బ్లింకిట్ నుంచి అంబులెన్స్ సర్వీసెస్ లాంచ్.. 10-నిమిషాల్లో మీ చెంతకు అత్యవసర వైద్యం!
ఆన్‌లైన్ డెలివరీ రంగంలో దూసుకుపోతున్న బ్లింకిట్ ఇప్పుడు అత్యవసర వైద్య సేవల్లోనూ తనదైన ముద్ర వేస్తోంది. గురుగ్రామ్‌లో 10 నిమిషాల్లో వచ్చే సరికొత్త అంబులెన్స్ సేవలను ప్రారంభించి సంచలనం సృష్టించింది. ఇకపై అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి క్షణాల్లో వైద్య సహాయం అందనుంది.
ఈ BLS (బేసిక్ లైఫ్ సపోర్ట్) అంబులెన్స్‌లు అత్యాధునిక వైద్య పరికరాలు కలిగి ఉంటాయి. ఆక్సిజన్ సిలిండర్లు, ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డిఫిబ్రిలేటర్ (AED), స్ట్రెచర్, మానిటర్, సక్షన్ మెషిన్‌తో పాటు అత్యవసర మందులు, ఇంజెక్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే, ప్రాణాలు కాపాడటానికి అవసరమైన అన్ని వసతులు ఒకే చోట!

అంతేకాదు, ప్రతి అంబులెన్స్‌లో శిక్షణ పొందిన పారామెడిక్, సహాయకుడు, డ్రైవర్ ఉంటారు. వీరు అత్యవసర పరిస్థితుల్లో క్షణాల్లో స్పందించి రోగికి ప్రాథమిక చికిత్స అందిస్తారు. దీంతో ఆసుపత్రికి చేరేలోపే రోగికి ఉపశమనం కలుగుతుంది. బ్లింకిట్ తీసుకువచ్చిన ఈ విప్లవాత్మక మార్పుతో అత్యవసర వైద్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి.
* గురుగ్రామ్‌లో ప్రారంభం
భారతీయ నగరాల్లో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కోసం ఎదురుచూపులు ఇక కష్టాలు తీరనున్నాయని బ్లింకిట్ CEO అల్బిందర్ ధిండ్సా పేర్కొన్నారు. X (గతంలో ట్విట్టర్) ద్వారా ఈ శుభవార్తను పంచుకున్నారు. అత్యవసర వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో, లాభాపేక్ష లేకుండా తక్కువ ధరకే అంబులెన్స్ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం గురుగ్రామ్‌లో ఐదు అంబులెన్స్‌లతో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. రాబోయే రెండేళ్లలో దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు కూడా ఈ సేవలను విస్తరించాలని బ్లింకిట్ యోచిస్తోంది. అలాగే, త్వరలోనే బ్లింకిట్ యాప్ ద్వారానే BLS అంబులెన్స్‌ను బుక్ చేసుకునే సౌలభ్యం కూడా రానుంది. అంటే, ఫోన్‌లో ఒక క్లిక్‌తో అంబులెన్స్ మీ వద్దకు వచ్చేస్తుంది.
* 10 నిమిషాల్లో అన్నీ మీ ఇంటికే!
బ్లింకిట్ టెక్నాలజీ, వినోదం, ఆర్థిక లావాదేవీలు.. ఇలా అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తోంది. 2024లో బ్లింకిట్ చేసిన కొన్ని సంచలన ఆవిష్కరణలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఐఫోన్ 16, శామ్‌సంగ్ గెలాక్సీ S24, ప్లేస్టేషన్ 5 వంటి లేటెస్ట్ గాడ్జెట్స్‌తో పాటు బంగారం, వెండి నాణేలనూ కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేస్తోంది.
అలాగే, హిసార్, జమ్మూ, లోనావాలా, రాయ్‌పూర్ లాంటి కొత్త నగరాలకు కూడా తన సేవలను విస్తరించింది. అంటే, ఇప్పుడు ఈ నగరాల ప్రజలు కూడా బ్లింకిట్ స్పీడ్ ఏమిటో రుచి చూడబోతున్నారు. ఇవే సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తే ప్రజలకు బాగా లాభం చేకూరుతుందని చెప్పుకోవచ్చు
ఇక, ఖరీదైన వస్తువులు కొనాలనుకునేవారికి బ్లింకిట్ ఒక చక్కటి ఆప్షన్ తీసుకొచ్చింది. అదే EMI ఆప్షన్. దీని ద్వారా వస్తువులను కొని, డబ్బును నెలవారీ వాయిదాలలో చెల్లించవచ్చు. ఇది వినియోగదారులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మొత్తానికి బ్లింకిట్ తన వినూత్న ఆలోచనలతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


Click it and Unblock the Notifications








