గుడ్ న్యూస్, మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు BSNL బంపర్ ఆఫర్!
మహా కుంభమేళాకు వెళ్లాలని అనుకుంటున్నారా.. అయితే మీకో శుభవార్త. భారతదేశ ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ (BSNL), ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనే యాత్రికుల కోసం అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది.
ఇకపై మీరు మీ వాళ్లతో మాట్లాడాలన్నా, ఫొటోలు, వీడియోలు పంపించాలన్నా, సోషల్ మీడియాలో లైవ్ అప్‌డేట్స్ ఇవ్వాలన్నా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే BSNL ఉచితంగా వాయిస్ కాల్స్, డేటా, SMS సేవలను అందిస్తోంది.

ఈ ప్రత్యేకమైన సదుపాయంతో, కుంభమేళాలో పాల్గొనే భక్తులు తమ అనుభవాలను పంచుకుంటూ, తమ ప్రియమైన వారితో నిరంతరం టచ్‌లో ఉండొచ్చు. నెట్‌వర్క్ ఛార్జీల గురించి అస్సలు టెన్షన్ పడక్కర్లేదు.
* అంతరాయం లేని నెట్‌వర్క్ కోసం అత్యాధునిక ఏర్పాట్లు..
ఈ భారీ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి నెట్‌వర్క్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు BSNL ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. దీనిలో భాగంగా, కుంభమేళా ప్రాంగణంలో ఏకంగా 50 బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్లను (BTS) ఏర్పాటు చేస్తోంది.
ఈ బీటీఎస్ యూనిట్లు మొబైల్ కమ్యూనికేషన్‌కు వెన్నెముకలాంటివి. ఇవి ఫోన్ల నుంచి సెల్యులార్ నెట్‌వర్క్‌కు సిగ్నల్స్‌ను పంపిస్తాయి, స్వీకరిస్తాయి. అంటే, మొబైల్‌లో మాట్లాడాలన్నా, ఇంటర్నెట్ వాడాలన్నా ఈ బీటీఎస్ స్టేషన్లే ఆధారం. వీటి ఏర్పాటుతో, కుంభమేళా మొత్తం నిరంతరాయంగా BSNL నెట్‌వర్క్ అందుబాటులో ఉంటుంది.
* మీరూ స్పాన్సర్ చేయొచ్చు
BSNL ఓ సరికొత్త స్పాన్సర్‌షిప్ పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా, వ్యక్తులు లేదా సంస్థలు భక్తులకు ఉచిత సేవలను స్పాన్సర్ చేయవచ్చు. స్పాన్సర్ చేసిన వారి పేరును, ఆ బీటీఎస్‌కు కనెక్ట్ అయిన వినియోగదారులందరికీ SMS ద్వారా తెలియజేస్తారు.
"ఈ ఉచిత సేవలను స్పాన్సర్ చేసినవారు: (మీ పేరు)" అనే సందేశం అందరికీ వెళ్తుంది. ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే, లక్షలాది మందికి ఉచిత సేవలు అందించడంలో మీరూ భాగం పంచుకోవచ్చు. అంతేకాదు, మీ పేరును కూడా అందరికీ తెలిసేలా చేసుకోవచ్చు.
* స్పాన్సర్‌షిప్‌లో నాలుగు రకాలు..
BSNL ఈ స్పాన్సర్‌షిప్ పథకాన్ని నాలుగు రకాలుగా విభజించింది. మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా, మీకు నచ్చిన కేటగిరీని ఎంచుకోవచ్చు. అవేంటో చూద్దామా..
కేటగిరీ 1: రోజుకు రూ.10,000 చెల్లించి, ఒక BTSకు కనెక్ట్ అయిన వినియోగదారులందరికీ ఉచిత వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ సేవలను అందించవచ్చు.
కేటగిరీ 2: రోజుకు రూ.40,000 చెల్లించి, ఒకటికి మించిన BTS యూనిట్ల పరిధిలో ఉన్నవారికి ఉచిత సేవలు అందించవచ్చు.
కేటగిరీ 3: రోజుకు రూ.90,000 చెల్లిస్తే, ఏకంగా 30 బీటీఎస్ యూనిట్ల పరిధిలో ఉన్న భక్తులకు మీరు స్పాన్సర్ చేయవచ్చు.
కేటగిరీ 4: అన్నిటికంటే పెద్ద స్పాన్సర్‌షిప్ ఇది. రోజుకు రూ.2,50,000 చెల్లిస్తే, కుంభమేళాలోని మొత్తం 50 బీటీఎస్ యూనిట్ల పరిధిలో ఉన్నవారందరికీ ఉచిత సేవలు అందుతాయి. అంటే, కుంభమేళాకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మీరు పరోక్షంగా సహాయం చేసినట్లే.
* మహా కుంభమేళా విశేషాలు
మహా కుంభమేళా అనేది హిందూ సంప్రదాయాలు, పురాణాలలోకి లోతుగా పాతుకుపోయిన ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమ్మేళనం. కోట్లాది మంది ప్రజలు తమ విశ్వాసాన్ని చాటుకునేందుకు ఒకే చోటకి చేరుకుంటారు.
ఈసారి మహా కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13న ప్రారంభం కాగా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. దాదాపు 40 కోట్ల మంది యాత్రికులు ఈసారి కుంభమేళాకు వస్తారని అంచనా.
ఈ భారీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక తాత్కాలిక కుంభ జిల్లాను ఏర్పాటు చేసింది. BSNL ఉచిత సేవలు, స్పాన్సర్‌షిప్ కార్యక్రమం, కుంభమేళాకు వచ్చే యాత్రికులకు మరింత మంచి అనుభూతిని కలిగిస్తాయి.


Click it and Unblock the Notifications








