ChatGPTతో ఇప్పుడు షాపింగ్ చేయొచ్చు.. సెర్చ్‌లో కూడా కొత్త ఫీచర్లు.. ఎలా వాడాలంటే?
ChatGPT Shopping Feature : టెక్నాలజీ ప్రియులకు శుభవార్త. ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI), తమ పాపులర్ చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీ (ChatGPT) సెర్చ్ ఫీచర్‌లో అదిరిపోయే కొత్త అప్‌డేట్స్‌ను ప్రకటించింది. ఇకపై చాట్‌జీపీటీతో కబుర్లు చెప్పడమే కాదు, మీకు నచ్చిన వస్తువులను చూసి, అక్కడికక్కడే కొనేయొచ్చు కూడా. మరిన్ని కొత్త ఫీచర్లు కూడా రాబోతున్నాయి. అవేంటో వివరంగా చూద్దాం.
* సరికొత్త షాపింగ్ అనుభవం
ఓపెన్‌ఏఐ ఇప్పుడు చాట్‌జీపీటీలో ప్రయోగాత్మకంగా ఒక కొత్త షాపింగ్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. మీరు ఏదైనా వస్తువు గురించి చాట్‌జీపీటీని అడిగితే, ఇకపై కేవలం సమాచారం ఇవ్వడమే కాదు.. ఆ వస్తువు ఫోటోలు, ధర, రివ్యూలు వంటి వివరాలతో కూడిన కార్డులను చూపిస్తుంది. అంతేకాదు, నేరుగా కొనుగోలు చేయడానికి లింకులను కూడా అందిస్తుంది.

* ఎలా పనిచేస్తుంది?
మీరు చాట్‌బాట్‌ను ఏదైనా ప్రొడక్ట్ గురించి అడిగిన వెంటనే ఈ షాపింగ్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ఉదాహరణకు, "బెస్ట్ బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ చూపించు" అని అడిగారనుకోండి, చాట్‌జీపీటీ మీకు వివిధ హెడ్‌ఫోన్స్ చిత్రాలు, వాటి ధరలు, రివ్యూలతో పాటు కొనేందుకు లింకులను చూపిస్తుంది.
* పోల్చుకునే వీలు, ఎవరికి అందుబాటులో?
ఒకే వస్తువు వేర్వేరు వెబ్‌సైట్లలో ఎంత ధరకు దొరుకుతుందో కూడా పోల్చుకోవచ్చు. లేదా వేర్వేరు ఉత్పత్తులను పక్కపక్కన పెట్టి చూసి, మీకు ఏది ఉత్తమమో నిర్ణయించుకోవచ్చు. ఈ షాపింగ్ ఫీచర్ ప్రస్తుతం చాట్‌జీపీటీ ప్లస్, ప్రో సబ్‌స్క్రైబర్లతో పాటు, ఉచితంగా వాడేవారికి, చివరికి లాగిన్ అవ్వని యూజర్లకు కూడా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.
ఓపెన్‌ఏఐ చెబుతున్న ప్రకారం, ఇవి ప్రకటనలు (Ads) కాదు. అయితే, ఈ లింకుల ద్వారా జరిగే కొనుగోళ్లపై తమకు ఏమైనా కమీషన్ వస్తుందా లేదా అనే విషయాన్ని మాత్రం కంపెనీ ఇంకా స్పష్టం చేయలేదు. ఓపెన్‌ఏఐ తమ అధికారిక X (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఈ వివరాలను పంచుకుంది.
వారి వెబ్ సెర్చ్ ఫీచర్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, గత వారంలోనే ఏకంగా 100 కోట్లకు పైగా వెబ్ సెర్చ్‌లు చాట్‌జీపీటీ ద్వారా జరిగాయని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్‌ను మొదట 2024, నవంబర్‌లో పెయిడ్ యూజర్లకు, ఆ తర్వాత ఫిబ్రవరిలో అందరికీ (రిజిస్టర్ కాని వారితో సహా) అందుబాటులోకి తెచ్చారు.
* వాట్సాప్‌లోనూ చాట్‌జీపీటీకి సెర్చ్ పవర్..
2024, డిసెంబర్‌లో ఓపెన్‌ఏఐ ఒక ఫోన్ నంబర్ (+1-800-242-8478) ఇచ్చింది. దాన్ని వాట్సాప్‌లో సేవ్ చేసుకుని నేరుగా చాట్‌జీపీటీతో మాట్లాడొచ్చు. ఇప్పటిదాకా వాట్సాప్ చాట్‌జీపీటీకి అప్పటికప్పుడు తాజా సమాచారం (real-time information) ఇచ్చే శక్తి లేదు. ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది.
వాట్సాప్ బాట్‌కు కూడా వెబ్ సెర్చ్ సామర్థ్యాన్ని జోడిస్తున్నారు. అంటే, ఇకపై మీరు వాట్సాప్‌లోనే లేటెస్ట్ వార్తలు, లైవ్ స్పోర్ట్స్ స్కోర్లు వంటివి కూడా అడిగి తెలుసుకోవచ్చు. కోసం దీనివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. సరైన సమాచారం చాలా వెబ్‌సైట్స్ వెతకాల్సిన అవసరం లేదు.
* సమాచారానికి బహుళ ఆధారాలు (Multiple Citations)
చాట్‌జీపీటీ ఇంటర్నెట్ నుంచి సమాచారం తీసుకుని జవాబు చెప్పినప్పుడు, అది ఎక్కడి నుంచి తీసుకుందో తెలిపే ఆధారాలను (citations) చూపిస్తుంది. ఇకపై దీన్ని మరింత మెరుగుపరుస్తున్నారు. ఒకే సమాచారానికి సంబంధించి, ఒకటి కంటే ఎక్కువ వెబ్‌సైట్ లింకులను (multiple URLs) ఆధారాలుగా చూపిస్తుంది. దీనివల్ల యూజర్లు ఆ సమాచారాన్ని వేర్వేరు చోట్ల సరిచూసుకోవచ్చు.
హైలైటింగ్ ఫీచర్ కూడా ఈ చాట్ బాట్ అందిస్తోంది. అంతేకాదు, మీరు ఒక ఆధారం (citation link) మీద ట్యాప్ చేస్తే, జవాబులో ఆ లింక్‌కు సంబంధించిన భాగం హైలైట్ అవుతుంది. ఇది సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి మరింత సులువు చేస్తుంది.
* మరిన్ని చిన్న చిన్న మెరుగులు
యూజర్లకు కొత్త విషయాలు తెలియజేయడానికి, చాట్‌జీపీటీ మొబైల్ యాప్స్, వెబ్ వెర్షన్‌లో ఇప్పుడు ట్రెండింగ్ సెర్చ్‌లు కనిపిస్తాయి. చాట్‌జీపీటీలో ఏదైనా ప్రశ్న టైప్ చేయడం మొదలుపెట్టగానే, దాన్ని పూర్తి చేయడానికి కొన్ని సూచనలు (autocomplete suggestions) కూడా కనిపిస్తాయి. ఇది టైపింగ్ సమయాన్ని తగ్గిస్తుంది.
ఈ కొత్త ఫీచర్లన్నీ రాబోయే కొద్ది రోజుల్లో అందరికీ అందుబాటులోకి వస్తాయని ఓపెన్‌ఏఐ తెలిపింది. మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి చూద్దాం.


Click it and Unblock the Notifications