భారత్‌లో బ్లాక్‌బెర్రీ ప్లాంట్: తగ్గనున్న మొబైల్ ఫోన్ ధరలు..!

Posted By: Staff

భారత్‌లో బ్లాక్‌బెర్రీ ప్లాంట్: తగ్గనున్న మొబైల్ ఫోన్ ధరలు..!

నేటి ఆధునిక ప్రపంచంలో నిత్యావసర వస్తువుల్లో మొబైల్ ఫోన్ కూడా ఓ భాగంగా మారిపోయింది. దేశంలో మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న తరుణంలో వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు విదేశీ మొబైల్ కంపెనీలు భారత్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే భారత్‌లో నోకియా, శాంసంగ్, ఎల్‌జి వంటి కంపెనీలు ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. కెనడాకు చెందిన 'బ్లాక్‌బెర్రీ' మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ రీసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) కూడా ఇక్కడ ప్లాంటును ఏర్పాటును చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

రిమ్‌కు భారత్ ఒక ముఖ్యమైన పటిష్ట మార్కెట్ అని, వేగంగా విస్తరిస్తున్న భారత మొబైల్ మార్కెట్ తమకు మంచి అవకాశాలను ఇవ్వగలదని కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇక్కడి మార్కెట్ అవసరాలను తీర్చడమే కాకుండా.. భారత్‌ను ఓ ఎగుమతుల కేంద్రం (ఎక్స్‌పోర్ట్ హబ్)గా కూడా ఈ ప్లాంట్‌ను రూపొందించాలని కంపెనీ భావిస్తోంది. అయితే ఈ ప్లాంట్‌కు సంబంధించిన పెట్టుబడులు, ఏర్పాటు చేయబోయే ప్రాంతం తదితర వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

ప్రముఖ బ్లాక్‌బెర్రీ వినియోగదారులను కలుసుకునేందుకు, ఇక్కడి వ్యాపార వ్యూహాలను అంచనా వేసేందుకు రిమ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, రాబిన్ బీన్‌ఫెయిట్ త్వరలో భారత్‌కు రానున్నారు. ఇతర గ్లోబల్ మొబైల్ కంపెనీల మాదిరిగానే రిమ్ కూడా భారత్‌లో ప్లాంట్ ఏర్పాటు చేసినట్లయితే.. తక్కువ ధరలకే బ్లాక్‌బెర్రీ ఫోన్లు లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్లాక్‌బెర్రీ 18 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot