Airtel 4 సంవత్సరాల తరువాత జియోను మొదటిసారి ఓడించింది!!! ఎందులోనో తెలుసా??
ఇండియాలోని టెలికాం సంస్థలు తమ యొక్క వినియోగదారుల యొక్క బేస్ ను పెంచుకోవడానికి రకరకాల విధానాలను అవలంబిస్తున్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) యొక్క తాజా నివేదికలో భాగంగా ఎయిర్టెల్ 2020 ఆగస్టు నెలలో జియో కంటే ఎక్కువ మంది సభ్యులను పొందినది. ఎయిర్‌టెల్ 28.99 లక్షల మంది సభ్యులను పొందగా, జియో 18.64 లక్షల మంది సభ్యులను మాత్రమే పొందగలిగింది. అయితే Vi (వోడాఫోన్ ఐడియా) ఆగస్టు నెలలో 12.28 లక్షల క్షీణతతో చందాదారులను కోల్పోయింది. అలాగే వైర్‌లెస్ టెలికాం మార్కెట్లో 35.08 శాతం మార్కెట్ వాటాతో రిలయన్స్ జియో అత్యధిక వాటాను కలిగి ఉంది. అయితే ఎయిర్‌టెల్ 28.12 శాతం మార్కెట్ వాటాతో రెండవ స్థానంలో నిలిచింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ట్రాయ్ టెలికాం ఆగస్టు నెల నివేదిక
ఆగస్టు 31 తో ముగిసిన నెలకు ట్రాయ్ యొక్క తాజా నివేదికను ఇప్పుడు వెల్లడించింది. ఇండియాలో ప్రస్తుతం మొత్తం వైర్‌లెస్ చందాదారుల సంఖ్య ఆగస్టు చివరి నాటికి జూలై చివరిలో గల 114.418 కోట్ల నుండి 114.792 కోట్లకు పెరిగింది. దీనిని బట్టి చూస్తే నెలవారీ వృద్ధి రేటు 0.33 శాతం నమోదైందని వెల్లడించారు. జూలైతో పోల్చినప్పుడు రిలయన్స్ జియో యొక్క చందాదారుల చేరికలు ఆగస్టులో గణనీయంగా తగ్గాయి. ఆగస్టులో కొత్త చందాదారుల చేరిక 35.54 లక్షల నుండి 18.64 లక్షలకు పడిపోయింది.

ఎయిర్‌టెల్ vs జియో: కొత్త చందాదారుల చేరిక
ఎయిర్టెల్ టెలికాం సంస్థ యొక్క కొత్త చందాదారుల చేరిక విషయానికి వస్తే జూలైలో దాని పనితీరుతో పోల్చినప్పుడు ఎయిర్టెల్ కూడా ఆగస్టు నెలలో 32.60 లక్షల నుండి 28.99 లక్షలకు తగ్గింది. అయితే ఆగస్టులో జియో కంటే ఇది మెరుగైన ప్రదర్శనను కలిగి ఉంది అని ఖత్చితంగా చెప్పవచ్చు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఎయిర్‌టెల్ సంస్థ ఈ నెలలో జియో కంటే 10.35 లక్షల మంది సభ్యులను కొత్తగా చేర్చుకున్నది.

ఎయిర్‌టెల్, జియో వృద్ధి శాతం
Vi(వోడాఫోన్ ఐడియా) సంస్థ ఆగస్టు నెలలో సుమారు 12.28 లక్షల మంది సభ్యులను కోల్పోయింది. అయితే జూలై నెలలో కోల్పోయిన 37.26 లక్షల మంది సభ్యులతో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉన్నాయి. బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ఆగస్టు నెలలో 2.14 లక్షల మంది సభ్యుల స్వల్ప లాభాలను ఆర్జించింది. వైర్‌లెస్ చందాదారులలో ఎయిర్‌టెల్ నెలవారీ వృద్ధి రేటు 0.91 శాతం ఉండగా, జియో 0.47 శాతం వృద్ధి రేటుతో వెనుకబడి ఉంది. TRAI ప్రకారం కోల్‌కతా మరియు హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలు ఆగస్టు నెలలో వైర్‌లెస్ చందాదారుల స్థావరంలో గరిష్టంగా 1.13 శాతం వృద్ధిని చూపించాయి.

వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో జియో హవా
బ్రాడ్‌బ్యాండ్ రంగంలో ట్రాయ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆగస్టు చివరినాటికి బిఎస్‌ఎన్‌ఎల్ 78.5 లక్షల మంది సభ్యులను కలిగి ఉందని వెల్లడించింది. అలాగే భారతి ఎయిర్‌టెల్ 25.3 లక్షల మంది సభ్యులతో రెండవ స్థానంలో, అట్రియా కన్వర్జెన్స్ 17 లక్షల మంది సభ్యులతో, జియో 12.5 లక్షల మంది సభ్యులతో తరువాత స్థానాలలో వరుసగా ఉన్నారు. వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో జియో 40.267 కోట్ల మంది సభ్యులతో అగ్రస్థానంలో ఉంది. ఎయిర్‌టెల్ 15.465 కోట్ల మంది వినియోగదారులను, వోడాఫోన్ ఐడియా 11.991 కోట్ల మందితో మరియు బిఎస్‌ఎన్‌ఎల్ 159 లక్షల మంది సభ్యులను కలిగి ఉన్నారు.


Click it and Unblock the Notifications