ఐటీ నిపుణుల వలసలకు కారణం ఇదేనా..?

Posted By: Staff

ఐటీ నిపుణుల వలసలకు కారణం ఇదేనా..?

ప్రతి అంశంలో కొత్తదనం కోరుకునే ధోరణి.. తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయి.. అధిక వేతనంపై కాంక్ష.. కుటుంబ బాధ్యతలు.. వ్యక్తిగత సమస్యలు వంటివి సాఫ్ట్‌వేర్‌ (ఐటీ) సిబ్బంది తరచు కంపెనీలు మారేందుకు (అట్రిషన్‌) కారణమవుతున్నాయి. కెరీర్‌లో ఉన్నతస్థాయికి ఎదిగేందుకు కంపెనీ మారడం అవసరమే అయినా, అది విపరీత ధోరణికి చేరితే అసలుకే మోసం వస్తుందని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్లు బాగున్నప్పుడు ప్రాజెక్టుల లభ్యతకు అనుగుణంగా ఐటీ కంపెనీలు సిబ్బంది నియామకాలు చేపడుతుంటాయి. ఇదే ఊపులో చిన్నా, చితకా కంపెనీలు అత్యధిక వేతనాలు ఇవ్వజూపుతూ ఇన్ఫోసిస్‌, విప్రో, కాగ్నిజెంట్‌, క్యాప్‌ జెమినీ లాంటి పెద్ద కంపెనీల నుంచీ నిపుణులను ఆకర్షిస్తున్నాయి. కొంతకాలం బాగానే ఉన్నా, ప్రాజెక్టులు రాకపోతే ఇటువంటి కంపెనీలు భారీ వేతనాలు ఇవ్వలేని స్థితికి చేరతాయి. అందుకే ఉద్యోగం మారేముందు ఆలోచించి, ముందడుగు వేయాలని సూచిస్తున్నారు.

ఐటీ కంపెనీల్లో నియామకాలకు సామర్థ్యమే గీటు రాయి అనేది తెలిసిందే. ఎప్పటికప్పుడు మారే టెక్నాలజీకి అనుగుణంగా పనిచేయాల్సి వస్తుంది. అందువల్ల ఏటా పోస్టుల్లో మార్పులు, చేర్పులు చేస్తుంటారు. ఆయా పోస్టుల్లో సామర్థ్యానికి తగిన వారినే నియమించేందుకు 5-6 శాతం వలసలు ఉండటమే మేలని ఐటీ పరిశ్రమ భావిస్తోంది. అయితే ఐటీ పరిశ్రమలో సగటు వలసల రేటు 12-18 శాతం ఉంది. మార్కెట్ల వృద్ధి వల్ల లభిస్తున్న అవకాశాలు, సహజ సామర్థ్యానికి భిన్నంగా విధులు నిర్వర్తించాల్సి రావడం, ఆయా సంస్థల్లో సరైన పని వాతావరణం, వేతనాలు ఆశించిన మేర లేకపోవడం ఇందుకు కారణం అవుతుంటాయి. ఈ అంశాలకు తోడు స్వల్ప వ్యవధిలో మార్పు కోరుకునే తత్వం సిబ్బందిలో పెరగడమూ వలసలకు దారితీస్తోంది.

వినియోగించే సెల్‌ఫోన్‌, గృహోపకరణాలు, ఆఖరుకు ఉంటున్న ఇల్లును కూడా మార్చి వేరే కొత్తది కొనుగోలు చేసే ధోరణి సమాజంలో పెరుగుతోంది. ఈ ప్రభావం ఐటీ నిపుణుల వృత్తి జీవితంపైనా పడుతోంది. ఎక్కువ కాలం ఒకే కంపెనీలో కొనసాగితే, తమలో సత్తా లేదని భావిస్తారనే ఆలోచనతోనూ కొందరు ఉద్యోగాలు మారుతున్నారు. వలసల్లో ఇలాంటివారి శాతం 5-6 శాతానికి చేరిందని లెక్కిస్తున్నారు. తమ కుటుంబసభ్యులకు దగ్గరగా రావాలనే భావన, చేస్తున్న పనిలో ఇమడ లేకపోవడం, తమ సామర్థ్యానికి అనుగుణంగా లేదని, అంతకుమించి ఉందని భావించి కొత్త కంపెనీలవైపు చూస్తున్న వారు మరో 5-6 శాతం ఉంటున్నారు. కంపెనీల్లో పని వాతావరణం ప్రోత్సాహకరంగా లేకపోవడం, వేతన పెంపుదలలో వ్యత్యాసం వంటివి మరో 6 శాతం వలసలకు కారణం అవుతున్నాయి. కొత్తదనంపై మోజుతో వెళ్లేవారిని మినహా మిగిలిన అంశాల్లో కంపెనీల మానవ వనరుల విభాగాలు సమర్థంగా వ్యవహరిస్తే వలసలను సగం మేర నియంత్రించ వచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

నేడు కొత్త.. రేపు మూత' ధోరణితో ఏర్పాటవుతున్న కంపెనీలపై ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని క్యాప్‌ జెమినీ సీఓఓ (ఐరోపా) బారు ఎస్‌ రావు సూచిస్తున్నారు. ప్రాజెక్ట్‌ వస్తే నియామకాలు చేపట్టడంతో పాటు ఆదిలో భారీగా వేతనాలు ఇస్తారని, 6 నెలల తరవాత మూతబడేవీ ఉంటున్నాయని ఆయన వివరించారు. ఇప్పటి ఫాస్ట్‌ఫుడ్‌ జనరేషన్‌కు జీవితంలో గమ్యం చేరడానికి ఓపిక ఉండటం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. నైపుణ్యం, పని నేర్చుకోవాలనే తపన కంటే అధిక వేతనంపై దృష్టి సారిస్తున్న వారు తరచు మారిపోతున్నారని పేర్కొన్నారు. కనీసం రెండేళ్ల అనుభవం లేకుండా ఉన్నతస్థాయి కాంక్షించడం సరికాదని పేర్కొన్నారు.

కొత్త టెక్నాలజీపై పనిచేయాలనే ఆసక్తి ఉండటం మంచిదే. అయితే ఆ సామర్థ్యం తమకు ఉందా లేదా అనేది ఉద్యోగులే గుర్తించాలని ఐ గేట్‌ ప్యాట్నీ మానవ వనరుల విభాగం గ్లోబల్‌ హెడ్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వృత్తిలో ఎదుగుదలకు మార్పు మంచిదే అయినా, కనీసం 2-3 ఏళ్లు ఒక కంపెనీలో నిబద్ధతతో పనిచేయడం ముఖ్యమని వివరించారు. ఐటీ సంస్థల్లో పని వాతావరణాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం ప్రధానం అని తెలిపారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting