హోలీ ఆఫర్లు, గిఫ్ట్ కార్డులంటూ మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.. ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో డిజిటల్ అరెస్ట్, ఇండియా పోస్ట్ పేరుతో నకిలీ మెసేజ్‌లు పంపి, మోసాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దీంతోపాటు పండుగలు సహా ప్రత్యేక సందర్భాలను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తాజాగా హోలీ (Holi) సందర్భంగా ఆఫర్లు, గిఫ్ట్‌లు, కూపన్‌ల పేరుతో జరుగుతున్న మోసాలపట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
నేరగాళ్ల నకిలీ మెసేజ్‌లు :
హోలీ సందర్భంగా రంగులు, గిఫ్ట్ పార్సిళ్లు, ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌లతోపాటు ఈ సందర్భంగా ఏర్పాటు చేసే పార్టీలకు పాస్‌లు ఇస్తామంటూ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.

ఆశపడినా, అవగాహన లేకపోయినా.. :
హోలీ పండుగ సందర్భంగా ఆఫర్లు, గిఫ్ట్ కార్డులంటూ వాట్సాప్ సహా ఇతర సోషల్ మీడియాల ద్వారా మెసేజ్‌లు పంపుతున్నారు. వ్యక్తిగతంగా మెయిల్స్‌లో నకిలీ లింక్స్ పంపుతున్నారు. ఆశపడడమో, అవగాహన లేకపోవడంతోనే ఈ లింక్స్ పైన క్లిక్ చేస్తే.. మీ ఫోన్ ను నేరగాళ్లు హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది.
ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ వివరాలు చెప్పవద్దు :
దీంతో మీ వ్యక్తిగత వివరాల చోరీతోపాటు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే ప్రమాదం ఉంటుంది. దీంతోపాటు OTP సహా ఇతర బ్యాంకింగ్, వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారానే సమాచారం తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
పండుగల సందర్భాల్లో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల గిఫ్ట్ కార్డులు, ఆఫర్లు అంటూ వచ్చిన లింక్స్ పైన ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. దీంతోపాటు అధికారిక, విశ్వసనీయమైన ప్లాట్‌ఫాంల ద్వారానే చెల్లింపులు చేయాలి.
లింక్స్ క్లిక్ చేస్తే ఏం చేయాలి :
పొరపాటున ఈ లింక్స్ పైన క్లిక్ చేస్తే, వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. కేంద్ర ప్రభుత్వ సైబర్ క్రైమ్ పోర్టల్ Cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలి. లేదా 1930 నంబర్‌కు కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు. సమీప పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.
ఇండియా పోస్ట్ పేరుతో అనేక మంది యూజర్లను మోసం చేస్తున్నట్లు గత నెలలో PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం హెచ్చరించింది. నకిలీ మెసేజ్ లు పంపినట్లు గుర్తించామని తెలిపింది. ఇండియా పోస్ట్ ఈ తరహా మెసేజ్ లు ఎప్పుడూ పంపదని యూజర్లు గుర్తుంచుకోవాలని సూచించింది.
ఇండియా పోస్ట్ ద్వారా మీకో పార్శిల్ వచ్చిందని, కానీ అందులో అడ్రస్ సక్రమంగా లేదని, తాము పంపిన లింక్ ద్వారా అడ్రస్ ను అప్‌డేట్ చేయాలంటూ సైబర్ నేరగాళ్లు మెసేజ్‌లు పెట్టినట్లు ఫ్యాక్ట్ చెక్ విభాగం గతంలో తెలిపింది. దీంతోపాటు పేమెంట్ చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ లింక్ క్లిక్ చేసిన అనంతరం నేరగాళ్లు.. ఆ వ్యక్తికి సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


Click it and Unblock the Notifications