డబ్బే ప్రధానంగా ఉద్యోగం మారడం సబబు కాదు: బారు రావు సివోవో

Posted By: Staff

డబ్బే ప్రధానంగా ఉద్యోగం మారడం సబబు కాదు: బారు రావు సివోవో

బ్యాంకింగ్, ఫైనాన్షియల్, రిటైల్, తయారీ రంగాల్లో ఐటీకి మంచి రోజులు రానున్నాయని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న క్యాప్‌జెమిని అప్లికేషన్ సర్వీసెస్ కాంటినెంటల్ యూరప్ సీవోవో ఎస్.బారు రావు అన్నారు. ఇటీవలే యూరప్ బాధ్యతలు స్వీకరించిన ఆయన హైదరాబాద్ వచ్చిన సందర్భంగా గురువారం సాక్షి బిజినెస్‌తో మాట్లాడారు. వరంగల్‌కు చెందిన రావు 1983లో టీసీఎస్‌లో ప్రోగ్రామర్‌గా కెరీర్ ప్రారంభించారు. 2003లో క్యాప్‌జెమిని ఇండియా సీఈవోగా చేరారు. ఆయన హయాంలో ఇక్కడి క్యాప్‌జెమిని ఉద్యోగుల సంఖ్య 450 నుంచి 26,000 చేరింది. తొలుత చిన్న ప్రాజెక్టులను చేపట్టి త్వరగా పూర్తి చేయడం ద్వారా క్లయింట్లలో నమ్మకాన్ని చూరగొన్నామని, అలా అంచెలంచెలుగా ఎదిగామని అంటున్న ఆయన మరిన్ని అంశాలపై మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే..

భారత్‌లో ఏటా సుమారు 10 వేల మందిని నియమిస్తున్నాం. ఈ ఏడాది ఈ సంఖ్య 12 వేలకుపైమాటే. 30 నుంచి 40 శాతం ఫ్రెషర్స్‌ను తీసుకుంటున్నాం. ఫ్రెషర్స్ విద్యార్హతగా భావనాసరళి, తెలివితేటలనే పరిగణిస్తున్నాం. మూడు నెలల శిక్షణానంతరం ప్రాజెక్టులను అప్పగిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారతీయ నిపుణులకు డిమాండ్ ఎక్కువ. 2003లో క్యాప్‌జెమిని మొత్తం ఉద్యోగుల్లో భారత వాటా 0.5% కాగా, ఇప్పుడు 25 శాతానికి చేరింది. 33 వేల మంది ఉద్యోగులతో రైట్‌షోర్ డెలివరీ మోడల్‌తో సంస్థలో భారత్‌ది ముఖ్య భూమిక. మనవారూ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత పదవులను దక్కించుకుంటున్నారు.

ప్రపంచంలో ఐటీ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. టెలికాం రంగంలో విలీనాల ప్రక్రియ జరగనున్నది. దీంతో ఐటీపై వ్యయాలు తగ్గాయి. భారత్‌లో మాత్రం ఈ రంగంలో అవకాశాలున్నాయి. మొత్తంగా ఐటీ వృద్ధి రేటు 5-10 శాతంగా ఉంది. క్యాప్‌జెమిని మార్చితో ముగిసిన తొలి త్రైమాసికంలో 14% వృద్ధి సాధించింది. భారత్‌లో 2009లో కార్యకలాపాలు ప్రారంభించాం. ఏడాదిలో రూ.150 కోట్లకుపైగా వ్యాపారం చేశాం. కంపెనీ మారడంలో..: ఐటీలో అట్రిషన్ రేటు 12 నుంచి 18%గా ఉంది. మా కంపెనీలో ఇది 14%. ఉద్యోగి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారడం తప్పు కాదు. అయితే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓపిక ఉండాలి. నేటి యువ ఉద్యోగుల్లో నేర్చుకోవాలన్న ఆత్రుత, సహనం నశించింది. డబ్బే ప్రధానంగా ఉద్యోగం మారడం సబబు కాదు.

ప్రభుత్వ, తయారీ రంగాలపై దృష్టి సారించాం. మొబైల్ బ్యాంకింగ్, హెల్త్‌కేర్ రంగాలకు ఐటీ సేవలను విస్తరిస్తాం. భారత్‌లో త్వరలో ఫైనాన్షియల్ రంగానికి సేవలను అందించనున్నాం. కొత్త కంపెనీల కొనుగోలుకూ సిద్ధంగా ఉన్నాం. చిన్న పట్టణాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా భారీగా ఖర్చులను తగ్గించుకోవచ్చు. నిపుణులైన ఉద్యోగులు లభిస్తున్నారు. అట్రిషన్ తక్కువ. అయితే ఒక స్థాయిని మించి ఈ పట్టణాల్లో వృద్ధి సాధించలేం. ఉద్యోగులు ఖాళీ అయితే కేంద్రాన్ని మూసివేయాల్సిందేనన్న భయం కంపెనీలది. అదే పెద్ద నగరాల్లో ఈ సమస్య ఉండదు. విరివిరిగా నిపుణులు లభిస్తారు. క్యాప్‌జెమినీ ప్రపంచంలో టాప్-5 ఐటీ కన్సల్టింగ్, బీపీఓ కంపెనీల్లో ఒకటి. ఈ కంపెనీ 40 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మొత్తం 1.12 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. భారత్‌లో హైదరాబాద్‌తో సహా 7 నగరాల్లో ఆఫీసులున్న క్యాప్‌జెమినీకి ఇక్కడ 33 వేల మంది సిబ్బంది ఉన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot