సింగిల్ కాల్‌తో మొబైల్ యూజర్ల సొమ్మంతా దోచేస్తున్న కాల్ మెర్జింగ్ స్కామ్...
Call Merging Scam: ఒక్క నిమిషం ఊహించుకోండి... మీ ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేస్తే అవతల వ్యక్తి చాలా ఆసక్తిగా ఏదో ఆఫర్ గురించి చెబుతున్నారు. మీ నంబర్ మీ స్నేహితుడి ద్వారా దొరికిందని, మీ స్నేహితుడు ఇంకో నంబర్ నుంచి మీకు కాల్ చేయడానికి ట్రై చేస్తున్నారని కూడా అంటారు. వినడానికి నార్మల్‌గానే ఉంది కదా? కానీ ఒక్క క్షణం ఆగండి! ఇది నిజంగానే స్నేహితుడి కాల్ అనుకుంటున్నారా? అయితే మీరు మోసపోయినట్టే.
ప్రస్తుతం కాల్ మెర్జింగ్ స్కామ్ అనే కొత్త మోసం వేగంగా వ్యాప్తి చెందుతోంది. స్కామర్లు ఈ ట్రిక్ ఉపయోగించి మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బును కొట్టేస్తారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహించే UPI సంస్థ ఈ మోసం గురించి హెచ్చరిక జారీ చేసింది. ఇదెలా పనిచేస్తుందో, ఎలా జాగ్రత్తపడాలో తెలుసుకుందాం.

* కాల్ మెర్జింగ్ స్కామ్ ఎలా పనిచేస్తుందంటే
మీకు తెలియని వ్యక్తి నుంచి కాల్ వస్తుంది. కాలర్ మీ నంబర్ తమకు ఒక కామన్ ఫ్రెండ్ ఇచ్చారని చెబుతారు. వారు మిమ్మల్ని కాల్ మెర్జ్ చేయమని అడుగుతారు. మీ స్నేహితుడు మరొక నంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని, కాల్‌ను మెర్జ్ చేయమని మిమ్మల్ని అడుగుతారు. రెండవ కాల్ నిజానికి మీ బ్యాంక్ నుంచి వస్తుంది.
ఇది మీ స్నేహితుడి కాల్ కాదు. ఇది బ్యాంక్ నుంచి వచ్చే OTP వెరిఫికేషన్ కాల్. స్కామర్లు దీన్ని పక్కాగా టైమింగ్ చూసి చేస్తారు.. మీరు కాల్స్‌ను మెర్జ్ చేసినప్పుడు, మీరు స్కామర్‌తో OTPని షేర్ చేస్తున్నారని మీకు తెలియదు. ఆ OTPతో, స్కామర్లు లావాదేవీలను పూర్తి చేసి మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేస్తారు.
* జాగ్రత్తలు
తెలియని నంబర్ల నుంచి కాల్‌లను ఎప్పుడూ మెర్జ్ చేయవద్దు. ఎవరైనా మిమ్మల్ని కాల్ మెర్జ్ చేయమని అడిగితే, ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయమైతే, జాగ్రత్తగా ఉండాలి. కాలర్ ఒక స్నేహితుడి తరపున మాట్లాడుతున్నానని చెప్పుకుంటే, మీ స్నేహితుడికి విడిగా కాల్ చేయండి లేదా మెసేజ్ చేసి నిర్ధారించుకోండి.
OTPల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు అభ్యర్థించని లావాదేవీ కోసం OTP వస్తే, దానిని ఎవరితోనూ షేర్ చేయవద్దు. స్కామ్ అని అనుమానం వస్తే, జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి రిపోర్ట్ చేయాలి. స్కామర్లు డబ్బును కొట్టేయడానికి కొత్త మార్గాలను వెతుకుతూనే ఉంటారు. ఈ కాల్ మెర్జింగ్ స్కామ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి.


Click it and Unblock the Notifications








