అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలపై దర్యాప్తునకు ఆదేశాలు
ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సోమవారం దర్యాప్తునకు ఆదేశించింది. భారీ డిస్కౌంట్లు, ఒక వస్తువు కొంటే మరొకటి పొందేలా ఆఫర్లు, ఎంపిక చేసిన అమ్మకందారులు మాత్రమే ప్లాట్‌ఫామ్‌లలో విక్రయాలు జరపడం వంటి అంశాల్లో ఈ సంస్థలు దుర్వినియోగానికి పాల్పడ్డ ఆరోపణలు వచ్చినట్లు సీసీఐ వెల్లడించింది. ఢిల్లీ వ్యాపార్ మహాసంఘ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపింది. ఈ అంశంపై స్పందించిన అమెజాన్.. తాము ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, దర్యాప్తును స్వాగతిస్తున్నామని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం సీసీఐ ఆర్డర్‌ను సమీక్షిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.

ఆన్‌లైన్ వ్యాపార సంస్థలు ప్రిఫరెన్షియల్ లిస్టింగ్, ఎక్స్‌క్లూజివ్ టై-అప్స్, ప్రైవేట్ లేబుల్స్ లాంటి అక్రమ పద్ధతులను అవలంబిస్తున్నాయని, ఆరోగ్యకరమైన వ్యాపార పద్ధతులకు ఇవి పూర్తి విరుద్ధమని ఢిల్లీ వ్యాపార్ మహాసంఘ్ ఆరోపించింది. వాస్తవానికి అడ్డగోలు రాయితీలు, ఉద్దేశపూర్వక తగ్గింపు ధరలతో అమ్మకాలు జరిపే ఎలాంటి హక్కు ఈ-కామర్స్ సంస్థలకు లేదు.

అంతేకాకుండా ఆన్‌లైన్ వ్యాపార సంస్థలు సొంత ఉత్పత్తులను కలిగి ఉండేదుకు కూడా వీల్లేదు. కేవలం వినియోగదారులను ఉత్పత్తి సంస్థలతో అనుసంధానం చేయడమే వాటి పని. ఈ నిబంధనలను ఈ-కామర్స్ సంస్థలు తుంగలో తొక్కి ఉత్పత్తులను తక్కువ ధరలకు అమ్మడం వల్ల రిటైల్ వర్తకులు భారీ నష్టాలతో కుదేలవుతున్నారు.

సీసీఐ దర్యాప్తు ఉత్తర్వులపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్పందించాయి. సీసీఐపై తమకు నమ్మకం ఉన్నదని, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని అమెజాన్ పేర్కొంది. సీసీఐ ఉత్తర్వులను సమీక్షిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి తెలిపారు. వ్యాపార చట్టాలను, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను తాము అతిక్రమించలేదని, అన్ని నిబంధనలను పూర్తిగా అనుసరిస్తున్నామని చెప్పారు.

తమ వేదిక ద్వారా ఎంతోమంది చిన్నవ్యాపారులు, చేతివృత్తులవారు, అమ్మకందార్లతోపాటు అనేక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవకాశం కల్పించి నాణ్యమైన వస్తువులను సరసమైన ధరలకే వినియోగదారులకు అందిస్తున్నందుకు గర్వపడుతున్నామన్నారు. ఎంతో పారదర్శకంగా వ్యాపారం చేస్తూ లక్షలమందికి ఉద్యోగాలను కల్పించామని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి తెలిపారు.

కాగా ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2020 పేరుతో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. వన్‌ప్లస్ 7టీ ప్రో, ఐఫోన్ ఎక్స్‌ఆర్, శాంసంగ్ గెలాక్సీ ఎం30, రెడ్‌మి నోట్ 8 స్మార్ట్‌ఫోన్లతోపాటు మరికొన్ని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

రిపబ్లిక్ డే స్పెషల్ సేల్ పేరుతో జనవరి 19 నుంచి 22 వరకు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఆఫర్ ప్రకటించారు. వన్‌ప్లస్ 7టీ ఫోన్ రూ. 34,999, శాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ ఫోన్ రూ. 12,999, రెడ్‌మి నోట్ 8 ప్రో ఫోన్ రూ. 13,999, వివో వీ20 ఫోన్ రూ. 11,990 ఉంటుంది. ఎస్‌బీఐ కస్టమర్లు క్రెడిట్ కార్డు ద్వారా ఫోన్లను కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభించనుంది.


Click it and Unblock the Notifications








