వివాదంలో ‘ఆకాష్’..విడుదలకు మరింత జాప్యం?

Posted By: Staff

 వివాదంలో ‘ఆకాష్’..విడుదలకు మరింత జాప్యం?

 

న్యూఢిల్లీ: ప్రపంచపు తక్కువ ధర టాబ్లెట్ కంప్యూటర్ ఆకాష్, రిటైల్ మార్కెట్లో విడుదలకు సంబంధించి మరింత జాప్యం నెలకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ట్యాబ్లెట్లను రూపొందించిన డేటావిండ్ కంపెనీకి, తయారీ కాంట్రాక్టు పొందిన హైదరాబాద్ కంపెనీ క్వాడ్ ఎలక్ట్రానిక్స్‌కు మధ్య వివాదం ముదరడమే సందిగ్ధతకు కారణమని తెలుస్తోంది. ఆకాష్ టాబ్లెట్ల తయారీ కంట్రాక్టు పై సంతకాలు చేసిన క్వాడ్, ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి

ఈ డివైజ్‌ను అభివృద్ధి చేసేందుకుగాను ఐఐటీ-రాజస్థాన్‌తో ప్రత్యక్షంగా డీల్ కుదుర్చుకుందని డేటావిండ్ సీఈఓ సునీత్ సింగ్ తులి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

డేటావిండ్ నిపుణుల బృందం అంతర్గతంగా ఆకాశ్‌ను అభివృద్ధి చేసిందని, అసెంబ్లింగ్ పనులను మాత్రమే క్వాడ్‌కు సబ్ కాంట్రాక్టుగా అప్పగించినట్లు ఆయన చెప్పారు. అందువల్ల ఈ ట్యాబ్లెట్‌పై మేథోసంపత్తి హక్కులు పూర్తిగా డేటావిండ్‌కే చెంతుతాయని తులి చెప్పారు. డీల్‌కు విరుద్ధంగా కొత్త తరం డివైజ్‌ను రూపొందించేందుకు క్వాడ్, ఐఐటీ రాజస్థాన్‌తో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుందని ఆయన ఆరోపించారు. దీనిపై క్వాడ్‌కు నోటీసులు పంపామని, ఆ కంపెనీ గనుక ఈ వివాదాన్ని పరిష్కరించకపోతే కోర్టుకెక్కుతామని తులి హెచ్చరించారు. రూ.1,100కే ఆకాశ్ ట్యాబ్లెట్లను విద్యార్థులకు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రిటైల్ మార్కెట్లో డేటావిండ్ వీటిని ప్రస్తుతం రూ.2,999కి విక్రయిస్తోంది.

ఇదిలాఉండగా, క్వాడ్‌తో డేటావిండ్ ఇప్పటికే సంబంధాలను నిలిపేసిందని, దీంతో రిటైల్ మార్కెట్లో ఆకాశ్ డెలివరీలు షెడ్యూల్ కంటే లేటుగా జరగనున్నట్లు సమాచారం. కస్టమర్ల కాల్స్‌కు సరిగ్గా స్పందించడంలేదన్న ఆందోళనలపై తులి మాట్లాడుతూ... కంపెనీ టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తోందని, అయితే రోజుకు 40 వేలకు పైగా కాల్స్ వస్తుండటంతో వాటిని పరిష్కరించడంలో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఆయన వివరించారు. ప్రీ-పేమెంట్ డిపాజిట్ చేసిన వారికి 48 గంటల్లోగా రీసీట్‌తో పాటు సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబర్ కాకుండా ప్రత్యేకమైన ఈ-మెయిల్ అడ్రస్, నిర్దిష్ట ఫోన్ నంబర్‌ను ఇస్తున్నట్లు కూడా తులి పేర్కొన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot