ఆన్‌లైన్ యోగా తరగతుల్లో జాయిన్ కావాలంటూ మెసేజ్‌లు వస్తున్నాయా..?
సైబర్ నేరగాళ్లు రోజుకో రకంగా మోసాలకు పాల్పడుతున్నారు. బాధితులు మాదిరిగా నటిస్తూ నేరాలు చేస్తున్నారు. పెరుగుతున్న టెక్నాలజీని వారికి అనుకూలంగా మార్చుకొని అందినకాడికి దోచుకుంటున్నారు. ఓ విద్యార్థి, వ్యాపారి ఫిర్యాదు దర్యాప్తులో బయటకొచ్చిన వివరాలు ఆధారంగా సైబర్ క్రైం పోలీసులు కీలక హెచ్చరికలు జారీచేశారు.
తొలుత ఫేస్‌బుక్ ద్వారా ఈ నేరాలు ప్రారంభం అవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ముందుగా ఫేస్‌బుక్ హ్యాక్ చేసి, అందులోని సభ్యులకు మెసెంజర్ ద్వారా నేరగాళ్లు సంప్రదించినట్లు పోలీసులు వెల్లడించారు. యోగా తరగతుల్లో పాల్గొనాలని చెప్పి పరిచయాలు పెంచుకుంటున్నారని తెలిపారు. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భాంగా ఇటువంటి మోసాలు ఎక్కువగా జరిగినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.

సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ యోగా తరగతుల్లో పాల్గొనాలని చెప్పి లింక్‌లు పంపుతున్నారని పోలీసులు వెల్లడించారు. ఆ లింక్‌ను క్లిక్ చేయాలని, అనంతరం వచ్చిన 6 అంకెల OTPని షేర్ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. లింక్ క్లిక్ చేసి, ఓటీపీ చెప్పిన తర్వాత వాట్సాప్‌లోకి నేరగాళ్లు లాగిన్ అవుతున్నారని ఈ కేసును దర్యాప్తు చేసిన ఓ అధికారి తెలిపారు.
యోగా తరగతుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓటీపీ అని బాధితులు భావిస్తున్నారని, కానీ ఆ ఓటీపీతో వాట్సాప్‌ను హ్యాక్ చేస్తున్నారని తెలిపారు. అనంతరం వాట్సాప్ అకౌంట్‌ను పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇదే తరహాలో అనేక మందిని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారని పోలీసులు చెప్పారు.
వాట్సాప్‌ను హ్యాక్ చేసి అందులోని కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారికి డబ్బులు పంపాలని కోరుతున్నారని పోలీసులు తెలిపారు. అత్యవసర పరిస్థితిలో ఉన్నామని, తర్వాత డబ్బులు తిరిగి ఇస్తామని చెబుతూ మోసం చేస్తున్నారని వెల్లడించారు. క్రిమినల్ నేరాలకు పాల్పడేందుకు కూడా ఆ వాట్సాప్ అకౌంట్లను సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్నారని తెలిపారు.
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే.. వాట్సాప్ యాక్సెస్‌ను తిరిగి పొందుతారని చెప్పి బాధితుల నుంచి సైబర్ నేరగాళ్లు.. బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులు చెప్పారు.
ఇటువంటి నేరాలు పట్ల నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని కోల్‌కతా సైబర్ క్రైం పోలీసులు హెచ్చరించారు.
ఫార్వడ్ మెసెజ్‌ల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలిసిన వ్యక్తుల వాట్సాప్ నుంచి అటువంటి మెసెజ్‌లు వచ్చినా స్పందించవద్దని హెచ్చరిస్తున్నారు. వాట్సాప్‌ను యాక్సెస్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు ఇటువంటి పద్ధతులను ఎంచుకుంటున్నారని పోలీసులు పేర్కొన్నారు. తమకు అటువంటి ఫిర్యాదులు వచ్చాయని, దానిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాని చెప్పారు.
* ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించుకొని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కేరళకు చెందిన ఓ వ్యక్తికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో ఇంటర్‌ఫేస్ ద్వారా ఫ్రెండ్ మాదిరిగా వీడియో కాల్ చేసి మోసం చేశారు. అతని దగ్గర నుంచి రూ.40,000 దోచుకున్నారు. బాధితుడు సరైన సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆ డబ్బును పోలీసులు బ్లాక్ చేశారు.
డబ్బులు పంపాలని, ఓటీపీలు షేర్ చేయాలని.. వీడియో కాల్ సహా ఇతర మార్గాల ద్వారా సంప్రదించినా అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు పోలీసులు సూచించారు. పూర్తి వివరాలు తెలుసుకొని మాత్రమే వారితో మాట్లాడాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.


Click it and Unblock the Notifications








