ఆ మిస్టేక్ బిల్‌గేట్స్‌కు 40 వేల కోట్ల డాలర్ల నష్టాన్ని మిగిల్చింది
బిల్‌గేట్స్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిగా, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ కో చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన జీవితంలో అతి పెద్ద మిస్టేక్ చేశానని చింతిస్తున్నారు. ఈ మిస్టేక్ ఫలితంగా కంపెనీకి 40,000 కోట్ల డాలర్ల నష్టం వచ్చిందని వివరించారు.

ఆండ్రాయిడ్‌ను అభివృద్ధి చేసే అవకాశం గూగుల్‌కు దక్కేలా చేయడం, ఆండ్రాయిడ్‌కు ధీటైన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను తయారు చేసుకోలేకపోవడం తాను చేసిన అతి పెద్ద తప్పు అని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్‌గేట్స్ పేర్కొన్నారు. తమ ఆండ్రాయిడ్‌ను 5 కోట్ల డాలర్లకే ఎగరేసుకుపోయిన గూగుల్ నిజమైన విజేతగా నిలిచిందని పేర్కొన్నారు. వెంచర్ క్యాపిటల్ సంస్థ, విలేజ్ గ్లోబల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్యూలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

స్మార్ట్‌ఫోన్లలో 85 శాతానికి పైగా ..
ఆపిల్ ఫోన్లు కాకుండా మిగిలిన ఇతర ఫోన్లకు ప్రామాణిక ప్లాట్‌ఫాంగా ఆండ్రాయిడ్ అవతరించిందని, మైక్రోసాఫ్ట్ ఆ స్థానంలో ఉండాల్సిందని ఆయన వివరించారు. గూగుల్ కంపెనీ ఆండ్రాయిడ్‌ను 2005లోనే కొనుగోలు చేసింది. ఐఫోన్ 2007లో మార్కెట్లోకి రాగా, ఆండ్రాయిడ్ ఫోన్ 2008లో మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం తయారవుతున్న స్మార్ట్‌ఫోన్లలో 85 శాతానికి పైగా ఆండ్రాయిడ్ ఓఎస్‌తో ఉన్నవే. ఇక విండోస్ ఓఎస్‌తో తయారైన ఫోన్‌లు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.

మొబైల్ టెక్నాలజీలో
ఇటీవల రెండు ఇంటర్వ్యూల్లోనూ, ఒక ఫోరంలో మాట్లాడుతున్నప్పుడు బిల్ గేట్స్ ఈ సంగతిని ప్రస్తావించారు. ఐఓఎస్‌కు పోటీగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను గూగుల్‌కు మైక్రోసాఫ్ట్ ఎలా కోల్పోయిందీ వివరించారు. మొబైల్ టెక్నాలజీలో ఆధిపత్య స్థాయిలో ఉండే అవకాశాన్ని కోల్పోయామని, ఇందుకు సుదీర్ఘ కాలంగా సాగిన యాంటీ ట్రస్ట్ విచారణే కారణం అని చెప్పారు.

ఆపరేటింగ్ సిస్టమ్-ఓఎస్
సాఫ్ట్‌వేర్ ప్రపంచంలో ముఖ్యంగా ప్లాట్‌ఫామ్ (ఆపరేటింగ్ సిస్టమ్-ఓఎస్)ల వల్లే మార్కెట్లలో విజయవంతం అవుతాం. వ్యక్తిగత కంప్యూటర్లకు విండోస్ ఓఎస్‌తో విజయం సాధించాం. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఇది సాధ్యం కాలేదు. ఐఓఎస్ కేవలం ఐఫోన్లకే పరిమితం. అందువల్ల ఇతర ఫోన్లకు వేరే ఓఎస్ అవకాశం కచ్చితంగా ఉంది. ఆండ్రాయిడ్ అలా స్థిరపడిందని బిల్ గేట్స్ అన్నారు.

ఇవీ కారణాలు
ఆపిల్ తన ఐఫోన్‌ను 2007లో తీసుకు వచ్చింది. గూగుల్ తన ఆండ్రాయిడ్‌ను 2008లో తీసకు వచ్చింది. అంతకుముందు 2000 సంవత్సరంలోనే మైక్రోసాఫ్ట్ ఓఎస్ విండోస్ మొబైల్‌ను తీసుకు వచ్చింది. అయితే ఐవోఎస్, ఆండ్రాయిడ్ కంటే మైక్రోసాఫ్ట్ ముందే తెచ్చిన ఓఎస్ విండోస్ వెనుకబడింది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. అప్పుడు యూఎస్ డిపార్టుమెంట్ ఫిర్యాదు నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ యాంటీ ట్రస్ట్ విచారణ ఎదుర్కోవడం, మొబైల్ మార్కెట్ పైన దృష్టి పెట్టలేకపోవడం వంటి కారణాలున్నాయి.

బిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయం
మొబైల్‌లో ఏమైతే తప్పనిసరిగా సాధించాలని భావించామో, అది చేయలేకపోయామని బిల్ గేట్స్ చెప్పారు.. ఆండ్రాయిడ్‌ను అభివృద్ధి చేసిన గూగుల్‌కు, బిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయం లభిస్తోందని, 2017లో విండోస్ 10 ఫోన్లకు సహకారం విరమించుకుంటున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. కంప్యూటర్ల రంగంలో మాత్రం విండోస్, ఆఫీస్‌తో పటిష్టంగా ఉన్నాం అని బిల్‌గేట్స్ పేర్కొన్నారు.

రూ.70 లక్షల కోట్ల మార్కెట్
ప్రస్తుత సీఈఓ సత్య నాదెళ్ల నేతృత్వంలో మైక్రోసాఫ్ట్ విలువ మరింత పెరుగుతోంది. రూ.70 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎదిగింది' అని బిల్ గేట్స్ ప్రశంసించారు. దశాబ్ధం క్రితమే మైక్రోసాఫ్ట్ రోజువారీ యాజమాన్య కార్యకలాపాల నిర్వహణ నుంచి బిల్ గేట్స్ తప్పుకున్నారు. తమ వద్ద నిపుణులు ఉన్నా.. ఆండ్రాయిడ్ సిస్టమ్‌పై పట్టు సాధించలేకపోయామని వ్యాఖ్యానించారు.

పూర్తి బాధ్యత తనపైనే
స్మార్ట్‌ఫోన్ల విప్లవాన్ని ముందే ఊహించి అందుకు తగిన విధంగా ప్రతిస్పందించకపోవడం తన తప్పేనంటూ పూర్తి బాధ్యత తనపైనే వేసుకున్నారు. నిజానికి ఆండ్రాయిడ్ విప్లవం మొదలైనప్పుడు ఆయన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌పైనే పూర్తిగా దృష్టిసారించి ఉన్నారు. 2006లోనే ఆయన మైక్రోసాఫ్ట్ కార్యకలాపాల్లో తన పాత్రను తగ్గించుకున్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ అడ్వైజర్ గా ఉన్న బిల్ గేట్స్.. తన టైంలో ఆరో వంతు మాత్రమే సంస్థ కోసం కేటాయిస్తున్నారు. మిగతా సమయం అంతా ఎనర్జీ వెంచర్ ఫండ్, కర్బన ఉద్గారాల నియంత్రణ, భూతాప నివారణ తదితర అంశాలపై కేంద్రీకరించారు.


Click it and Unblock the Notifications