మీకూ కాల్ డ్రాప్ సమస్య ఉందా.. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఎంతమందికి ఉందో తెలిస్తే షాక్ అవుతారు..!!
దేశవ్యాప్తంగా కాల్ డ్రాప్ సమస్య అధికంగా ఉంది. తాజాగా వచ్చిన ఓ సర్వే ఆధారంగా సుమారు 89 శాతం యూజర్లు ఈ కాల్ డ్రాప్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు వెల్లడయింది. ఇందులో సుమారు 38 శాతం మంది మొబైల్ యూజర్లు వారి మొత్తం కాల్స్‌లో 20 శాతం కాల్స్‌లో కాల్ డ్రాప్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. లోకల్‌సర్కిల్స్ సర్వే ఈ వివరాలను (Local circles Survey On Call Drop) వెల్లడించింది.
గత 12 నెలలుగా కాల్ డ్రాప్ పై మొబైల్ వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో లోకల్ సర్కిల్స్ జాతీయ స్థాయిలో ఈ సర్వేను నిర్వహంచింది. దేశవ్యాప్తంగా గత మూడు నెలల్లో మొబైల్ నెట్‌వర్క్ వినియోగదారుల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపింది.

భారత్‌లో 362 జిల్లాల్లో 32000 మంది నుంచి సమాచారం సేకరించినట్లు తెలిపింది. అందులో 64 శాతం పురుషులు, 36 శాతం మహిళలు ఉన్నట్లు పేర్కొంది. ఈ మొత్తంలో టైర్ 1 నగరాల్లో 44 శాతం, టైర్ 2 లో 33 శాతం మరియు టైర్ 3, 4, గ్రామీణ జిల్లాల నుంచి 23 శాతం సర్వేలో పాల్గొన్నట్లు తెలిపింది.
2024 మార్చి నుంచి జూన్ వరకు ఈ సర్వే చేపట్టినట్లు లోకల్‌సర్కిల్స్ తెలిపింది. నెట్‌వర్క్ సరిగా లేనప్పుడు ఎంత సమయానికి కాల్ డ్రాప్ అవుతుందని సర్వేలో ప్రశ్న అడిగారు. అయితే కేవలం 5 శాతం మంది మాత్రమే ఆటోమేటిక్‌గా కాల్ డ్రాప్ కావడం లేదని చెప్పినట్లు తెలిపింది.
ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 41 శాతం మంది నెట్‌వర్క్ సరిగా లేని సమయంలో (Bad Network) కేవలం 30 సెకన్లలోనే కాల్ డ్రాప్ అవుతుందని తెలిపారు. 27 శాతం మంది 30-60 సెకన్లు, మరో 27 శాతం మంది ఒక నిమిషం లేదా అంతకంటే ఎక్కువ సమయం అనంతరం కాల్ డ్రాప్ సమస్యను ఎదుర్కొన్నట్లు తెలిపారు.
అయితే కేవలం 4 శాతం మంది సరైన సమాచారం ఇవ్వలేకపోయారు. అయితే ఈ సర్వేలో పాల్గొన్న వారిలో మొత్తంగా 50 శాతం మంది బ్యాడ్ నెట్‌వర్క్ కనెక్షన్ ఉన్నప్పటికీ 30 సెకన్లలో ఆటోమేటిక్‌గా కాల్ డ్రావ్ కావడం లేదని చెప్పారు. ఈ సర్వేలో పొల్గొన్న ప్రతి ముగ్గురిలో ఒక్కరు కాల్ డ్రాప్ సమస్యల కారణంగా వైఫై ఆధారిత కాల్స్ చేస్తున్నట్లు చెప్పారు.
కాల్ డ్రాప్ అయ్యేందుకు అనేక కారణాలున్నాయి. ప్రధానంగా బలహీనమై సిగ్నల్ వల్ల కూడా కాల్ డ్రాప్ అవుతుంది. బలహీనమైన సిగ్నల్ మరియు స్థిరంగా లేని సిగ్నల్ కూడా కారణం. సాధారణంగా ఫోన్ సిగ్నల్ బార్‌ల సంఖ్య ఆధారంగా సిగ్నల్ స్థితిని గుర్తిస్తుంటారు. అయితే సిగ్నల్ స్థితిని తెలుసుకొనేందుకు ఇదే మార్గమని కచ్చితంగా తెలిపే ప్రమాణాలు ఏవీ లేవు.
కొన్నిసార్లు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు కూడా కాల్ డ్రాప్‌లకు కారణమవుతున్నాయి. దీంతోపాటు రద్దీగా ఉన్న నెట్‌వర్క్ కూడా మరో కారణం. ఒక సిగ్నల్ టవర్‌కు పరిమితికి మించి యూజర్లు కనెక్ట్ కావడం కూడా కాల్ డ్రాప్‌లకు కారణం అవుతుంది. ఒకే టవర్ వద్ద ఎక్కువ మంది ఒకేసారి కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించిన సందర్భాలు కూడా కారణం.


Click it and Unblock the Notifications








