BSNL తప్పిదం వల్ల ప్రభుత్వానికి రూ.1,757 కోట్ల నష్టం.. కాగ్ సంచలన నివేదిక!
BSNL Jio Billing Failure : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్ఎల్ చేసిన ఒక భారీ తప్పిదం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.1,757.56 కోట్లు నష్టం వాటిల్లింది. రిలయన్స్ జియోకు దాదాపు 10 ఏళ్లుగా (మే 2014 నుంచి) బిల్లులు పంపకపోవడమే ఈ నష్టానికి కారణమని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్- CAG) మంగళవారం విడుదల చేసిన నివేదికలో తేలింది.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్‌జెఐఎల్)తో బీఎస్‌ఎన్ఎల్ కుదుర్చుకున్న 'ప్రధాన సేవా ఒప్పందం' (MSA) ప్రకారం.. జియో వాడుకున్న సేవలకు బిల్లులు వసూలు చేయడంలో బీఎస్‌ఎన్ఎల్ పూర్తిగా విఫలమైందని కాగ్ తేల్చిచెప్పింది. ఒప్పందాల అమలులో నిర్లక్ష్యమే ఈ నష్టానికి కారణమని తేల్చింది.

* జియో వాడుకుంది.. బీఎస్‌ఎన్ఎల్ బిల్లులే పంపలేదు..
బీఎస్‌ఎన్ఎల్ తమ టవర్లు, ఇతర మౌలిక సదుపాయాలను (Passive Infrastructure) వాడుకునేందుకు జియోకు అనుమతి ఇచ్చింది. అయితే, ఒప్పందం ప్రకారం వసూలు చేయాల్సిన మొత్తాన్ని అడగలేదు. అంతేకాదు, జియో అదనంగా వాడిన సాంకేతికతకు (Additional Technology) కూడా ఎలాంటి రుసుము వసూలు చేయలేదు.
దీనివల్ల మే 2014 నుంచి మార్చి 2024 మధ్య కాలంలో ప్రభుత్వానికి నేరుగా రూ.1,757.76 కోట్లు నష్టం వచ్చింది. కనీసం, ఇంతకాలం చెల్లించని ఈ మొత్తంపై జరిమానాలు గానీ, వడ్డీ గానీ కూడా వసూలు చేయకపోవడంతో నష్టం మరింత పెరిగిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది.
* లైసెన్స్ ఫీజులోనూ మరో రూ.38 కోట్ల నష్టం
టెలికాం టవర్లు వంటివి ఏర్పాటు చేసే సంస్థలకు (Telecom Infrastructure Providers - TIPs) బీఎస్‌ఎన్ఎల్ డబ్బులు చెల్లించేటప్పుడు, నిబంధనల ప్రకారం అందులోంచి కొంత లైసెన్స్ ఫీజు వాటాను మినహాయించుకోవాలి. కానీ బీఎస్‌ఎన్ఎల్ ఆ పని చేయలేదు. ఈ నిర్లక్ష్యం వల్ల మరో రూ.38.36 కోట్ల అదనపు నష్టం వాటిల్లిందని కాగ్ తేల్చింది.
* ఛార్జీలు కూడా తక్కువే వేశారు.. ఇంకో రూ.29 కోట్ల లాస్..
బీఎస్‌ఎన్ఎల్.. జియోకు మౌలిక సదుపాయాలను వాడుకున్నందుకు అసలు బిల్లులే పంపకపోగా, కొన్ని సందర్భాల్లో వేసిన బిల్లుల్లోనూ తక్కువ ఛార్జీలు వేసిందని కాగ్ గుర్తించింది. ఒప్పందం ప్రకారం, కాలానికి అనుగుణంగా ఛార్జీలను పెంచాలి (Escalation Clause). కానీ బీఎస్‌ఎన్ఎల్ ఆ నిబంధనను పట్టించుకోలేదు. దీనివల్ల రావాల్సిన ఆదాయంలో (జీఎస్టీతో కలిపి) మరో రూ.29 కోట్లను బీఎస్‌ఎన్ఎల్ నష్టపోయింది.
* పాలన పక్కన పెట్టేశారు.. ఒప్పందాలను గాలికొదిలేశారు..
రిలయన్స్ జియోతో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయడంలో బీఎస్‌ఎన్ఎల్ యాజమాన్య లోపం, పర్యవేక్షణ కొరవడటం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టింది. ఈ తీవ్ర నిర్లక్ష్యం వల్లే గత పదేళ్లుగా ఇంత భారీ మొత్తంలో ప్రభుత్వానికి ఆర్థిక నష్టం జరిగింది.
ప్రభుత్వ సంస్థ అయిన బీఎస్‌ఎన్ఎల్‌లో జవాబుదారీతనం, ఆర్థిక క్రమశిక్షణ ఏ స్థాయిలో ఉన్నాయో ఇది చూపిస్తోందని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని కాగ్ పేర్కొంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది? అని అడిగితే కాగ్ నివేదికతో బట్టబయలైన ఈ భారీ నిర్వాకంపై తక్షణ చర్యలు తీసుకోవాలని బీఎస్‌ఎన్ఎల్ పైనా, కేంద్ర ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరుగుతోంది.
నష్టపోయిన రూ.1,757 కోట్లను జియో నుంచి రాబట్టడం, ఒప్పందాల అమలులో ఇకపై కఠినంగా వ్యవహరించడం, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం వంటివి ప్రభుత్వం చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పారదర్శకత, సరైన పాలన లేకపోతే ఎంత పెద్ద ఆర్థిక నష్టం జరుగుతుందో ఈ సంఘటన మరోసారి కళ్లకు కట్టింది.


Click it and Unblock the Notifications








