అలర్ట్.. ఇకపై షాపింగ్, టూరిజం, హాస్పిటాలిటీలకు ఆధార్? కానీ, మీ ప్రైవసీకి గ్యారెంటీ ఉందా?
Aadhaar authentication: భారతదేశంలో ఆధార్ కార్డు వినియోగం మరింత విస్తృతం కానుంది. ఇప్పటివరకు ప్రభుత్వ సేవలకు మాత్రమే పరిమితమైన ఈ డిజిటల్ ఐడెంటిటీ సిస్టమ్‌ను ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారాలు కూడా వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ-కామర్స్, టూరిజం, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్ వంటి రంగాల్లోని కంపెనీలు ఇకపై కస్టమర్లను వెరిఫై చేయడానికి ఆధార్‌ను ఉపయోగించవచ్చు. ఇది సౌకర్యవంతంగా అనిపించినా, వ్యక్తిగత ప్రైవసీకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
* కొత్త రూల్స్.. మరింత ఆధార్ వినియోగం..
కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ "ఆధార్ అథెంటికేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సోషల్ వెల్ఫేర్, ఇన్నోవేషన్, నాలెడ్జ్) అమెండ్‌మెంట్ రూల్స్, 2025" పేరుతో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. 2020లో చేసిన చట్టానికి ఇది సవరణ. ఇంతకుముందు ప్రైవేట్ కంపెనీలు ఆధార్ డేటాను ఉపయోగించడాన్ని ఈ చట్టం పరిమితం చేసింది.

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ మార్పులు చేశారు. దాదాపు రెండేళ్ల క్రితం ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను కోరింది, కానీ ఆ స్పందనలను మాత్రం బయటపెట్టలేదు. ప్రభుత్వం ఈ కొత్త రూల్స్‌తో సేవలు మరింత మెరుగుపడతాయని చెబుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు రెండూ ఆధార్‌ను ఉపయోగించుకునేలా చేయడం ద్వారా సర్వీస్ డెలివరీని వేగవంతం చేయొచ్చని అంటోంది.
ఇంతకుముందు ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరగకుండా చూడటానికి పెట్టిన రూల్‌ను ఇప్పుడు తొలగించారు. దీంతో ఆధార్ వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉంది. గతంలో కేవలం బ్యాంకులు, టెలికాం కంపెనీలు మాత్రమే ఆధార్‌ను ఎక్కువగా వాడేవి. కానీ దీన్ని ఇప్పుడు అన్నింటా విస్తరించడానికి ఇండియన్ గవర్నమెంట్ సిద్ధమైంది.
* రికార్డు స్థాయిలో ఆధార్ లావాదేవీలు
ఆధార్ వినియోగం ఇప్పటికే భారీగా పెరిగింది. ఒక్క జనవరి నెలలోనే 12,993 కోట్ల లావాదేవీలు జరిగాయి. గతేడాది ఫిబ్రవరిలో 10,913 కోట్ల లావాదేవీలు మాత్రమే జరిగాయి. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, నేషనల్ హెల్త్ ఏజెన్సీ, ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి పెద్ద సంస్థలు ఆధార్ వెరిఫికేషన్‌ను ఎక్కువగా వాడుతున్నాయి.
* వ్యాపారాలు ఎలా అప్లై చేసుకోవాలి..
కొత్త రూల్స్ ప్రకారం, వ్యాపార సంస్థలు తాము ఆధార్ అథెంటికేషన్ ఎందుకు వాడాలనుకుంటున్నారో వివరిస్తూ సంబంధిత ప్రభుత్వ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI), ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) సంస్థలు UIDAI సిఫార్సుల ఆధారంగా అప్లికేషన్లను పరిశీలిస్తాయి.
* సుప్రీంకోర్టు చెప్పిందేంటి..
అయితే, అనుమతి ఇవ్వడానికి ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు. దీంతో దుర్వినియోగం జరిగే అవకాశముందని నిపుణులు అంటున్నారు. 2018లో సుప్రీంకోర్టు ఆధార్ చట్టంలోని సెక్షన్ 57ను కొట్టివేసింది. ఈ సెక్షన్ ప్రైవేట్ సంస్థలు ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం ఆధార్‌ను ఉపయోగించడానికి అనుమతించేది. 2019లో ప్రభుత్వం స్వచ్ఛంద ఆధార్ అథెంటికేషన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది.
కానీ, ఈ సవరణను చట్టబద్ధంగా సవాలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఆధార్ చట్టబద్ధతను సవాలు చేసిన సుప్రీంకోర్టు న్యాయవాది ప్రసన్న.ఎస్ మాట్లాడుతూ, కొత్త సవరణ ద్వారా కొట్టివేసిన సెక్షన్ 57ను మళ్లీ తీసుకొస్తున్నారని విమర్శించారు. ఆధార్ డేటాకు ఎక్కువ మందికి యాక్సెస్ ఇస్తే వ్యక్తిగత ప్రైవసీకి ప్రమాదం పెరుగుతుందని హెచ్చరించారు.
* నిపుణులు ఏమంటున్నారు..
పబ్లిక్ పాలసీ నిపుణుడు సిద్ధార్థ్ డెబ్ మరో ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ సేవలకు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేస్తే, కొంతమంది ప్రజలకు సేవలు అందుబాటులో లేకుండా పోతాయని ఆయన అన్నారు. ఆధార్ వినియోగం నిజంగా స్వచ్ఛందంగా ఉండాలని, ప్రజలు ఇబ్బంది లేకుండా సేవలు పొందగలగాలని ఆయన నొక్కి చెప్పారు.


Click it and Unblock the Notifications








