మీ పెంపుడు జంతువు మనిషి అయితే ఎలా ఉంటుందో తెలుసా..? ChatGPTతో సులభంగా ఇలా తెలుసుకోండి..!
ChatGPT Pet Transformation: సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. అదేంటంటే, తమ ఇంట్లోని పెంపుడు జంతువులను (Pets) మనుషులుగా మార్చేసి చూడటం. అదెలా అంటారా? చాట్‌జీపీటీలోని ఇమేజ్ జనరేషన్ ఫీచర్లను వాడి, తమ కుక్కపిల్లలు, పిల్లులు, చిలుకలు, కుందేళ్లు.. ఇలా ఏ జంతువు అయినా సరే, మనిషిలా మారితే ఎలా ఉంటుందో చూసి మురిసిపోతున్నారు.
ముంగిట్లో ఆడుకునే గోల్డెన్ రిట్రీవర్ అయినా, సోఫాలో రారాజులా కూర్చునే అల్లరి పిల్లి అయినా.. వాటికి సరికొత్త మనుషుల రూపాలను, అదిరిపోయే స్టైలిష్ ఫోటోలను సృష్టిస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో క్రియేట్ చేస్తున్న ఈ బొమ్మలు అచ్చం నిజమైన మనుషుల్లాగే, యానిమేటెడ్ పోర్ట్రెయిట్స్‌లా ఉంటున్నాయి.

* ఏంటి ఈ హడావిడి? ఇంత వైరల్ ఎందుకు?
గతంలో పాపులర్ అయిన 'ఘిబ్లి-స్టైల్' (Ghibli-style) ట్రెండ్ తర్వాత, ఇప్పుడు ఈ 'పెట్-టు-హ్యూమన్' ట్రెండ్ శరవేగంగా దూసుకుపోతోంది. X (ట్విట్టర్), రెడ్డిట్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి ప్లాట్‌ఫామ్‌లన్నీ ఇప్పుడు ఈ ట్రెండ్‌తో హోరెత్తిపోతున్నాయి. వేలమంది పెట్ లవర్స్ తమ పెంపుడు జంతువుల ఫోటోలను అప్‌లోడ్ చేస్తున్నారు.
అవి మనుషులుగా మారితే ఎలా ఉంటాయో చూపిస్తున్న AI బొమ్మలను షేర్ చేస్తున్నారు. ఇవి కేవలం ముఖాలు మార్చేసినట్లు కాదు. ఆ బొమ్మలకు అదిరిపోయే డ్రెస్సులు, వాటికంటూ కొన్ని ఊహాత్మక కథలు (Backstories), చివరికి ప్రత్యేకమైన వ్యక్తిత్వాలను కూడా జోడించి చూపిస్తున్నారు.
కొన్ని పెట్స్ ఏమో సున్నితమైన కవుల్లా కనిపిస్తే, మరికొన్ని స్టైలిష్ రాక్‌స్టార్ల లాగా, ఇంకొన్ని చూడముచ్చటైన ఫ్యాషన్ ఐకాన్‌ల లాగా దర్శనమిస్తున్నాయి. ఈ ఫలితాలు చూస్తుంటే కొన్నిసార్లు నవ్వొస్తుంది, కొన్నిసార్లు మనసును హత్తుకుంటాయి, ఇంకొన్నిసార్లు అచ్చం నిజంలా ఉన్నాయి.
* ఇదెలా పనిచేస్తుంది, మీరూ చేయొచ్చా?
ముందుగా, మీ పెంపుడు జంతువు (కుక్క, పిల్లి, చిలుక.. ఏదైనా సరే) స్పష్టంగా కనిపించే ఫొటో ఒకటి తీసుకోండి. దాన్ని చాట్‌జీపీటీలో ఉండే ఇమేజ్ జనరేటర్లోకి అప్‌లోడ్ చేయండి. తర్వాత, "ఈ కుక్క మనిషిలా మారితే ఎలా ఉంటుంది?" (What would this dog look like as a person?) అని ప్రాంప్ట్ ఇవ్వాలి.
లేదా "ఈ పిల్లిని మనిషిగా మార్చు" (Turn this cat into a human) లాంటి చిన్న ప్రాంప్ట్ (సూచన) ఇవ్వండి. అప్పుడు, ఆ AI మీ పెట్ వ్యక్తిత్వం (Personality) గురించి, ఆడనా మగనా (Gender) లేదా దాని వయసు (Age) గురించి కొన్ని ప్రశ్నలు అడగవచ్చు.
