3జీ సేవలు మొదలుపెట్టిన ఎయిర్‌టెల్‌, వీడియోకాల్‌కు సెకనుకు 5 పైసలు

Posted By: Super

3జీ సేవలు మొదలుపెట్టిన ఎయిర్‌టెల్‌, వీడియోకాల్‌కు సెకనుకు 5 పైసలు

ఎయిర్‌టెల్‌ ఆంధ్రప్రదేశ్‌లో 3జీ సేవలకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు రాష్ట్ర రాజధాని (హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌)లో 3జీ సేవలు ప్రారంభించామని, త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, వరంగల్‌ వంటి నగరాలకు విస్తరిస్తామని భారతీ ఎయిర్‌టెల్‌ మొబైల్‌ సర్వీసెస్‌ ప్రెసిడెంట్‌ అతుల్‌ బిందాల్‌ మంగళవారం ఇక్కడ చెప్పారు. దేశంలోని 13 సర్కిళ్లలో 3జీ సేవల లైసెన్స్‌ కోసం రూ.13,000 కోట్లు చెల్లించామని (ఆంధ్రప్రదేశ్‌ కోసం రూ.1350 కోట్లు) ఆయన తెలిపారు. ఇప్పటివరకు 21 నగరాల్లో 20 లక్షల మంది 3జీ కనెక్షన్‌ పొందారని అతుల్‌ వెల్లడించారు. 2012 మార్చి నాటికి 500 నగరాలకు 3జీ సేవలు విస్తరించాలన్నది సంస్థ ప్రణాళికగా ఆయన పేర్కొన్నారు.

మొబైల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (వినోదం), మొబైల్‌ కామర్స్‌తో పాటు మొబైల్‌ హెల్త్‌ (ఆరోగ్య సంరక్షణ) సేవలు మరింత విస్తృతం అవుతాయని ఆయన పేర్కొన్నారు. 3జీ వినియోగదారుల కోసం హై డెఫినిషన్‌ గేమింగ్‌ను కూడా దేశం అంతటికీ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. 3.6 - 7.2 ఎంబీపీఎస్‌ వేగం వరకు డౌన్‌లోడ్‌ వేగంతో పనిచేసే రూ.1500-2200 విలువైన యూఎస్‌బీ మోడెమ్‌లను కూడా ఆయన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని 250 పట్టణాలు, 25,000 గ్రామాల్లో ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉండగా, 1.65 కోట్ల మంది వినియోగదారులున్నారని అతుల్‌ చెప్పారు.

ఇక ఎయిర్‌టెల్ 3జీ సేవల సదుపాయాలకు వస్తే గనుక 64 కేబీ సామర్థ్యం గల సిమ్‌ ఉన్న ప్రస్తుత 2జీ వినియోగదారులు 3జీ సేవలకు మారవచ్చు. ఇందుకోసం 3జీ అని 121కు ఎస్‌ఎంఎస్‌ పంపాలి. సాధారణ వాయిస్‌ కాల్‌, మొబైల్‌ టీవీ (100 చానళ్లు), వీడియో టాకీస్‌, వీడియో అలర్ట్స్‌ (అధిక ప్రాధాన్యం ఉన్న వార్తాంశాలు), మ్యూజిక్‌ స్టోర్‌ (10 లక్షల పాటలు), అప్లికేషన్‌ స్టోర్‌ (75 వేలకు పైగా), ఒకే టచ్‌తో సోషల్‌ సైట్‌లకు వేగంగా అనుసంధానం కావచ్చు. వీడియో కాల్స్‌కు (లోకల్‌/ఎస్‌టీడీ/రోమింగ్‌) సెకనుకు 5 పైసల చొప్పున ఛార్జి పడుతుంది. డేటా వినియోగానికి రోజుకు రూ.9 (10 ఎంబీ), నెలకు రూ.100 (100 ఎంబీ) నుంచి రూ.750 (2జీబీ) విలువైన ప్రీపెయిడ్‌ 3జీ కార్డులు విడుదల చేశారు. అధిక వినియోగం ఉన్న వారి కోసం నెలకు రూ.2000 ఛార్జీతో 14 జీబీ వరకు 3జీ ఆపై 20 కేబీపీఎస్‌ వేగంతో అపరిమిత వినియోగ పథకాన్ని మొబైల్‌, యూఎస్‌బీ మోడెమ్‌పై కల్పించారు. టీవీ చూసేందుకు సుమారుగా నిమిషానికి రూ.2 వరకు ఛార్జి అవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot