BSNL 4G Services ఆగస్టు 15 నుంచి BSNL 4G సర్వీసులు.. దేశవ్యాప్తంగా లక్ష టవర్‌ల ఏర్పాటు..!
ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా గత నెలలో మొబైల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచాయి. తక్కువ ధరలో సర్వీసులు అందించడం సహా త్వరలో 4G సేవలు ప్రారంభం కానుండడంతో అనేక మంది వినియోగదారుల చూపు BSNL వైపు మళ్లింది. ఫలితంగా లక్షల మంది మొబైల్ వినియోగదారులు BSNL కు పోర్టింగ్ అవుతున్నారు. జులై నెలలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 2.31 లక్షల మంది BSNL కనెక్షన్‌లు తీసుకున్నారని సంస్థ వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లోనూ BSNL కు పోర్టింగ్ విజ్ఞప్తులు, కొత్త కనెక్షన్‌ల సంఖ్య పెరుగుతోంది. తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో BSNL 4G సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ నాటికి మరిన్ని ప్రాంతాల్లో 4G నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకురానుంది. గ్రామాల్లో సైతం 4G సర్వీసులు అందించేందుకు అవసరమైన ఏర్పాటు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సెప్టెంబర్ నెల చివరి నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 4G ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

దీంతోపాటు ప్రస్తుత BSNL వినియోగదారులు 4G సిమ్ కార్డులకు అప్‌గ్రేడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటోంది. అనేక ప్రాంతాల్లో 4G సిమ్ కార్డులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే 5G సిమ్ కార్డులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ 5G సిమ్ కార్డులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలో అందుబాటులో ఉన్నాయి.
BSNL ప్రస్తుతం 4G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తోంది. అనంతరం కొద్ది కాలంలోనే 5G సర్వీసులను కూడా ప్రారంభించే అవకాశం ఉంది. 5G సిమ్ కార్డులు కలిగి ఉన్న యూజర్లు నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన వెంటనే వినియోగించుకోవచ్చు. BSNL 5G సిమ్ కార్డులు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. సిమ్ కార్డులపై 5G సింబల్ జాతీయ పతాకంలోని మూడు రంగుల్లో ఉంది.
BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) కు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DOT) టాటా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకొని 4G నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసింది. పూర్తి స్వదేశీ భాగస్వామ్యంతో సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీని ద్వారా 4G నుంచి 5G సేవలకు సులభంగా అప్‌గ్రేడ్ అయ్యేందుకు వీలుంటుందని తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా BSNL 5G నెట్‌వర్క్‌ను పరీక్షించారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-Dot) కార్యాలయం నుంచి BSNL 5G ద్వారా వీడియో కాల్ చేశారు. దీంతోపాటు కొన్ని రోజుల క్రితం 4G నెట్‌వర్క్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. 4G నెట్‌వర్క్ పనితీరుపై రోజువారీ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.
BSNL 4G నెట్‌వర్క్ కోసం దేశవ్యాప్తంగా లక్ష టవర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన కేంద్ర మంత్రి సింధియా ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. 2024 అక్టోబర్ చివరి నాటికి 80,000 టవర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2025 మార్చి నాటికి మిగిలిన 21,000 టవర్ల ఏర్పాటును పూర్తి చేస్తామన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఈ టెక్నాలజీ రూపొందించినట్లు చెప్పారు. స్వదేశీ సాంకేతికను కలిగిన ఉన్న 5 వ దేశంగా భారత్ నిలిచిందని చెప్పారు.


Click it and Unblock the Notifications








