సామాజక భాద్యతలో మమేకం అవుతున్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్

Posted By: Staff

సామాజక భాద్యతలో మమేకం అవుతున్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్

ఆర్కుట్, ఫేస్‌బుక్, ట్విట్టర్, హై5.. సైట్ ఏది అయినా కావొచ్చు. సోషల్ నెట్‌వర్క్ సైట్ల రూటు మారిందిప్పుడు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలోని కొత్త కోణం ఇది. వాస్తవిక సంఘటనలకు సహాయం చేయటానికి ఇప్పుడు వేదికగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లే నిలుస్తున్నాయి. తప్పిపోయిన పిల్లల గురించిన సమాచారమే కాదు.. ఆపన్నులకు సహాయం చేయటానికీ ప్రజలను ఆయా విషయాల్లో చైతన్యవంతులుగా చేయటానికీ ఇవి తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇక ఇటీవల అన్నా హజారే దీక్షకు మద్దతుగా నెటిజన్లు చేసిన హడావుడి తెలిసిందేగా..!

విడిపోయిన మిత్రులను కలుసుకోవటానికి… బంధాలను పెంచుకోవటానికి.. అభిప్రాయాలను పంచుకోవటానికి.. సొల్లు కబుర్లు చెప్పుకోవటానికి.. డేటింగ్ చేయటానికి.. ఇలా ఎవరుకు తోచిన భాష్యం వారు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల గురించి చెబుతుంటారు. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లంటే ఉద్యోగాలు పొందటానికి వేదికలు. సేవకు రాజమార్గాలు. నమ్మకమైన ఆధారాలతో ఆయా నెట్‌వర్కింగ్ సైట్లలో ఒక్కసారి పోస్ట్ చేస్తే చాలు… గంటల వ్యవధిలోనే మీకు అవసరమైన సహాయం అందుతుంది.

ఇదే విషయాన్ని తమీమ్ చెబుతున్నారు. మా తమ్ముడు వయసు 5 సంవత్సరాలు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంది. దానికి ‘ఎ’ పాజిటివ్ బ్లడ్ కావాలి. ఎవరైనా దాతలు ఉంటే దయచేసి నాకు తెలపండి.. అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తే సరిగ్గా మూడు గంటల్లోనే 40 మంది దాతలు ముందుకొచ్చారు. నిజానికి ‘ఎ’ పాజిటివ్ గ్రూపు రక్తం కలిగిన వ్యక్తిని కనుగొనడం ఎంత కష్టం. థాంక్స్ టు సోషల్ నెట్‌వర్కింగ్ అని అంటున్నారాయన.

స్వచ్ఛంద సంస్థలు కూడా ఇప్పుడు సోషల్ నెట్‌వర్కింగ్ బాటనే పట్టాయి. సేవ్ ఏ ఛైల్డ్ హార్ట్ ఫౌండేషన్ మొదలుకుని సేవ్ ద చ్రిల్డన్ లాంటి సంస్థలు వరకూ ఆయా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. మరో విశేషం ఏమిటంటే.. ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారానే సమాజసేవాకార్యక్రమాలతో పాటు ప్రకృతి రక్షణ వంటి కార్యక్రమాలను కూడా చేస్తుండటం. ఆర్కుట్ స్నేహం ద్వారానే తాము యంగ్ రేస్ (యువ కిరణాలు) ఆర్గనైజేషన్‌ను ప్రారంభించామంటున్నారు కిరణ్. సుఖం వెన్నంటే కష్టం కూడా ఉంటుంది. టెక్నాలజీ కూడా అంతే. సాంకేతికత అందించే లాభాలు ఎన్ని ఉన్నాయో… అవి సృష్టించే ఇబ్బందులూ అన్నే ఉంటాయి. అందుకనే టెక్నాలజీని సరిగా వినియోగించుకుని సమాజాన్ని మేలుచేసే పనులవైపు దృష్టి నిలపాలి. ఇది టెక్కీలు చేసే సమాజ సేవ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot