సీఎస్‌సీ చేతికి 2,500 మంది ఉద్యోగులున్న ఆప్‌ల్యాబ్స్

Posted By: Super

 సీఎస్‌సీ చేతికి 2,500 మంది ఉద్యోగులున్న ఆప్‌ల్యాబ్స్

హైదరాబాద్‌కు చెందిన అతిపెద్ద ఇండిపెండెంట్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ కంపెనీ ఆప్‌ల్యాబ్స్‌ను అమెరికాకు చెందిన కంప్యూటర్ సెన్సైస్ కార్పొరేషన్(సీఎస్‌సీ) కొనుగోలు చేసింది. ఆప్‌ల్యాబ్స్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు సీఎస్‌సీ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ బ్రియాన్ జె మానింగ్ బుధవారం ఇక్కడ విలేకరులకు చెప్పారు. దీంతో ఆప్‌ల్యాబ్స్‌ను ఇక నుంచి సీఎస్‌సీగానే పరిగణి స్తామని ఆయన పేర్కొన్నారు. ఆప్‌ల్యాబ్స్‌లో వెస్ట్‌బ్రిడ్జ్ అనే ప్రైవేట్ ఈక్విటీ సంస్థకు 50 శాతం వాటా ఉండగా, ప్రమోటర్ శశిరెడ్డికి 40 శాతం ఉంది. మిగతా 10 శాతం వాటాను ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్స్ కింద కేటాయించారు. ప్రస్తుతం ఈ 100 శాతం వాటాను సీఎస్‌సీ కొనుగోలు చేసింది. అధికారికంగా డీల్ విలువ వెల్లడించనప్పటికీ ఆప్‌ల్యాబ్స్ కొనుగోలు కోసం సీఎస్‌సీ రూ.1,200 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల దాకా వెచ్చించి ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.

2001 ఏడాదిలో శశిరెడ్డి ఫిలడెల్ఫియా కేంద్రంగా ఆప్‌ల్యాబ్స్‌ను స్థాపించారు. 2,500 మంది ఉద్యోగులున్న ఆప్‌ల్యాబ్స్ ఆదాయం ప్రస్తుతం రూ.500 కోట్లకు పైగానే ఉంటుంది. హైదరాబాద్‌లో 1,900 మంది, యూఎస్‌లో 350, బ్రిటన్‌లో 250 మంది పనిచేస్తున్నారు. ఆప్‌ల్యాబ్స్‌కు 150 మంది యాక్టివ్ కస్టమర్లున్నారు. టెక్నాలజీ ఆధారిత బిజినెస్ సొల్యూషన్స్ అందించే సీఎస్‌సీకి ప్రపంచవ్యాప్తంగా 93,000 మంది ఉద్యోగులుండగా, భారత్‌లో 20,000 మంది పనిచేస్తున్నారు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టయిన ఈ కంపెనీ వార్షికాదాయం 1,620 కోట్ల డాలర్లు.

ఆప్‌ల్యాబ్స్ కొనుగోలు తర్వాత సీఎస్‌సీ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ రంగంలో అగ్రస్థానంలో నిలవనుంది. పదేళ్ల క్రితం తాను స్థాపించిన ఆప్‌ల్యాబ్స్‌ను సీఎస్‌సీకి విక్రయించడం వల్ల తమ ఇన్వెస్టర్లు, ఉద్యోగులు అమితంగా లాభపడటం సంతోషంగా ఉందని ఆ కంపెనీ వ్యవస్థాపక సీఈవో శశిరెడ్డి విలేకరులకు చెప్పారు. ఆప్‌ల్యాబ్స్‌ను విక్రయించినప్పటికీ రెండు కంపెనీల మధ్య విలీనప్రక్రియ పూర్తయ్యేవరకు ఏడాదిపాటు తాను సీఎస్‌సీలో కొనసాగుతానని ఆయన వెల్లడించారు. ఇన్వెస్టర్‌కు లాభదాయకమైన ఎగ్జిట్‌ను కల్పించేందుకు కంపెనీని పూర్తిగా విక్రయించాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇలావుండగా, 2004లో ఆప్‌ల్యాబ్స్‌లో వెస్ట్‌బ్రిడ్జ్(గతంలో సికోయా క్యాపిటల్‌లో భాగం) 2 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot