగా విశ్వసిస్తున్నాను‘ అని ప్రేమ్‌జీ పేర్కొన్నారు.

రూ. 52,750 కోట్ల విప్రో షేర్ల విరాళం
తన పేరిటే ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా ప్రేమ్‌జీ సేవా కార్యకలాపాల్లో ఉన్నారు. ఈ ట్రస్టు కు రూ. 52,750 కోట్ల విలువ చేసే విప్రో షేర్లను ఈ ఏడాది మార్చిలో ఆయన విరాళంగా ఇచ్చారు. ప్రేమ్‌జీ ఫౌండేషన్ విద్యా రంగంలో సేవలు అందించడంతో పాటు బడుగు వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న దాదాపు 150 పైగా స్వచ్ఛంద సేవా సంస్థలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తోంది. ప్రతిష్టాత్మకమైన పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాల గ్రహీత అయిన అజీం ప్రేమ్‌జీ రిటైర్మెంట్ తర్వాత దాతృత్వ కార్యకలాపాలు, సేవా కార్యక్రమాల్లో మరింతగా పాలుపంచుకోవాలని భావిస్తున్నారు.

8.5 బిలియన్ డాలర్ల (59 లక్షల కోట్లు) స్థాయికి
చిన్నగా ప్రారంభమైన విప్రో... అంచెలంచెలుగా ఎదిగి 8.5 బిలియన్ డాలర్ల (59 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుంది. అజీమ్ ప్రేమ్‌జీ సారథ్యంలో ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ అండ్ మెడికల్ డివైజ్ విభాగాల్లోకి అడుగు పెట్టింది. వంట నూనెలు తయారు చేసే చిన్న స్థాయి కంపెనీ నుంచి గ్లోబల్ ఐటీ కంపెనీగా ఎదిగింది. ఈ ఘనత అజీమ్‌దే. 1945లో తన తండ్రి స్థాపించిన వంట నూనెల కంపెనీని గ్లోబల్ ఐటీ ఫర్మ్ స్థాయికి తీసుకెళ్లారు ప్రేమ్‌జీ. 1966లో తన తండ్రి మరణానంతరం కంపెనీ బాధ్యతలు తీసుకున్నారు. 1982లో విప్రో ఐటీ ప్రోడక్ట్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. 2000 సంవత్సరంలో విప్రో న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయింది. బీపీవో వ్యాపారంలోకి అడుగు పెట్టింది. విప్రోలో అజీమ్ షేర్లు 74.3 శాతంగా ఉన్నాయి.

ఎవరీ రిషద్?
అజీమ్ ప్రేమ్‌జీ తన తనయుడు రిషద్‌కు కంపెనీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. రిషద్ వయస్సు 42 ఏళ్లు. హార్వార్డ్ బిజినెస్ స్కూల్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. విప్రోలో ఆయన 2007లో ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ విభాగంలో చేరారు. కంపెనీ ఎదుగుదలకు రిషద్ కృషి చేశారు. ప్రస్తుతం ఆయన చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్‌గా ఉన్నారు. నూతన చైర్మన్‌గా నియమితులవడం సంతోషంగా ఉందని, వాటాదారులకు, ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించడానికి తనవంతుగా కృషి చేస్తానని రిషద్ ప్రకటించారు. ఇటు విప్రో, అటు టెక్నాలజీ పరిశ్రమ పెను మార్పులకు లోనవుతున్న తరుణంలో అన్ని వర్గాలకూ ప్రయోజనాలు చేకూర్చేలా కృషి చేసేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను' అని రిషద్ పేర్కొన్నారు.

అజీమ్ ప్రేమ్‌జీ ఏమన్నారంటే?
విప్రో కంపెనీని అంతర్జాతీయస్థాయికి తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని అజీమ్ ప్రేమ్‌జీ అన్నారు. క్లయింట్లకు, భాగస్వామ్యులకు, ఇతర వాటాదారులు తమపై పెట్టుకున్న విశ్వాసం వల్లే ఇది సాధ్యమైందన్నారు. కంపెనీ ఈ స్థాయికి ఎదగడం వెనుక వేలాది మంది ఉద్యోగుల పాత్ర ఉందని ఆయన కితాబిచ్చారు. విప్రో తనకు అత్యంత సంతృప్తికరమైన ప్రయాణమని, రిషద్ నాయకత్వంపై తనకు విశ్వాసం ఉందని, ఆయన సారథ్యంలో విప్రో వృద్ధి పథంలో కొత్త శకంలోకి అడుగు పెడుతుందని భావిస్తున్నానని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications