శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్తున్నారా.. Free Wifi సహా ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి..!!
శబరిమల అయ్యప్ప దర్శనానికి (Sabarimala Ayyappa) దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. గత సంవత్సరం తలెత్తిన వివాదాల నేపథ్యంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. భక్తుల సౌకర్యం కోసం అనేక ముందస్తు ఏర్పాటు చేస్తోంది. దీంతోపాటు రోజుకు గరిష్ఠంగా 80 వేల మందిని మాత్రమే అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతిస్తామని ఇప్పటికే ప్రకటన చేసింది. అందులో దర్శనం కోసం ముందస్తు బుకింగ్ చేసుకున్న 70 వేల మందితో పాటు స్పాట్ బుకింగ్ చేసుకొనేందుకు మరో 10 వేల మందికి మాత్రమే అనుమతిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి.
శబరిమలలో భక్తుల కోసం ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఉచితంగా వైఫై ను అందించేందుకు (BSNL Free Wi-Fi in Sabarimala ముందుకు వచ్చింది. ఇందుకోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (TDB) తో BSNL కలిసి పనిచేస్తోంది. భక్తుల కోసం పంపా, నీలక్కల్, సన్నిధానం వంటి ప్రధాన కేంద్రాల్లో Wi-Fi హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేసింది.

పంపా లో 13 హాట్‌స్పాట్, నీలక్కల్‌లో 13, సన్నిధానంలో 22 హాట్‌స్పాట్‌లను BSNL ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాల్లోని భక్తులు OTP ద్వారా ఈ ఉచిత వైఫైను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు శబరిమలకు వచ్చే మార్గాల్లో 21 మొబైల్ టవర్‌లను ఏర్పాటు చేసినట్లు BSNL తెలిపింది. అయ్యప్ప మాలధారుల సౌకర్యం కోసం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఉచిత వైఫైకు ఎలా కనెక్ట్ కావాలి :
BSNL వైఫైను ఉచితంగా కనెక్ట్ చేసుకోవడం కోసం ముందుగా ఆయా ప్రాంతాల్లోని BSNL నెట్‌వర్క్ హాట్‌స్పాట్‌లను ఎంచుకోవాలి. అనంతరం మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ నంబర్‌కు OTP వస్తుంది. OTP ను ఎంటర్ చేశాక.. వైఫై కనెక్ట్ కానుంది. 30 నిమిషాలపాటు భక్తులు ఈ వైఫైను ఉచితంగా వినియోగించుకోవచ్చు. అనంతరం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని BSNL తెలిపింది.
స్వామి చాట్‌బాట్ :
దీంతోపాటు శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం కేరళ ప్రభుత్వం ప్రత్యేక చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వామి (Swamy) చాట్‌బాట్ స్మార్ట్‌ఫోన్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఆరు భాషల్లో భక్తులకు అందుబాటులో ఉంటుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో వినియోగించుకోవచ్చు.
అయ్యప్ప స్వామే స్వయంగా వివరాలు అందించినట్లుగా ఈ చాట్‌బాట్‌ను రూపొందించారు. అయ్యప్ప సన్నిధానంలో పూజా సమాచారం, రైళ్లు, విమానాలు, పోలీసు, అటవీ శాఖ సేవలను స్వామి చాట్‌బాట్ ద్వారా పొందవచ్చు. దీంతోపాటు శబరిమలకు వచ్చే యాత్రికులను అప్రమత్తం చేసేందుకు వీలుగా భారత వాతావరణ విభాగం.. మూడు కేంద్రాలను ఏర్పాటు చేసింది.
18 గంటలపాటు దర్శనం :
శబరిమలలో మండల మకరవిళక్కు సీజన్‌లో వచ్చే అయ్యప్ప భక్తుల కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప దర్శన సమయాన్ని 18 గంటలకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తామని తెలిపింది. దర్శన టికెట్ల స్పాట్ బుకింగ్ కోసం ఎరుమేలి, వండిపెరియార్, పంపా వద్ద మూడు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications