కార్పొరేట్‌ దిగ్గజాలకు సైతం సత్య సాయిబాబా అంటే ఎనలేని భక్తి

Posted By: Staff

కార్పొరేట్‌ దిగ్గజాలకు సైతం సత్య సాయిబాబా అంటే ఎనలేని భక్తి

వారందరికీ ఆయన దేవుడు. ఎల్లలు చెరిపేస్తూ.. పారిశ్రామిక సామ్రాజ్యాలను విస్తరిస్తూ.. దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషించే కార్పొరేట్‌ దిగ్గజాలకు సైతం సత్య సాయిబాబా అంటే ఎనలేని గురి. ఆయన ఆశీర్వాదం వారికి ప్రమోదం. ఎంత తీరికలేకున్నా.. ఏదో సమయంలో బాబాను దర్శించుకున్నవారే వారంతా. బాబా బోధలు తమనెంతో ఉత్తేజపరుస్తాయని చెప్పినవారే. ఏడాదిన్నర క్రితం ప్రపంచ దేశాలను మాంద్యం చుట్టుముట్టినప్పుడు 'ఆర్థిక ప్రపంచంలో నైతిక విలువలు' అనే అంశంపై శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం ఒక సదస్సు నిర్వహించింది.

ఈ సదస్సుకు దేశంలోని ప్రముఖ కార్పొరేట్‌ దిగ్గజాలే కాదు.. రిజర్వు బ్యాంకు గవర్నర్‌, మాజీ గవర్నర్లతోపాటు ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు ఎంతోమంది హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేట్లు, బ్యాంకర్లకు మహాభారత కథలను ఉటంకిస్తూ బాబా చెప్పిన విధానం వారినెంతో ఆకట్టుకుంది. ఆర్‌బీఐ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు, మాజీ గవర్నర్‌ వై.వి.రెడ్డి, ఐసీఐసీఐ బ్యాంక్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ కె.వి.కామత్‌, జేపీ మోర్గాన్‌ ఇండియా సీఈఓ కల్పనా మోర్పారియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎండీ ఆదిత్య పురి, కోటక్‌ మహీంద్రా బ్యాంకు వైస్‌ ఛైర్మన్‌, ఎండీ ఉదయ్‌ కోటక్‌, డాయిష్‌ బ్యాంకు ఇండియా సీఈఓ గునీత్‌ చద్దా వంటి ఎందరో దిగ్గజాలు బాబా ఆశీస్సులు పొందినవారే. కె.వి.కామత్‌కు బాబా ఒక బంగారు గొలుసును బహుకరించారు కూడా.

బాబా 85వ పుట్టిన రోజుకు పుట్టపర్తి వచ్చిన సందర్భంలో టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా అన్న మాటలివి. శ్రీ సత్యసాయి బాబా నిజంగా అత్యుత్తమ మానవతావాది. సాయి విశ్వవిద్యాలయం, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ మెడికల్‌ సైన్సెస్‌ నన్ను ముగ్ధుడ్ని చేశాయి. ఇక్కడి ఉద్యోగుల తీరు నన్ను ఆకట్టుకుంది. ఈ ప్రపంచానికి ఆయన దయ కావాలి అని అన్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting