టెలిగ్రామ్ యూజర్లూ, జర జాగ్రత్త.. ఈ ఉచ్చులో పడితే క్షణాల్లో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ..!
Telegram scam: టెలిగ్రామ్ యూజర్లకు అలర్ట్, ఇటీవల గ్రేటర్ నోయిడాకు చెందిన 31 ఏళ్ల యువకుడు ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో జరిగిన భారీ మోసంలో నిండా మునిగిపోయాడు. కేవలం ఐదు రోజుల్లోనే ఏకంగా రూ.51.63 లక్షలు పోగొట్టుకుని లబోదిబోమంటున్నాడు. అసలు ఈ స్కామ్ ఎలా మొదలైందంటే... అతనికి ఒకరోజు వాట్సాప్‌లో ఒక గుర్తుతెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. అందులో సింపుల్ ఇన్వెస్ట్‌మెంట్ టాస్క్‌లు చేస్తే డబ్బులు సంపాదించొచ్చని ఆఫర్ ఇచ్చారు.
డబ్బులు వస్తాయనే ఆశతో ఆ వ్యక్తి ఆ ఆఫర్‌కు ఓకే చెప్పాడు. అంతే, వెంటనే అతన్ని ఒక టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ చేశారు. అక్కడ క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని నమ్మబలికారు. మొదట్లో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టమని చెప్పారు. ఒక్కోసారి రూ.2,000 నుంచి రూ.8,000 వరకు చెల్లించమని అడిగారు.

ఇవన్నీ ఇన్వెస్ట్‌మెంట్‌లో మొదటి మెట్లు అని చెప్పారు. రోజులు గడుస్తున్న కొద్దీ, మోసగాళ్లు అతన్ని పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా చేశారు. భారీ లాభాలు వస్తాయని ఆశ చూపించారు. నమ్మకం కలిగించడం కోసం ఒక ఫేక్ పోర్ట్‌ఫోలియోను క్రియేట్ చేసి, అందులో రూ.60 లక్షల లాభం వచ్చినట్టు చూపించారు.
* అసలు కథ మొదలు..
నిజంగానే అంత డబ్బు వస్తోందని నమ్మి ఆ వ్యక్తి ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. ఎప్పుడైతే అతను తన డబ్బును వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించాడో, అప్పుడు మోసం బయటపడింది. విత్‌డ్రా చేసుకోవాలంటే ముందు ట్యాక్స్, ఫీజులు కట్టాలని డిమాండ్ చేశారు. దీంతో అతనికి అనుమానం వచ్చింది.
వెంటనే తన స్నేహితుడితో ఈ విషయం చెప్పి మాట్లాడాడు. అప్పుడే తాను మోసపోయానని తెలిసింది. కేవలం ఐదు రోజుల్లోనే ఆ వ్యక్తి ఏకంగా 32 ట్రాన్సాక్షన్లు చేశాడు. మొత్తం రూ.51.63 లక్షలు మోసగాళ్ల చేతికి వెళ్లాయి. మోసపోయానని తెలుసుకున్న వెంటనే బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
* చట్టపరమైన చర్యలు
పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 318 (చీటింగ్), 319 (చీటింగ్ బై పెర్సొనేషన్) కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని సంబంధిత సెక్షన్లను కూడా జోడించారు.
* ఆన్‌లైన్ స్కామ్‌లతో జాగ్రత్త..
ఇలాంటి మోసాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. చాలామంది ఇలాంటి స్కామ్‌లలో చిక్కుకుని డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మోసగాళ్లు అమాయకులను టార్గెట్ చేసి, చిన్న చిన్న ఆన్‌లైన్ టాస్క్‌లు చేస్తే ఈజీగా డబ్బులు సంపాదించొచ్చని ఆశ చూపిస్తారు. యూట్యూబ్ వీడియోలకు రివ్యూలు ఇవ్వడం, ప్రొడక్ట్ రివ్యూలు రాయడం వంటి పనులు చెప్పి బురిడీ కొట్టిస్తారు.
మొదట్లో చిన్న మొత్తాల్లో డబ్బులు పంపి నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేయమని చెబుతారు. బాధితులు భారీగా డబ్బులు డిపాజిట్ చేసిన వెంటనే.. అంతే సంగతులు, మోసగాళ్లు మాయమైపోతారు. మళ్లీ తిరిగి మన డబ్బు వస్తుందని నమ్మకం లేదు.
* సురక్షితంగా ఉండాలంటే..
ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వాట్సాప్ లేదా టెలిగ్రామ్‌లో వచ్చే రాండమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫర్లను అస్సలు నమ్మకండి. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసే ముందు ఆ ఆఫర్ నిజమైనదా కాదా అని పూర్తిగా వెరిఫై చేసుకోవాలి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు వస్తాయని ఎవరైనా చెబితే వెంటనే అలర్ట్ అవ్వండి.
తెలియని వ్యక్తులకు డబ్బులు పంపించకూడదు. అనుమానాస్పదంగా అనిపించే మెసేజ్‌లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలి. అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ఉచ్చుల నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ మీరు లేదా మీకు తెలిసిన వాళ్లెవరైనా ఇలాంటి మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేయాలి.


Click it and Unblock the Notifications