ఉదాహరణకు, మీ పెట్ చాలా ఉల్లాసంగా ఉంటుందా (Playful), సిగ్గుపడుతుందా (Shy), ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటుందా (Energetic), లేక చాలా తెలివైనదా (Wise).. ఇలా దాని స్వభావం ఎలా ఉంటుందో మీరు చెప్పొచ్చు. మీరు ఈ వివరాలు ఇచ్చాక, AI తన పని మొదలుపెడుతుంది.
క్షణాల్లోనే, మీ పెట్‌కి ఒక ప్రత్యేకమైన, మనిషి రూపాన్ని సృష్టించి మీ ముందుంచుతుంది. ఒక్కోసారి మీరు ఊహించినట్లే కచ్చితంగా రాకపోవచ్చు, కానీ చాలా వరకు ఫలితాలు సరదాగా, ఆలోచింపజేసేలా, చూడటానికి భలేగా ఉంటాయి. మీ పెట్ క్యారెక్టర్‌ని ఇలా కొత్త రూపంలో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదో అద్భుతమైన మార్గం.
* ఎందుకింత పాపులర్ అయింది..?
ఈ ట్రెండ్ ఇంతలా నచ్చడానికి కారణం.. ఇందులో ఉండే వినోదం (humor), సృజనాత్మకత (creativity). మనలో చాలామంది పెంపుడు జంతువులను కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటాం. వాటిపై మనకున్న ప్రేమను, బంధాన్ని చూపించడానికి ఇదొక కొత్త మార్గం. మీకు కూడా పెంపుడు జంతువులు ఉంటే దీన్ని ప్రయత్నించవచ్చు.
పెట్స్‌కి ఇలా మనిషి రూపాన్ని ఇవ్వడం ద్వారా, యజమానులు వాటిని తమ బెస్ట్ ఫ్రెండ్స్‌గా, తోబుట్టువులుగా, లేదా కొంటె రూమ్‌మేట్స్‌గా ఊహించుకుంటున్నారు. కొంతమంది ఇంకాస్త ముందుకెళ్లి, ఆ మనిషి రూపాలకు కల్పిత పేర్లు, ఉద్యోగాలు, హాబీలు కూడా పెట్టి కథలు అల్లేస్తున్నారు.
* ప్రయత్నించే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
ఎలాంటి వివరణ ఇస్తారన్న దానిపైనే చివరిగా వచ్చే బొమ్మ ఆధారపడి ఉంటుంది. పాతకాలం నాటి స్టైల్ (vintage), ఆధునిక లుక్, రాయల్ లుక్, లేదా సింపుల్ క్యాజువల్ (casual) స్టైల్ కావాలనుకుంటే, ఆ విషయాన్ని ప్రాంప్ట్‌లో స్పష్టంగా చెప్పండి. అలాగే, AI సృష్టించే రూపాలు కొన్నిసార్లు ఊహించని విధంగా, ఆశ్చర్యంగా ఉండొచ్చని గుర్తుంచుకోండి.
కొందరికైతే ఆ బొమ్మ మరీ నిజంగా అనిపించి, ఒకరకమైన "అన్‌కెన్నీ వ్యాలీ" (Uncanny valley) ఎఫెక్ట్ (అంటే, చూడటానికి నిజంగా ఉన్నా ఏదో తెలియని అసహజత్వం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించడం) కూడా కలిగిందట. అయినా, చాలామందికి ఈ ఫలితాలు ముద్దుగా, సరదాగా అనిపిస్తున్నాయి.
* మీరూ ఈ ట్రెండ్‌లో చేరండి..
AI టెక్నాలజీని ఇంత సరదాగా, క్రియేటివ్‌గా వాడుకోవడానికి ఇదొక మంచి మార్గం. దీనికోసం ఎలాంటి డిజైన్ నైపుణ్యాలు అవసరం లేదు. కేవలం మీ పెట్ ఫోటో, ఒక చిన్న ప్రాంప్ట్ ఉంటే చాలు. సరదా కోసం చేసినా, ఫ్రెండ్స్‌తో పంచుకోవడానికైనా, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికైనా.. మీ పెట్‌ను మనిషిగా మార్చడం ఇప్పుడు ChatGPTతో చాలా సులభం.
ఇంకెందుకు ఆలస్యం, మీరూ ట్రై చేసి చూడండి. మీ బుజ్జి నేస్తం (Furry friend) లేదా రెక్కల నేస్తం (Feathery friend) మనిషిగా మారితే ఎలా ఉంటుందో చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications








