BSNL యూజర్లకు గుడ్‌న్యూస్.. 30,000 టవర్ల వద్ద బ్యాటరీల ఏర్పాటు.. సిగ్నల్ సమస్యకు చెక్..!
BSNL నెట్‌వర్క్ కు 2024 సంవత్సరం రెండో భాగం బాగా కలిసొచ్చింది. ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి సంస్థల టారిఫ్‌ల పెంపుతో లక్షలాది మంది యూజర్లు ప్రభుత్వ రంగ సంస్థ BSNL వైపు మొగ్గుచూపారు. ఫలితంగా సుమారు 50 లక్షల మంది యూజర్లు నెట్‌వర్క్ లో చేరారు. దీంతోపాటు సుమారు 17 సంవత్సరాల తర్వాత లాభాల్లోకి వచ్చింది. 2024-25 మూడో త్రైమాసికంలో సంస్థ రూ.262 కోట్లు లాభాలు ఆర్జించింది.
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ అనేక చర్యలు తీసుకుంది. 4G నెట్‌వర్క్‌ను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేయడం సహా 5G నెట్‌వర్క్‌ను టెస్టింగ్ చేసింది. దీంతోపాటు ఇతర టెలికాం సంస్థల కంటే తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

అయితే నెట్‌వర్క్ సమస్య, కాల్ డ్రాప్‌ల కారణంగా సుమారు 3 లక్షల మంది యూజర్లు BSNL నుంచి తిరిగి ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లిపోయారు. దీంతో దిద్దుబాటు చర్యలను సంస్థ చేపడుతోంది. విద్యుత్ అంతరాయం సమయంలో నెట్‌వర్క్ సిగ్నల్స్ లేక యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పులు చేసేందుకు చర్యలు తీసుకుంది.
ఇందులో భాగంగా 30,000 నెట్‌వర్క్ టవర్ల వద్ద బ్యాటరీలను ఏర్పాటు చేసింది. ఫలితంగా విద్యుత్ అంతరాయాల సమయాల్లోనూ సిగ్నల్ సమస్య లేకుండా ఉంటుంది. దీంతోపాటు 15000 పైగా ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్నట్లు పేర్కొంది. జూన్ 2025 నాటికి 35000 కు పైగా విద్యుత్ ప్లాంట్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
కేంద్ర టెలికాం శాఖ ఈ వివరాలను సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. BSNL మౌలిక వసతులు మెరుగుపరచడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. దీంతోపాటు ఈ సంవత్సరం మే నాటికి 4G నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లక్ష టవర్లను ఏర్పాటు చేస్తోంది. దీంతోపాటు ఈ సంవత్సరం జూన్ నుంచి 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ఎంపిక చేసిన నగరాల్లో తొలి దశలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 5G నెట్‌వర్క్‌కు సంబంధించి కొన్ని పరీక్షలు పూర్తి చేశారు.
* BSNL ఇటీవల 90 రోజుల వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.411 రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. అంటే మొత్తం వ్యాలిడిటీలో 180GB డేటాను పొందవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో ఎటువంటి కాలింగ్ ప్రయోజనాలను అందించడం లేదు.
దీంతోపాటు 365 రోజుల వ్యాలిడిటీతో మరో రీఛార్జ్ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ లాంచ్ చేసింది. రూ.1515 రీఛార్జ్ ప్లాన్‌తో అన్‌లిమిడెట్ కాలింగ్, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ సంవత్సరం వరకు ఈ ప్రయోజనాలను పొందవచ్చు.
* ట్రాయ్ ఇటీవల తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఆధారంగా కేవలం రూ.20 లతోనే సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచేందుకు అవకాశం ఉంది. 90 రోజులపాటు డేటా, కాల్స్, SMS లు వినియోగించకుండా ఉండే ఆ సిమ్ డియాక్టివేట్ కానుంది. ఇలా జరగకుండా ఉండాలంటే రూ.20 రీఛార్జ్ చేస్తే.. 30 రోజులపాటు సిమ్ యాక్టివ్‌గా ఉంటుంది. BSNL సహా ఇతర నెట్‌వర్క్‌ల్లో ఇదే సదుపాయం అందుబాటులో ఉంది.
ఇలా చేయడం ద్వారా కేవలం సిమ్ కార్డు యాక్టిగా మాత్రమే ఉంటుంది. దీని ద్వారా ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ సదుపాయం ఉండదని టెలికాం సంస్థలు చెబుతున్నాయి. ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








